‘మలిదశ తెలంగాణ ఉద్యమం నన్ను కలం పట్టుకునేలా చేసింది.. ఉద్యమ సందర్భంలో సాహితీ సమావేశాలు, ధూంధాంలు నాపై ఎంతగానో ప్రభావం చూపాయి.. ఆ స్ఫూర్తితోనే అనేక కవితలు, పాటలు రాశాను..’ అంటున్నారు ఉపాధ్యాయుడు, సాహితీవేత్త, సామాజిక సేవకుడు బిల్లా మహేందర్. నేడు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ‘బెస్ట్ రోల్ మోడల్-2022’ అవార్డు అందుకోనున్న సందర్భంగా శుక్రవారం ‘నమస్తే’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.
– హనుమకొండ, డిసెంబర్ 2
ఓవైపు ఉపాధ్యాయుడిగా విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తూ మరోవైపు సాహితీ సేవ చేస్తూనే సమాజ సేవలోనూ పాలుపంచుకుంటున్నారు. అనేక సంపుటాలు, కవిత్వాలు, రచనలతో తన తనలోని వైవిధ్యాన్ని చాటుకుంటున్న బిల్లా.. జిల్లాలో వివిధ సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ కొత్త కవులకు మార్గదర్శిగా నిలుస్తున్నారు. సాహిత్యంతో పాటు, దివ్యాంగుల సాధికారత కోసం కొన్నేళ్లుగా కృషి చేస్తున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా‘ బెస్ట్రోల్ మాడల్ -2022’ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా తాను పంచుకున్న ముచ్చట్లు ఆయన మాటల్లోనే.. మాది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేలేరు (మండల కేంద్రం) గ్రామం. అమ్మ జయ, నాన్న రాజమౌళి. మాది సామాన్య దిగువ తరగతి కుటుంబం. రెండో సంతానమైన నేను చిన్నతనంలోనే పోలియోబారిన పడ్డా. అంగవైకల్యంతో బాధపడుతూనే పట్టుదలతో వేలేరు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యాభ్యాసం చేశా. వరంగల్‌లోని చందా కాంతయ్య స్మారక కళాశాలలో ఇంటర్, డిగ్రీ, నాగార్జున సాగర్‌లో బీఎడ్, గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పూర్తి చేశా. 2000 సంవత్సరంలో డీఎస్సీ ద్వారా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా కొలువు సాధించి మొదట దేవురుప్పు ల మండలంలోని ప్రాథమిక పాఠశాల, తర్వాత నర్మెట్ట మండలంలోని ప్రాథమిక పాఠశాలలో వి ధులు నిర్వర్తించా. ప్రస్తుతం హసన్‌పర్తి మం డలం సుబ్బయ్యపల్లె ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. 2002లో నాకు సరితతో వివాహమైంది. మాకు అక్షిత్, ఆశ్రిత్ ఇద్దరు కొడుకులు.
తెలంగాణ మలిదశ ఉద్యమం నన్ను కలం పట్టుకునేలా చేసింది. ఆ సమయంలో నేను అనేక సాహితీ సమావేశాలకు, ధూంధాంలకు హాజరయ్యా. ఆ ప్రభావంతోనే అనేక కవితలు, పాటలు రచించిన. పోరుగానం(గేయ సంపుటి), బలిదానాలు మరుద్దాం(బుక్లెట్), పిడికిలి (తెలంగాణ కవిత్వం) లాంటి పుస్తకాలను ప్రచురించి తెలంగాణ ఉద్యమంలో నా గొంతుకను బలంగా వినిపించిన. సమాజంలో దివ్యాంగులు ఎదురొంటున్న వివిధ అసమానతలపై చలించి వారిలో ఆత్మవిశ్వాసాం నింపే ప్రయత్నంలో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలోని వందమంది కవులు రాసిన కవిత్వాన్ని ‘కాలాన్ని గెలుస్తూ’ అనే సంకలనాన్ని వెలువరించాను. తెలుగు సాహిత్య చరిత్రలో దివ్యాంగులపై వచ్చిన మొట్ట మొదటి సంకలనంగా నాకు ఈ పుస్తకం గొప్ప పేరు తెచ్చిపెట్టింది. అదే ఉత్సాహంతో దివ్యాంగులపై స్వయంగా రాసిన కవితలతో ‘గెలుపు చిరునామా’ అనే కవిత్వ సంపుటిని రచించాను. నా అనుభవాలు, జ్ఞాపకాలతో సామాజిక సమస్యలపై స్పందిస్తూ రాసిన పలు కవితలతో 2016లో ‘కొన్ని జ్ఞాపకాలు, కొన్ని ప్రశ్నలు’ అనే కవితా సంపుటి వెలువరించా. అదే సంవత్సరంలో తెలంగాణ రచయితల సంఘం-వరంగల్ శాఖకు సంయుక్త కార్యదర్శిగా నియమితుడినయ్యాను. నా పనితనంతో అనతికాలంలోనే ఎదిగి ప్రస్తుతం అదే సంస్థకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి సాహిత్య సేవ కొనసాగిస్తున్నా. చాలా సాహిత్య పత్రికలు, దిన పత్రికలు, మాస పత్రికలు, సంకలనాలు, వెబ్ పత్రికల్లో నేను రచించిన పలు కవితలు, పాటలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. మా స్వగ్రామం మీదున్న మకువతో నేను రాసిన పాటలతో ‘మా ఊరు’ అనే ఒక ఆడియో సీడీ కూడా విడుదల చేశాను.
విద్య ద్వారానే సమానత్వం సాధ్యమన్న అంబేదర్ ఆశయానికి అనుగుణంగా, ‘ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న’ అన్న మధర్ థెరిస్సా సూక్తిని స్ఫూర్తిగా తీసుకొని మిత్రులతో కలిసి 2014 ఏప్రిల్ 14న అంబేదర్ జయంతి రోజున ‘విద్య ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాను. దాని ద్వారా జిల్లాలోని దివ్యాంగులు, అనాథల విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసాం నింపేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. ఇటీవల తెలంగాణ రాష్ట్ర భాషా సాంసృతిక శాఖ, హైదరాబాద్ వారి సౌజన్యంతో నిర్వహించిన (వరంగల్) ‘దివ్యాంగుల సాంసృతికోత్సవం’ కార్యక్రమం ఎందరినో ఆకట్టుకున్నది. సంస్థ ద్వారా ఆయా విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నాం. ఫీజులు చెల్లిస్తున్నాం.. ఏటా పదో తరగతిలో అత్యధిక మారులు సాధించిన అనాథ, దివ్యాంగ విద్యార్థులకు ప్రతిభా పురషారాలు ప్రదానం చేస్తున్నాం..
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నయ్.. గతంలో దివ్యాంగులను అవమానించినవారు, కుటుంబ సభ్యులే ఇప్పుడు వారిపై ప్రేమానురాగాలు చూపిస్తున్నారు. రూ.316 ఉన్న పింఛన్‌ను రూ.3016కు పెంచడంతో దివ్యాంగుల్లో ఆత్మైస్థెర్యం పెంపొందింది. సమాజంలో వారికి గౌరవం పెరిగింది. దివ్యాంగులకు వివిధ సంక్షేమ పథకాలను అమ లు చేస్తున్న తెలంగాణ సర్కారు దివ్యాంగుల శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి విడదీసి ప్రత్యేక శాఖగా గుర్తించాలి.
బిల్లా చేస్తున్న సాహిత్య, సమాజ సేవలకుగాను అనేక జిల్లా, రాష్ట్ర స్థాయి అవార్డులను ఆయను వరించాయి. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుతో పాటు బోవేరా (బోయినపల్లి వేంకట రామారావు స్మారక) పురస్కారం, డాక్టర్ ద్వానా శాస్త్రి పురస్కారం, మహాత్మాజ్యోతిబా ఫూలే, స్ఫూర్తి -2018, శ్రీసాయి శాంతి సేవ, మదర్ థెరిస్సా పురస్కారం తదితర అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. చివరగా తన కుటుంబ సభ్యులు, మిత్రుల సహకారంతో అనేక సేవ, సాహితీ కార్యక్రమాలు చేపడుతామని, తన కవిత్వం ద్వారా సామాజిక చైతన్యానికి దోహదపడుతానని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడడమే తన ప్రధాన లక్ష్యమంటూ ముగించారు.