హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ‘జూబ్లీహిల్స్’ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నదా..? సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రి వర్గంతో పాటు కీలక నేతలను ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో మోహరించినా.. ఫలితం ప్రతికూలంగా రానున్నదా..? మైనారిటీ ఓట్లతో ఎలాగో అలా ఒడ్డున పడదామనే వ్యూహంతో అజరుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చినా.. అది హిట్ వికెట్ కానుందా..? అంటే ‘మూడ్ ఆఫ్ జూబ్లీహిల్స్’ పేరిట ‘వోటా మీడియా హౌస్’, ‘పీపుల్స్ ఇన్సైట్’ అనే 2 సర్వే సంస్థలు తాజాగా నిర్వహించిన ఫలితాలు అవుననే సమాధానం చెబుతున్నాయి.
‘వోటా మీడియా హౌస్’ తాజా సర్వేలో బీఆర్ఎస్కు 48% మంది మద్దతు తెలిపినట్టు పేర్కొన్నది. అదే సమయంలో కాంగ్రెస్‌కు 42%, బీజేపీకి 9%, ఇతరులు 1% మంది మద్దతు తెలిపినట్టు వెల్లడించింది. అజారుద్దీన్‌కు మంత్రి పదవి వల్ల ముస్లింలలో కాంగ్రెస్‌కు ఆదరణ పెరిగిందా..? అని ప్రశ్నించగా.. 52%మంది పెరగలేదని పేర్కొన్నట్టు వివరించింది. ఎన్నికల స్టంట్ అని 16% మంది అభిప్రాయపడినట్టు తెలిపింది. 7% మంది మాత్రమే ఆదరణ పెరిగిందని చెప్పగా.. 25% మంది చెప్పలేమని సమాధామిచ్చినట్టు పేర్కొన్నది.
సీఎం పనితీరుకు ఎన్ని మార్కులు వేస్తారని ఓటర్లను ప్రశ్నించగా.. వందకు 25 మార్కులు వేస్తామని 67% మంది చెప్పడం గమనార్హం. ముస్లింలకు బీఆర్ఎస్ పార్టీ యే న్యాయం చేయగలదని 49% మంది పేర్కొనగా.. 45% మంది మాత్రమే కాం గ్రెస్ పార్టీ న్యాయం చేయగలదని చెప్పినట్టు తెలిపింది. జూబ్లీహిల్స్‌లో 50 శాతం మంది బీఆర్ఎస్సే బలమైన పార్టీ అని చెప్పినట్టు వెల్లడించింది. రెండేండ్ల కాంగ్రెస్ పాలన బాగలేదని 57% మంది చెప్పినట్టు పేర్కొంది. అక్రమ కట్టడాల కూల్చివేత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’ పనితీరుపై అభిప్రాయం కోరగా.. పెద్దోళ్లకే లాభం అని 22% శాతం మంది తెలిపినట్టు సర్వే వివరించింది. 33% మంది పేదోళ్లకు నష్టం అని, 37% అసలు అవసరమే లేదని చెప్పినట్టు తెలిపింది. కేవలం 8% మంది మాత్రమే హైడ్రా మంచిదే అని తెలిపినట్టు వివరించింది. 46% మంది లోకల్, నాన్ లోకల్ ప్రభావం ఈ ఉప ఎన్నికలో ఉండదంటున్నారని తెలిపింది.

ఇక ఈ సర్వేలో కేసీఆర్ పాలనే బెటర్ అని 61% మంది అభిప్రాయపడినట్టు సర్వే వెల్లడించింది. పురుషుల కంటే మహిళలు 1 శాతం బీఆర్ఎస్కు మద్దతు తెలిపినట్టు వివరించింది. మైనారిటీలకు మేలు చేసే పార్టీ బీఆర్ఎస్ అని పురుషుల కంటే మహిళలు 6 శాతం అధికంగా అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిపింది. షేక్‌పేట్‌లో బీఆర్ఎస్ 52%తో బలంగా ఉన్నట్టు తెలిపింది. కాంగ్రెస్ 39%, బీజేపీ 8%,యూసుఫ్ గూడలో బీఆర్ఎస్ 50%, కాంగ్రెస్ 40%, బోరబండలో బీఆర్ఎస్ 49% తో స్ట్రాంగ్‌గా ఉన్నట్టు సర్వే తెలిపింది. ఎర్రగడ్డలో రెండు పార్టీల మధ్య పోటాపోటీ ఉన్నట్టు పేర్కొంది. బీఆర్ఎస్ 46%తో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 43% తో ఉన్నట్టు తెలిపింది. వెంగళ్రావునగర్లో బీఆర్ఎస్ 45%, కాంగ్రెస్ 44%, బీజేపీకి 10% ఉన్నట్టు తెలిపింది. రహ్మత్‌నగర్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు 45% ఉన్నట్టు తెలిపింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురనున్నట్టు ‘పీపుల్స్ ఇన్సైట్’ నిర్వహించిన సర్వే తేల్చింది. ఈ సర్వేలో బీఆర్ఎస్కు 44.03%, కాంగ్రెస్‌కు 39.44%, బీజేపీకి 13.94% ఓటు షేర్ రానున్నట్టు వెల్లడించింది.