జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం అంకుశాపూర్ గ్రామంలో పంట పొలాలకు సాగునీరందక రైతులు రోదిస్తున్నారు. ప్రభుత్వం ఎంపిక చేసుకున్న పైలట్ గ్రామంలో పథకాల అమలు దేవుడెరుగు. కనీసం పంట చేతికొచ్చే దశలో చి‘వరి’ తడికి గట్టెక్కేదెలా అని మదనపడుతున్నారు. సర్కారు సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఊహించని విధంగా చలివాగు పూర్తిగా ఎండిపోయి చుక్క నీరు లేక ఎడారిని తలపిస్తుండడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వాగులో బోర్లు వేస్తూ పూడికతీస్తూ భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. తాగునీటికి సైతం గ్రామస్తులు తండ్లాడుతున్నారు.
– జయశంకర్ భూపాలపల్లి, మార్చి 26(నమస్తే తెలంగాణ)
అంకుశాపురంలో ఇప్పటి వరకు సుమారు 40 ఎకరాల్లో వరి పంటలు నీరందక ఎండిపోయాయి. గ్రామంలో 311.34 ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా 683 మంది జనాభా ఉన్నారు. సుమారు 231 ఎకరాల్లో వరి, 70 ఎకరాల్లో మక్కజొన్న వేశారు. కాగా సాగు నీరు లేక భూములు నెర్రెలు బారి ఎండిపోయాయి. పంటలపై రైతులు ఆశలు వదులుకున్నారు. ఇక్కడ జనవరి 2023లో భూగర్భ జలాలు 1.93 మీటర్లు నమోదు కాగా, జనవరి 2024లో 2.64 మీటర్లకు పడిపోయాయి. ఫిబ్రవరి 2023లో 2.17 మీటర్లు ఉండగా, ఫిబ్రవరి 2024లో 2.93 మీటర్లు, జనవరి 2025లో 3.47 మీటర్లు, ఫిబ్రవరిలో 3.81 మీటర్లకు అడుగంటిపోయాయి. గ్రామంలోని తాగునీటి బావి సైతం ఎండిపోవడంతో వ్యవసాయ బోర్ల నుంచి నీటిని నింపుతూ గ్రామస్తులకు మంచినీటిని అందిస్తున్నారు.
చలివాగే ఆధారం
అంకుశాపురం గ్రామానికి చలివాగే ఆధారం. అందులో నీళ్లు లేకపోవడంతో గ్రామస్తులు అటు సాగు, ఇటు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. చెక్ డ్యాం పనికిరాకుండా పోయింది. రైతులు వాగులో పూడికతీస్తూ, బోర్లు వేసుకుంటూ నీటి కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఎంతో కొంత వచ్చే నీటితో పంట పొలాలకు నీరందిస్తూ కాపాడుకుంటున్నారు. కొంత పొలం ఎండిపోయినా ఉన్నదానినైనా బతికించుకుందామని ఆరాట పడుతున్నారు. సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలో నీటి కరువు రావడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరో 15 రోజులైతే ఈ మాత్రం నీళ్లు దొరకవని వాపోతున్నారు.
ఐదెకరాలు ఎండింది..
చలివాగు వెంట నేను 12 ఎకరాల వరి పంట వేసిన. ఇప్పటి వరకు నీళ్లు అందక ఐదెకరాలు ఎండిపోయింది. ఇంకా ఎంత ఎండిపోతదో ఏమో. బోర్ల ద్వారా కొంత వరకు పంటను కాపాడుకుంటున్నా. చలివాగులో ఎప్పుడూ పుష్కలంగా నీళ్లుండేవి. చెక్‌డ్యాం నిండుకుండలా ఉండేది. మా ఊరిలో సుమారు 40 ఎకరాలపైనే వరి పంట ఎండిపోయింది. ఇంకో నెల రోజులు గడిస్తే పరిస్థితి ఎలా ఉంటదో చూడాలి. సాగునీరందక చాలా నష్టపోయాం. మిషన్ భగీరథ నీరు సరిపోకపోవడంతో తాగునీరందించే బావిలోకి వ్యవసాయ మోటర్ల ద్వారా నీరు నింపి గ్రామస్తులకు అందిస్తున్నాం. కేసీఆర్ పాలనలో ఎప్పుడూ ఇలాంటి కరువు పరిస్థితులు రాలేదు.
– గాలి చంద్రమౌళి, మాజీ సర్పంచ్
సాగునీరందించలేని దుస్థితిలో సర్కారు
రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. మా ఊరిని పైలట్ గ్రామంగా ఎంపిక చేశారు. మరి ఇక్కడ అభివృద్ధి ఏదీ? ప్రభుత్వం కనీసం సాగునీరు, తాగునీరు కూడా అందించలేని దుస్థితిలో ఉంది. ఎన్నడూ ఇంత కరువు రాలేదు. ఇప్పుడు చలివాగులో చుక్క నీరు లేదు. అందులో బోర్లు వేస్తున్నాం. అయినా నీరు సరిపోవడంలేదు. పంటలు సగానికి పైగా ఎండిపోయాయి. గత కాంగ్రెస్ పాలన ఇప్పుడు మళ్లీ గుర్తుకు వస్తున్నది.
– కౌడగాని రాజేంద్రప్రసాద్, రైతు