సిటీ బ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మైనారిటీ కమిషన్ మాజీ చైర్మన్ అబిద్ రసూల్ ఖాన్ డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ లేకుంటే ముస్లింలు లేరని రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా ముస్లిం నేతలు కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి 1887లోనే బద్రుద్దీన్ త్యాబ్జీ తొలి ముస్లిం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని, మౌలానా అబుల్ కలాం ఆజాద్ రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేయడంతో పాటు దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. రేవంత్రెడ్డి బహిరంగంగా ముస్లింలను హేళన చేస్తూ మాట్లాడుతుంటే పక్కనే ఉన్న అసమర్థ మంత్రి, ఎమ్మెల్సీ ఏం చేయలక పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింల గురించి తప్పుగా మాట్లాడితే సహించమని హెచ్చరించారు.