జనగామ చౌరస్తా, నవంబర్ 5: వారం రోజుల్లో గానుగుపహాడ్, చీటకోడూరు బ్రిడ్జిల నిర్మాణ పనులు ప్రారంభించకుంటే వేలాది మంది ప్రజలు, వందలాది గాడిదలు, దున్నపోతులతో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం జనగామ సబ్ జైలులో ఉన్న ఐదుగురు యువకులు కరుణాకర్, రఘు, ఎలేందర్‌రెడ్డి, ఉమాపతి, రాజును బీఆర్ఎస్ శ్రేణులు, ఆయా గ్రామాల ప్రజలతో కలిసి ఎమ్మెల్యే పరామర్శించారు. వారికి బెయిల్ త్వరగా వచ్చేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అనంతరం మాట్లాడుతూ గానుగుపహాడ్, చీటకోడూరు గ్రామాల్లో బ్రిడ్జిలు నిర్మించాలని నిరసన తెలిపిన ఐదుగురు యువకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి బెయిల్ రాకుండా 15 రోజుల పాటు జైలుకు తరలించిందన్నారు. గానుగుపహాడ్ బ్రిడ్జి నిర్మాణ పనులకు రూ.90 లక్షలు కాంట్రాక్టర్‌కు చెల్లిస్తే మిగతా పనులు పూర్తయి బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని సూచించారు. ఈ విషయంపై రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా మంత్రి కొండా సురేఖతోపాటు జిల్లా కలెక్టర్‌కు అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చినట్లు తెలిపారు.
అలాగే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జీరో అవర్‌లో స్పీకర్ ద్వారా బ్రిడ్జి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు పల్లా గుర్తు చేశారు. రెండేళ్లు గడుస్తున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. ప్రజల సమస్యను పరిష్కరించని, ఏమాత్రం స్పందించని మంత్రి ఫొటోను గాడిదకు తగిలించి నిరసన తెలిపితే తప్పేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాకు వారం రోజుల్లో వచ్చే నిధులు పెద్ద మొత్తంలో ఉంటే మంత్రి పొంగులేటి, మిగతావి మంత్రి కోమటిరెడ్డి తీసుకొని ప్రజల పనులను చేపట్టడంలేదన్నారు.
ఇంకా ఏమైనా అదనంగా కావాలంటే పారిశ్రామిక వేత్తల తలకు గన్నులు గురిపెట్టి సీఎం రేవంత్‌రెడ్డి అక్రమంగా వసూలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దండుపాళ్యం ముఠాగా మంత్రులు తయారయ్యాన్నారు. ప్రజలను దోచుకోవడం, దాచుకోవడం, వివాదాలు పెట్టుకొని పంచుకోవడంలో మంత్రులు మునిగిపోయారని విమర్శించారు. నేరస్తులు, దొంగలను పట్టుకోవడం చేతకాని జనగామ పోలీసులు ఎవరో చెప్పారని అమాయక ప్రజలను జైలుకు పంపుతూ ప్రభు భక్తిని చాటుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమానవీయంగా ఐదుగురు యువకులను జైలుకు పంపిన పోలీసులు, ఇతర శాఖల అధికారులను బీఆర్ఎస్ కచ్చితంగా గుర్తు పెట్టుకొని, వారి గురించి రాసి పెట్టుకుంటుందని హెచ్చరించారు. అనంతరం చీటకోడూరు, గానుగుపహాడ్‌కు చెందిన పలువురు గ్రామస్తులు, బీఆర్ఎస్ శ్రేణులు సుమారు 300 మందితో కలిసి జిల్లా కేంద్రంలోని జనగామ-సిద్దిపేట రహదారిపై ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద ఎమ్మెల్యే పల్లా ధర్నా నిర్వహించారు. 2 గంటల పాటు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఏసీపీ పండేరి చేతన్‌నితిన్ చేరుకొని ఎమ్మెల్యే పల్లాతో చర్చలు జరిపారు. జైలులో ఉన్న ఐదుగురు యువకులకు త్వరగా బెయిల్ వచ్చేలా పోలీసు శాఖ నుంచి సహరిస్తామని ఏసీపీ హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు శాంతించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్దె సిద్ధిలింగం, మాజీ ఎంపీపీలు బైరగోని యాదగిరి, మేకల కళింగరాజు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేశ్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, దళిత సంఘాలు, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.