Wines | సుబేదారి/గోవిందరావుపేట, ఫిబ్రవరి11 : మద్యం ప్రియులపై రాష్ట్ర ప్రభుత్వం భారం మోపిం ది. రేట్లు పెంచడంతో వేసవికి ముందే చల్లని బీర్లు వేడి పుట్టిస్తున్నాయి. అన్ని బ్రాండ్లపై గరిష్ట ధరపై 15శాతం అదనంగా పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభు త్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో అన్ని రకాల బీర్ల రేట్లు రూ. 20 నుంచి రూ. 30కి పైగా పెరిగాయి. కేఎఫ్ లైట్ బీర్ రూ. 150 ఉండగా ప్రస్తుతం రూ.172.50కు విక్రయిస్తున్నారు. కేఎఫ్ ప్రీమియం రూ.160, రూ. 184, కేఎఫ్ అల్ట్రా రూ. 210 నుంచి రూ.241.5, ఇలా అన్నింటి ధరలు పెంచి అమ్ముతున్నారు. దీనికి తోడు బెల్ట్ షాపుల్లో సైతం కొత్త రేట్లపై ఒక్కో బీరుకు రూ. 30 నుంచి రూ. 40 వరకు అదనంగా పెంచి విక్రయిస్తున్నారు.
కొత్త ధరల అమలు విషయంలో ఎక్సైజ్ శాఖ నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు ఆదేశా లు రాకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 294 వైన్స్ ఓనర్లు అయోమయంలో పడ్డారు. కొ న్ని చోట్ల షాపులను మధ్యాహ్నం 3 గంటల వరకు తెరవలేదు. కొన్ని ప్రాంతాల్లో పాత రేట్లకు, మరికొన్ని చోట్ల కొత్త ధరలతో విక్రయించారు. అయితే పాత స్టాక్‌ను కొత్త రేట్లకు ఎలా విక్రయిస్తారంటూ మద్యం ప్రియులు షాపుల నిర్వాహకులతో గొడవకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకు 4.50 లక్షల బీర్ పెట్టెల విక్రయాలు జరుగుతాయి. జనవరిలో 4,49,672 బీర్ పెట్టెలు అమ్ముడైనట్లు ఎక్సైజ్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన వేసవిలో రోజుకు సగటున 40 వేల నుంచి 50 వేల బీర్ పెట్టెల అమ్మకం జరగనున్నట్లు అధికారులు తెలిపారు.