హనుమకొండ, మే 22 : హనుమకొండ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో దళిత ఉద్యమ నేత, వైతాళికుడు, మాదరి భాగ్యరెడ్డి వర్మ 137 జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా భాగ్యరెడ్డి వర్మ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇన్చార్జి అదనపు కలెక్టర్లు వై వి గణేష్, మేన శ్రీను మాట్లాడుతూ ఆది మూలవాసుల చైతన్య వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ అన్నారు. దళిత సంక్షేమం కోసం పాఠశాలలు, వివిధ సంస్థలను స్థాపించి అందరికీ విద్య అందించాలని లక్ష్యంతో హైదరాబాద్ నడిబొడ్డున ఆది హిందూ భవన్ ను ఏర్పాటు చేసిన ఘనత భాగ్యరెడ్డిదని పేర్కొన్నారు.
భాగ్యరెడ్డి వర్మ ఆశయాలను ప్రభుత్వం కొనసాగిస్తూ వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. రాష్ర్ట ప్రజలందరూ కూడా భాగ్యరెడ్డి వర్మను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఏ. శ్రీలత, షెడ్యూల్ కులాల అధ్యయన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె.జగన్ మోహన్, జి. అనిల్ కుమార్, కనకరాజు, శ్రీనివాస్, కవిత వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.