హనుమకొండ, జూలై 3: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే రేషన్ షాపుల్లో ఈ-పాస్ యంత్రాలు, బయోమెట్రిక్ విధానంతో కార్డుదారులకు బియ్యం అందజేస్తుండగా తాజాగా ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చింది. రేషన్ డీలర్లు వేలి ముద్ర వేస్తేనే కోటా విడుదలయ్యే కొత్త విధానం ఈనెల నుంచి హనుమకొండ జిల్లాలో రెండు ఎంఎల్ఎస్ పాయింట్లలో అమలవుతోంది. జిల్లాలో 414 రేషన్‌షాపులు ఉండగా మొత్తం 2,28,216 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. వారికి ప్రతినెల సుమారు 30వేల క్వింటాళ్ల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. నిరుపేదలకు పంపిణీ చేసే బియ్యంలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. ఇప్పటికే రేషన్ షాపుల్లో ఈ-పాస్ యంత్రాల ద్వారా బయోమెట్రిక్ విధానంలో కార్డుదారులకు బియ్యం అందజేస్తోంది. ఎంఎల్ఎస్ పాయింట్లలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బయో మెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చింది. రెండు నెలలుగా అమలు చేస్తున్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల సక్రమంగా అమలు కాలేదు. సాంకేతిక సమస్యలను పరిష్కరించడంతో ఈనెల నుంచి పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ వచ్చి వేలిముద్రతోనే రేషన్ డీలర్లకు కోటాను విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కొత్త విధానం హనుమకొండ జిల్లాలోని రెండు ఎంఎల్ఎస్ పాయింట్లలో అమలు చేస్తున్నారు. జిల్లాలో 414 రేషన్ షాపుల పరిధిలో అన్ని రకాల కార్డులు కలిపి మొత్తం 2,28,216 ఆహారభద్రత కార్డులు ఉన్నాయి. కార్డుదారులకు ప్రతినెల సుమారుగా 30వేల క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తున్నారు.
అక్రమాలకు చెక్
ఎంఎల్ఎస్ పాయింట్ (మండల స్థాయి స్టాక్ సెంటర్)లో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వనికి, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్‌షాపులకు బియ్యం కాంట్రాక్టర్లు కేటాయించిన ప్రత్యేక వాహనం ద్వారా బియ్యం చేరవేస్తారు. రేషన్ డీలర్లకు పంపిణీ చేసే క్రమంలో బియ్యం తూకంలో తేడాలు వస్తున్నాయని, దీంతో తాము నష్టపోతున్నామని డీలర్లు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల నిర్వాహకులు బియ్యం పక్కదారి పట్టించిన సందర్భాలు ఉన్నాయి. ఎలాగైనా ఈ అక్రమాలకు చెక్‌పెట్టాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకొంది. ఇప్పటివరకు రేషన్ కార్డుదారులకు పరిమితమైన బయోమెట్రిక్ విధానం (వేలి ముద్ర) రేషన్ డీలర్లకు పెట్టాలని నిర్ణయించింది.
జిల్లాలో 2,28,216 కార్డులు
జిల్లాలోని 14 మండలాలలోని 414 రేషన్ షాపుల పరిథిలో మొత్తం 2,28,216 ఆహార భద్రత కార్డులు ఉన్నట్లు సివిల్ సప్లయి అధికారులు లిపారు. వీటిలో 11,266 అంత్యోదయకార్డులు, 24 అన్న పూర్ణ కార్డులు, 2,16,926 ఆహార భద్రత కార్డులున్నాయి. అంత్యోదయ కార్డుల్లో ఒక్కో కార్డుకు 35కిలోల బియ్యం, ఆహార భద్రతకార్డుదారుల్లో ఒక్కొక్కరికి 6కిలోల బియ్యం, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల బియ్యం చొప్పున ఉచితంగా అందజేస్తున్నారు. జిల్లాలోని అన్ని కార్డులకు కలిపి నెలకు 30వేల క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తున్నారు. కాగా అంత్యోదయ కార్డుదారులకు మాత్రం కార్డుకు కేజీ చెక్కర అందజేస్తున్నారు.
రెండు ఎంఎల్ఎస్ పాయింట్లు
జిల్లాలో హనుమకొండ, పర్కాలలో ఎంఎల్ఎస్ పాయింట్ (మండల స్థాయి స్టాక్ సెంటర్)లు ఉన్నా యి. ఇక్కడి నుంచి జిల్లాలోని 14 మండలాల్లోని రేషన్ షాపులకు బియాన్ని స్టేజీ -2 కాంట్రాక్టర్ల ద్వారా కేటాయించిన ప్రత్యేక వాహనంలో సరఫరా చేస్తారు. హనుమకొండ ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో ఐనవోలు, కమలాపుర్, భీమదేవరపల్లి, ధర్మసాగర్, ఎల్కతుర్తి, హనుమకొండ, హసన్‌పర్తి, కాజీపేట, వేలేరు మండలాల్లోని 301 రేషన్ షాపులకు పంపుతారు. పరకాల ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ఆత్మకూర్, నడికూడ, పర్కాల్, దామెర, శాయంపేట మండలాల పరిధిలోని 113 రేషన్‌షాపులకు ప్రతి నెల బియ్యం సరఫరా చేస్తారు.
రేషన్ డీలర్ వేలి ముద్ర వేయాలి
ఎంఎల్ఎస్ పాయింట్లలో బయోమెట్రిక్ విధా నం అమలు చేస్తున్నాం. తూకంలో తేడాలు లేకుం డా, డీలర్లకు నష్టం జరుగకుండా కార్డుదారుల బియ్యం సక్రమంగా చేరాలని కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. డీలర్ తప్పకుండా వారి ఎంఎల్ఎస్ పాయింట్‌కు వెళ్లి వేలి ముద్ర వేస్తేనే ఆ నెల బియ్యం కోటా విడుదలై రేషన్‌షాపులకు చేరుతాయి.
– యు.మహేందర్,సివిల్ సప్లయి డీఎం, హనుమకొండ