రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, జిల్లా ఉన్నతాధికారుల అలసత్వంతో భద్రకాళీ చెరువు సుందరీకరణ ప్రాజెక్టు అయోమయంలో పడింది. సరైన ప్రణాళిక లేక చెరువు పూడికతీత పనులు సగంలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే వానకాలంలోపే పూడిక మట్టినంతా తీసివేయాల్సి ఉండగా ఇప్పటికి 30 శాతం పనులే పూర్తికాలేదు. 18లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 6.40 లక్షల క్యూబిక్ మీటర్లు మాత్రమే పూడికతీయగా ఇటీవలి వర్షాలతో వారం రోజులుగా పనులు మొత్తానికే నిలిచిపోయాయి. ఇక జోరు వానలు కురిస్తే మళ్లీ పూడికతీయడం అనుమానంగా కనిపిస్తోంది. ఓ వైపు చెరువులో పూడిక అలాగే ఉన్న నేపథ్యంలో భద్రకాళీ చెరువు అభివృద్ధి, సుందరీకరణ అమలుపై అయోమయం నెలకొన్నది. పూడికకు మార్చి, ఏప్రిల్ నెలల్లో అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు తాత్సారం చేయడం వల్లే రెండున్నర నెలలైనా పూడికతీత పూర్తికాలేదని, స్వయంగా మంత్రులు ఆదేశించినప్పటికీ సగం పనులే చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
– వరంగల్, మే 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వర్షాకాలం మొదలయ్యేలోపు భద్రకాళీ చెరువు పూడికతీత పూర్తి చేయాలనే లక్ష్యం మేరకు ఎక్కడా పనులు జరగలేదు. రెండున్నర నెలల క్రితం పనులు మొదలుపెట్టినా ఇప్పటికీ సగం కూడా కాలేదు. 382 ఎకరాల విస్తీర్ణం కలిగిన భద్రకాళీ చెరువు పూడికతీత పను లు చేపట్టాలని ప్రభుత్వం గత నవంబర్‌లో నిర్ణయించింది. హడావుడిగా చెరువులోని నీటిని ఖాళీ చేయించింది. 18లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత ఉన్నట్లు నిర్ధారించిన సాగునీటి శాఖ మార్చిలో పూడికతీత పనులు ప్రారంభించింది. చెరువు ను మొత్తం 5 జోన్లుగా విభజించి తొలుత మూడు జోన్లలో పూడికతీసి మట్టిని తరలించాలని నిర్ణయించారు.
అయితే మార్చి 11న పూడికతీత మొదలైనా జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో పనులు అనుకున్నట్లు జరుగలేదు. సాగునీటి శాఖ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 3.40 లక్షల క్యూబిక్ మీటర్ల కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) మరో 3 లక్షల క్యూబిక్ మీటర్లు పూడిక తీశాయి. చెరువు పక్కనే మాడ వీధులు నిర్మిస్తున్న క్రమంలో ఈ మట్టిని అక్కడికి తరలించారు. మాఢవీధుల పనులు కుడా ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. సాగునీటి శాఖ, కుడా కలిపి మొత్తంగా ఇప్పటి వరకు 6.40 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మాత్రమే తీయగా మిగతా పూడికతీత విషయంలో స్పష్టత కరువైంది.
మంత్రులు చెప్పినా కానరాని పురోగతి
పూడికతీత పనులను ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నీటి పారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా మంత్రి కొండా సురేఖ స్వయంగా పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. జిల్లా ఉన్నతాధికారులు ప్రణాళిక ప్రకారం వ్యవహరించడకపోవడం వల్లే పూడికతీత పూర్తి కాలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రెండున్నర నెలల్లో 3.40 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక మాత్రమే తీయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మార్చి, ఏప్రిల్‌తో పాటు మే మూడు వారాల్లోనూ పూడిక తీసేందుకు అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్లే పనులు కాలేదనే విమర్శలు ఉన్నాయి. కొద్దిరోజులుగా వరుసగా వర్షాలు పడుతుండడం, చెరువు అడుగు భాగమంతా తేమగా మారడం, బురద ఉన్న కారణంగా టిప్పర్లు చెరువులోకి దిగలేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మిగిలి ఉన్న 14.60 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని ఏం చేస్తారనేది తెలియడం లేదు. పూడిక తీయనిదే భద్రకాళీ చెరువు సుందరీకరణ పనులు ముందుకు సాగే అవకాశం లేదు. భద్రకాళీ ఆలయ మాఢ వీధుల నిర్మాణం, చెరువులో బోటింగ్, ట్యాంక్‌బండ్ విస్తరణ అన్ని పనులకు ఇప్పుడు అడ్డంకులు ఏర్పడే పరిస్థితి వచ్చింది.