హనుమకొండ, ఆగస్టు 8 : ఎన్నికల ముందు అర్హులైన ప్రతి ఒకరికీ పింఛన్ (చేయూత)అందిస్తామని, ఉన్న పింఛన్లను పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది. అర్హత ఉండి పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వృద్ధులు, బీడీ కార్మికులకు ‘చేయూత’ అందక ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగులుతున్నది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మూడేళ్లుగా ‘ఇప్పుడిస్తాం… అప్పుడిస్తాం’ అని ఊరిస్తూ వస్తున్న సర్కారు తీరా కొన్ని వర్గాలకే పరిమితం చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వృద్ధులు, బీడీ కార్మికులకు ఉట్టి చేతులే మిగులుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లలోగానీ, కొత్తగా దరఖాస్తు చేసుకొన్న వారిలో సైతం వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండడం విశేషం. వీరికి సర్కారు మొండిచేయి చూపడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఇప్పటికే దరఖాస్తు చేసుకొని పరిశీలన పూర్తయి, మంజూరు కోసం ఎదురు చూస్తున్న వారు మళ్లీ ప్రభుత్వం జారీ చేసిన కొత్త ఫార్మెట్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాల్సిందనేని అధికారులు స్పష్టం చేశారు. కొత్త పార్మెట్ ప్రకారం దరఖాస్తు ప్రక్రియను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేసి, కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆ దిశగా కసరత్తు చేస్తున్నది. అయితే, ఈ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని అధికారులు పంచాయతీ సెక్రటరీలు, వార్డ్ ఆఫీసర్లను ఆదేశించగా, వారం రోజుల సమయం కూడా లేదు.. సాధ్యం కాదని అధికారులకు తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, స్థానిక సంస్థల పనులతో సిబ్బంది బిజీగా ఉన్నారని, ఇంత తకువ సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులను పరిశీలించడం ఎలా సాధ్యమని పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రతి దరఖాస్తుదారుడి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత నిర్ధారించాల్సి ఉండగా, గడువు తకువగా ఉండడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన గడువులోగా కొత్త ఫార్మెట్ ప్రకారం దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుందా లేదా వేచి చూడాల్సిందే.
కొత్త పింఛన్ల విషయంలో మూడేళ్లుగా ఊరిస్తున్న ప్రభుత్వం ఎట్టకేలకు ఈ నెల 15 ఇచ్చేందుకు నిర్ణయిం తీసుకున్నది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లా యంత్రాంగం సైతం ఏర్పాట్లులో నిమగ్నమైంది. కాగా మొదటి ప్రాధాన్యతగా ఒంటిరి మహిళలు, వితంతువులు, వీరితోపాటు కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, దివ్యాంగులు (కొత్తగా తలసీమియా, సికిల్ సెల్, హిమోఫీలియా బాధితులను చేర్చారు), ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేయనున్నారు. అయితే ఇందులో కొన్ని వర్గాలనే చేర్చి, వృద్ధులు, బీడీ కార్మికులకు ఉట్టి చేతులు చూపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పింఛన్ వస్తుందని ఎన్నోఏళ్లుగా ఎదురు చూస్తున్న వృద్ధులకు నిరాశే మిగిలింది.
బీడీ కార్మికుల పరిస్థితి కూడా అంతే. కుటుంబ పోషణ, మందులు, నిత్యావసరాల కోసం పింఛన్ ఎంతో ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. అర్హత ఉన్నా పింఛన్ అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురొంటున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం పునరాలోచించి వృద్ధులు, బీడీ కార్మికులకు సైతం పింఛన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి కొత్త ఫార్మాట్ ప్రకారం వివరాలు సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఇచ్చిన దరఖాస్తులు, సేకరించిన వివరాలు ఉన్నా మళ్లీ కొత్త ఫార్మెట్ ప్రకారం వివరాలు తీసుకోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. పింఛన్ వస్తుందన్న ఆశతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వృద్ధులకు ఈ ప్రక్రియ మరింత ఇబ్బందిగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హనుమకొండ జిల్లాలో పింఛన్ల కోసం ఎదురు చేస్తున్న 3565 మందికి నిరాశే ఎదురైంది. కొత్తగా మంజూరు చేస్తున్న పింఛన్లలో వృద్ధులు, బీడీ కార్మికులను చేర్చకపోవడం సరికాదని పలువురు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం అన్ని వర్గాల వారికి పింఛన్ ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని వర్గాలకే పరిమితం చేయడంపై మండిపడుతున్నారు. కాగా, 3565 మందిలో 3052 మంది వృద్ధులు, 513 మంది బీడీ కార్మికులు ఉన్నట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి.
అలాగే ప్రస్తుతం వృద్దులు, వితంతు, దివ్యాంగులు, కల్లుగీత, చేనేత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు కలిసి జిల్లాలో 1,00504 మంది పింఛన్ దారులు ఉన్నారు. కొత్త పింఛన్ల మంజూరు విషయంలో డీఆర్డీఏ అధికారులను సంప్రదించగా ప్రభుత్వం కొత్త పార్మెట్ ప్రకారం మళ్లీ వివరాలు నమోదు చేయాలని ఆదేశించారని తెలిపారు. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులకు, వార్డు ఆఫీసర్లకు కొత్త పార్మెట్ ప్రకారం ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలని చెప్పడం జరిగిందని, 15వ తేదీన కొత్త పించన్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే కొత్త పింఛన్లలో వృద్ధులు, బీడీ కార్మికులను చేర్చలేదని తెలిపారు.