పలిమెల/మహదేవపూర్,నవంబర్ 5 : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం అడవుల్లో 15 నెలల క్రితం టోర్నడో తరహా సుడిగాలి విధ్వంసం సృష్టించింది. 2024 ఆగస్టు 31న చోటుచేసుకున్న ఈ ఘటనలో వేల సంఖ్యలో చెట్లు నేలమట్టమయ్యాయి. ఇప్పుడు అదే తరహాలో జయశంకర్ జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డ గ్రామంలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. మంగళవారం సాయంత్రం అతివేగంగా వీచిన గాలికి తోడైన వాన 15 నిమిషాల్లోనే అల్లకల్లోలం చేసింది.
గోదావరి నదీ తీరంలో ప్రారంభమైన సుడిగాలి బండల వాగు మీదుగా రెండు కిలోమీటర్ల మేర ప్రభావం చూపింది. దీంతో అడవిలోని వందల సంఖ్యలో భారీ చెట్లతో పాటు 30 ఎకరాల్లో పత్తి, 10 ఎకరాల్లో మిరప, ఐదెకరాల్లో వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అకడే పంట పొలాల్లో పనులు చేస్తుకుంటున్న రైతులు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. సుడిగాలి తీవ్రతకు పంటపొలాల్లో ఉన్న ప్లాస్టిక్ నీళ్ల డ్రమ్ములు గాల్లో ఎగిరిపోగా, ఎడ్ల బండ్లు గాలికి పల్టీలు కొట్టినట్లు స్థానిక రైతులు చెబుతున్నారు.
అయితే గాలి తగ్గగానే హుటాహుటిన ఇంటిదారి పట్టిన రైతులు బుధవారం ఉదయం తమ పంట పొలాల వద్దకు వచ్చి జరిగిన నష్టాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. గాలివాన బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కాగా, మేడారంలో జరిగిన విధ్వంసమే ఇక్కడ పునరావృతమైందని స్థానికులు చర్చించుకుంటున్నారు. సుడిగాలి బీభత్సంతో అడవికి జరిగిన నష్టంపై క్షేత్రస్థాయిలో అంచనా వేయనున్నట్లు ఎఫ్ఆర్వో నాగరాజు
పరుగులు తీశాం..
పొలం పనులు చేస్తుండగా ఒక్కసారిగా సుడిగాలి వచ్చింది. ఏం జరుగుతుందో అర్థం కాలే. వస్తువులు గాల్లోకి ఎగురుతున్నయ్. వెంటనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి పరుగులుతీశాం. ఇంతటి గాలివాన ఇప్పటి వరకు మేము ఎన్నడూ చూడలే. గాలివానతో గ్రామంలో అందరు ఇబ్బంది పడ్డారు. పదిహేను నిమిషాల్లోనే అంతా ఆగమాగమైంది.
– సరిత, మహిళా రైతు
కొమ్మను పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నా..
గ్రామ శివారులోని అటవీక్షేత్రంలో ఎద్దులను కాసుకుంటున్న. ఎటు నుంచి వచ్చిందో తెల్వది.. ఒక్కసారిగా గాలివాన అందుకున్నది. పశువులు బెదిరి పారిపోయినయ్. నాకేం అర్థంకాక అక్కడే ఉన్న ఓ చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకొని గాలి తగ్గేవరకు అక్కడే ఉన్న. నేను బతుకుతా అని అనుకోలే. ఇంత సుడిగాలిలో నుంచి క్షేమంగా బయటపడడం నా అదృష్టం.
– పాయిలి చొక్కారావు, పశువుల కాపరి