ములుగు, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): జీపీ కార్యదర్శి వేధింపులు తాళ లేక ఓ కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలకేంద్రంలో బుధవారం జరిగింది. డబ్బులు అడిగితే ఇవ్వకపోవడంతో వేధింపులకు గురి చేస్తున్నాడని పేర్కొంటూ గోవిందరావుపేట మండలకేంద్రానికి చెందిన చిలక వెంకన్న అనే జీపీ కార్మికుడు మనస్తాపంతో తన చావుకు కార్యదర్శి కారణమని పేర్కొంటూ డీపీవోకు మరణ వాంగ్మూలం రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఆయన రాసిన వాంగ్మూలం ప్రకారం… గతంలో ఎంపీడీవోగా పనిచేసిన జవహర్‌రెడ్డి రిటైర్మెంట్ సందర్భంలో జీపీ కార్యదర్శి (ఈవో) తనను రూ.35 వేలు అడిగాడని పేర్కొన్నాడు. తాను ఇవ్వనని చెప్పడంతో ఇబ్బంది పెట్టాడని, తన భార్యకు పక్షవాతం వచ్చిన సమయంలో 15 రోజుల సెలవు పెట్టినప్పుడు కూడా రూ. 30 వేలు అడిగితే తాను ఇవ్వలేదని పేర్కొన్నాడు. తన కొడుకు పెండ్లి గత నెల 24న జరగగా ఆ సమయంలో కూడా రూ. 50 వేలు అడిగాడని, అప్పు డు కూడా ఇవ్వలేదని అన్నారు.
ఈ నెల 4న అటెండర్ ముందు ఇష్టం వచ్చినట్లు తిట్టాడని, బుధవారం ఉదయం సిబ్బంది చెడిపోవడానికి నువ్వే కారణమని అని తిట్టాడని, తనను చాలా ఇబ్బంది పెడుతుండడంతో చనిపోతున్నానని పేర్కొన్నాడు. పురుగుల మందు తాగిన వెంకన్నను తోటి కార్మికులు ములుగు జీజీహెచ్‌కు తరలించగా ప్రథమ చికిత్స అనంతరం ఎంజీఎం దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వెంకన్న చికిత్స పొందుతున్నాడు. ఈ విషయమై కార్యదర్శి శంకరయ్య వివరణ కోరగా.. తాను ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని, వెంకన్న ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఏమిటో తనకు తెలియదన్నారు.
అధికారులు చర్యలు తీసుకోవాలి
గోవిందరావుపేట జీపీ కార్మికుడు వెంకన్న ఆత్మహత్యాయత్నానికి కారకులైన అధికారులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్(ఏఐటీయూసీ) జిల్లా ప్రధాన కార్యదర్శి బుడిమె సదయ్య, సీపీఎం మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డిలు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. కార్యదర్శి శంకరయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. స్వీపర్‌గా పర్మినెంట్ ఉద్యోగిగా చిలుక వెంకన్న పనిచేస్తున్నాడని తెలిపారు.