వరంగల్, అక్టోబర్ 1 : వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పదో రోజైన బుధవారం అమ్మవారు మహిషాసురమర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం వసంతోత్సవం, సాయంత్రం పుష్పరథ సేవ నిర్వహించారు. మధ్యాహ్నం జరిగిన పూర్ణాహుతిలో హైకోర్టు న్యాయమూర్తి కందికొండ నర్సింగరావు దంపతులు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు.
అమ్మవారిని గోవా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే దంపతులు, ఎమ్మెల్యే ఐశ్వర్య రాణే, అరుంధతి రాణే, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో పాటు పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆలయంలో ఏర్పాట్లను ఈవో రామల సునీత పర్యవేక్షించారు. కాగా, భద్రకాళీ చెరువులో నీళ్లు లేని కారణంగా విజయదశమి రోజు అమ్మవారికి నిర్వహించే తెప్పోత్సవాన్ని రద్దు చేయడంతో భక్తులు నిరాశ చెందుతున్నారు.