దేవరుప్పుల, సెప్టెంబర్ 21 : బీఆర్ఎస్ నాయకులకు బాసటగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నిలిచారు. అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా పోలీసు స్టేషన్‌కు బయలుదేరారు. న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సోమవారం వరకు సమస్యను పరిష్కరిస్తానని వరంగల్ సీపీ హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలం చినమడూరులోని ధృవ వెంచర్ వ్యవహారంలో ఇద్దరు రియ ల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఇం దులో కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకొని ప్రత్యర్థులను బెదిరించి కిడ్నాప్‌నకు పాల్పడ్డారు. దీనిని ఎత్తిచూపిన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నా యకుల ఒత్తిడి మేరకు పో లీసులు చినమడూరుకు చెం దిన మాజీ సర్పంచ్ వంగ ప ద్మ కుమారుడు అర్జున్, ఎంపీటీసీ గొడుగు సుజాత భర్త మల్లికార్జున్‌పై శ నివారం అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావడంతో దేవరుప్పుల చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్‌కు ర్యాలీగా బ యలుదేరారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
ఈ క్రమంలో వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య ర్యాలీ వద్దకు చేరుకొని ఎర్రబెల్లికి నచ్చజె ప్పే ప్రయత్నం చేయడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారిని కి డ్నాప్ చేసిన కాంగ్రెస్ నాయకులను వదిలి తమ వారిని ఎలా అరెస్ట్ చేస్తారని ఆయనను నిలదీశారు. అన్ని ఆధారాలను తాము ఇప్పటికే పోలీసులకు సమర్పించామని, బాధితుడిని చంపుతామని బెదిరించడంతో పోలీస్‌స్టేషన్‌కు రావడం లేదన్నారు. కాగా కిడ్నాప్‌కు గురైన బాధితుడు ఇప్పటికే పోలీసులకు పోస్టు ద్వారా ఫిర్యాదు పంపాడని, దానిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎర్రబెల్లి ప్రశ్నించారు. న్యాయం చేస్తామని జనగామ డీపీపీ రాజమహేంద్ర నాయక్ హామీ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆయన ఎర్రబెల్లితో ఫోన్లో మాట్లాడారు. తాను సోమవారం వరకు కేసు నమోదు చేస్తానని హామీ ఇవ్వడంతో ర్యాలీని నిలిపివేసి, రోడ్డు పక్కన ఓ ఇం ట్లో బీఆర్ఎస్ శ్రేణులతో కూర్చున్నారు. అదే సమయంలో ఎర్రబెల్లికి వరంగల్ సీపీ అంబర్ కిషోర్‌ఝా ఫోన్ చేసి తాను సోమవారం వరకు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో కిడ్నాప్‌నకు గురైన బాధితుడికి న్యాయం చేయాలని పార్టీ మండల అధ్యక్షుడు తీగల దయాకర్ ఇచ్చిన పిటిషన్‌ను పార్టీ శ్రేణులతో కలిసి ఎస్సై సృజన్కుమార్కు అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ నేతృత్వంలో పాలకుర్తి, కొడకండ్ల, జఫర్ఘడ్, లింగాలఘనపురం, రఘునాథలపల్లి ఎస్సైల ఆధ్వర్యంలో భారీగా పోలీసులను మోహరించారు.
పాలకుర్తిలో పోలీసులు అధికార పక్షాన ఉంటూ ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని మా జీ మంత్రి ఎర్రబెల్లి అన్నా రు. కాంగ్రెస్ నాయకులు పాండురంగం అనే వ్యక్తిని కి డ్నాప్ చేసి రెండు రోజులు ఓ ఇంట్లో నిర్బంధించి దేవరుప్పుల తహసీల్ కార్యాలయంలో అతనిచేత బలంవంతంగా రిజిస్ర్టేషన్ చేయించుకున్నారని తెలిపారు. బాధితుడు స్ధానిక బీఆర్ఎస్ నాయకులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని, దీనిని రెండు రోజులుగా మీడియా సమక్షంలో తమ నాయకులు ప్రశ్నిస్తుండడంతో అధికార పార్టీ నాయకులు కావాలని చినమడూరుకు చెందిన ఇద్దరిపై శనివారం అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపారన్నారు. సీపీ సోమవారం వరకు సమస్యను పరిష్కరిస్తానని, నిందితులపై కేసు నమోదు చేస్తానని హామీ ఇచ్చారని, అలా జరగని పక్షంలో ఈనెల 27న మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి వేలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కే పరిస్ధితి ఉంటుందని దయాకర్‌రావు హెచ్చరించారు. అధికారం ఉందని బీఆర్ఎస్ నాయకుల జోలికి వస్తే ఊరుకునేది లేదని, కార్యకర్తల కోసం అవసరమైతే జైలుకు పోతానని దయాకర్‌రావు స్పష్టం చేశారు.