అధిష్టానం పిలుపు మేరకు ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ధర్నా, రాస్తారోకోలు చేయగా అన్ని చోట్లా మోదీ వ్యతిరేక నినాదాలు, దిష్టిబొమ్మల దహనాలతో హోరెత్తించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో తలపెట్టిన ధర్నాలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొని బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు.

హనుమకొండలోని కాళోజీ జంక్షన్ వద్ద తలపెట్టిన నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య పాల్గొన్నారు. భూపాలపల్లిలోని అంబేద్కర్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మహబూబాబాద్‌లోని నెహ్రూసెంటర్‌లో తలపెట్టిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, వరంగల్ జిల్లాకేంద్రంలోని వరంగల్చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొని నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
– నమస్తే నెట్వర్క్, మార్చి 16

