గులాబీ జెండానే నమ్ముకొని పార్టీ బలోపేతం కోసం ఎల్లవేళలా సైనికుడిలా పనిచేసిన కార్యకర్తలకు కష్టకాలంలో నేనున్నా అంటూ భరోసానిస్తున్నది బీఆర్ఎస్. ఉద్యమకాలం నుంచీ నాయకుడు కేసీఆర్ ఇచ్చిన పిలుపును అందుకొని, ఎక్కడ మీటింగ్ ఉన్నా కండువాతో కదిలి, కదంతొక్కే ప్రతి కార్యకర్తను అక్కున చేర్చుకొని అవకాశాల్వివడమే గాక ఆపద వచ్చినప్పుడు అతడి కుటుంబానికీ అండగా నిలుస్తున్నది. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు రూ.2లక్షల ఇన్సురెన్స్ చేయించి ప్రమాదవశాత్తు మృతిచెందిన సమయంలో ఆ కుటుంబానికి సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తమ కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆర్థికంగా ఆదుకుంటూ కొండంత ధైర్యం ఇచ్చిందని కార్యకర్తల కుటుంబాలు ఉద్వేగంతో చెబుతున్నాయి.
– నమస్తే నెట్వర్క్, సెప్టెంబర్ 26
ఏటూరునాగారం, సెప్టెంబర్ 26 : నా భర్త ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేది. కొంత భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకునేవాళ్లం. లేనపుడు కూలీకి పోయేటోడు. రెండు సంవత్సరాల క్రితం ట్రాక్టర్ కింద పడి భర్త యోహాను చనిపోయాడు. నాకు ఇద్దరు పిల్లలు. జననికి ఏడేళ్లు, సురక్షితకు నాలుగేళ్లు. యోహానుకు తల్లిదండ్రులు నారాయణ, వెంకటమ్మలు ఉన్నారు. వాళ్లకు నా భర్త ఒక్కడే. ఆయన చనిపోయినంక అందరం దిక్కులేకుంట అయినం. పార్టీ తరపున రూ.2లక్షల బీమా చెక్కు ఇచ్చారు. ఆ డబ్బులతో కొంత వ్యవసాయానికి పోగా కొంత అప్పు కట్టుకున్నా. మిగతావి కుటుంబ పోషణకు ఉపయోగపడ్డాయి. రూ.2లక్షలు రాకుంటే చాలా కష్టమయ్యేది. ఏ పార్టీ కూడా ఇలా కార్యకర్తలకు ఆర్థిక సహాయం చేయలేదు.
– గంగాభవాని, రాంనగర్,
బీఆర్ఎస్ తమ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలకు అవకాశాలిస్తూనే ఆపద సమయంలో అండగా నిలుస్తున్నది. పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనే కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకొంటున్నది. ముఖ్యంగా అనుకోని సంఘటనతో కార్యకర్త మృతిచెందితే ఆ కుటుంబం ఆగంకాకూడదని సంకల్పించిన బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. వారికి పార్టీ సభ్యత్వం ఇచ్చినప్పుడే వారి పేరున రూ.2లక్షల ఇన్సురెన్స్ చేయించారు. ఏదైనా కారణంతో కార్యకర్త చనిపోతే ఆ కుటుంబానికి బీమా వర్తించేలా చేశారు. కష్టసమయంలో పార్టీ తరఫున అందించే ఆర్థిక సాయం ఆ కుటుంబ అవసరాలకు ఉపయోగపడడమే గాక కొండంత ధైర్యం ఇస్తున్నది. ఇలా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వందలాది మంది కార్యకర్తల కుటుంబాలకు బీమా ద్వారా ఆర్థిక సాయం అందింది. ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా కార్యకర్తల గురించి ఆలోచించలేదని.. బీఆర్ఎస్ ఒక్కటే నేనున్నానంటూ అభయమిస్తున్నదని చెబుతున్నారు.
– నమస్తే నెట్వర్క్, సెప్టెంబర్ 26
గోవిందరావుపేట, సెప్టెంబర్ 26 : మాది భూపాలపల్లి జిల్లా గొర్లవీడు. నాకు 2018లో గోవిందరావుపేట మండలం మచ్చాపురం గ్రామానికి చెందిన ఏపూరి మహేందర్‌రెడ్డితో పెండ్లి అయింది. నా భర్త బీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేశాడు. 2020లో పొలం పనుల నిమిత్తం బైక్ మీద వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టడంతో చనిపోయాడు. అప్పుడు నాకు నాలుగున్నర నెలల బాబు ఉన్నాడు. పెండ్లి అయిన కొద్ది రోజుల్లోనే ఇలా జరిగింది. ఆయన లేడు అనే బాధ నన్ను ఎంతో కుంగదీసింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న నాకు పార్టీ అండగా నిలిచింది. పార్టీలో చేరినప్పుడు నా భర్త ప్రమాద బీమా సౌకర్యం కల్పించారు. ఆయన చనిపోయిన ఎనిమిది నెలల తర్వాత పార్టీ తరఫున రూ.2లక్షల చెక్కు అందించారు. ఈ డబ్బులు నా కొడుకు మనోజ్‌రెడ్డి పేరు మీద బ్యాంకులో ఫిక్స్ చేశాను. అలాగే నాకు వితంతు పింఛన్ రూ.2016లు ప్రభుత్వం నుంచి ప్రతీ నెలా వస్తున్నాయి. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఆయన సాయం మర్చిపోలేనిది.
– ఏపూరి నవీన
హనుమకొండ, సెప్టెంబర్ 26 : మా ఆయన వేల్పుల మల్లేషం చనిపోతే మన సీఎం కేసీఆర్ మా ఇంటి పెద్ద కొడుకులెక్క ఆదుకున్నడు. టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఆయన కార్యకర్తగా పనిచేస్తున్నడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. 2015 ఆగస్టు 9న జరిగిన ప్రమాదంలో చనిపోయిండు. అప్పుడు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్ సహకారంతో రెండు లక్షల రూపాయల బీఆర్ఎస్ పార్టీ ఇన్సురెన్స్ వచ్చింది. మా కుటుంబానికి అండగా నిలిచారు. నాకు ఒక్క కొడుకు, ఇద్దరు బిడ్డలు. నెలనెలా వితంతు పింఛన్ రూ.2016లు వస్తాంది. ఇన్సూరెన్స్ డబ్బులు, పింఛన్‌తో నేను బతుకుతున్నా. నాకు ఆరోగ్యం బాగుండదు. ఆ పైసలతోనే నెలనెలా మందులు తీసుకుంటున్నా. మా ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటం. తెలంగాణ రాక మునుపు ఏ ప్రభుత్వాలు ఇట్లా ఆదుకొలేదు. రూ.200ల పింఛన్ ఇచ్చేది అంతే. ఇప్పుడు కేసీఆర్ సారు అందరినీ ఆదుకుంటాండు.
– వేల్పుల మల్లికాంబ, న్యూశాయంపేట
బచ్చన్నపేట, సెప్టెంబర్ 26 : మా ఆయన భీమునిపల్లి వెంకటేశ్ బీఆర్ఎస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించేది. ఊళ్లో అభిమానులను అందరినీ పార్టీలో చేర్పించిండు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకుండు. పార్టీని బలోపేతం చేసిండు. అలా నడుస్తున్న క్రమంలో ఆయన సేవలను గుర్తించి గ్రామ శాఖ అధ్యక్ష పదవి ఇచ్చిండ్రు. అప్పటినుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డడు. అనుకోకుండా 2021 అక్టోబర్ 29న గుండెపోటుతో కుప్పకూలిండు. నాకు ఇద్దరు ఆమ్మాయిలు. ఒక అబ్బాయి. ఇంటికి పెద్ద దిక్కు దూరమై పుట్టెడు బాధలో మా కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎంతో భరోసా ఇచ్చింది. పార్టీ సభ్యత్వం రశీదును గ్రామ బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు హెడ్ ఆఫీసుకు పింపిండ్రు. సీఎం కేసీఆర్ సార్ ప్రకటించిన రూ.2 లక్షల బీమా మాకు వచ్చేలా చేసిండ్రు. స్థానిక నేతలు ఆదుకున్నరు. సాయం చేసిన పార్టీని ఎప్పటికీ మరువం. కేసీఆర్ నిర్ణయం ఎంతో మంచిది. ఆయన వెంటే ఉంటం. పార్టీ మాకు కొండంత అండనిచ్చింది.
– భీమునిపల్లి శ్రావణి
పరకాల, సెప్టెంబర్ 26: భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ రూ.2లక్షల బీమా నగదు ఇచ్చి ఆసరా అయింది. ఆపద కాలంలో సీఎం కేసీఆర్ మా కుటుంబానికి అండగా నిలిచిండు. నా భర్త కుమారస్వామి, నేను ఇద్దరం కలిసి ఊరూరు తిరుగుతూ పండ్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకునేవాళ్లం. దురదృష్టవశాత్తు నా భర్త రెండేండ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయిండు. ఆ సమయంలో మా చిన్న కొడుకు చదువుకు, మా పాప పెళ్లి కోసం కొంత అప్పు చేశాం. కానీ అయినవారెవ్వరు ఆదుకోలేదు. ఆయనకు పార్టీలో సభ్యత్వం ఉన్న విషయం పార్టీ నాయకులే మాకు చెప్పి రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా వస్తది అని ధైర్యం చెప్పిన్రు. వారు చెప్పినట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇన్సురెన్స్ చెక్కు ఇచ్చిండు. ఆ డబ్బులు కొన్ని ఇంటి ఖర్చులకు పోను మిగతావి అప్పు కట్టిన. బంధువులు, తెలిసినవాళ్లు అండగా లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అండగా నిలిచారు. వారు అందించిన ఆర్థిక సహాయంతోనే మళ్లీ నిలదొక్కుకుని వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని ఎల్లదీస్తున్నా.
– దామ లక్ష్మి, పరకాల
మహదేవపూర్, సెప్టెంబర్ 26 : మాది నిరుపేద కుటుంబం. కూలీ పని చేసుకొని బతుకుతున్నం. నా భర్త పీక రాజయ్య ఎప్పటినుంచో బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా పనిచేసేది. రెండేండ్ల కింద యాక్సిడెంట్ అయి నా భర్త చనిపోయిండు. ఇంటికి పెద్దదిక్కు దూరమై ఆగమైనం. పుట్టెడు దుఃఖంలో ఉన్న మాకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. పార్టీ తరఫున నా భర్త పేరు మీద రూ.2లక్షల ఇన్సురెన్స్ డబ్బులు ఇచ్చిన్రు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న మాకు పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధన్న చెక్కు మంజూరు చేయించి భరోసా ఇచ్చిన్రు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఇంటికి వచ్చి చెక్కు ఇచ్చిన్రు. కుటుంబ పెద్ద చనిపోయి అప్పులతో పుట్టెడు బాధలో ఉన్న మాకు పార్టీ చేసిన ఆర్థికసాయం ఎంతో అక్కెరకు వచ్చింది. వాటితోటి అప్పులు కట్టుకున్నం. కూలీ పని చేసుకుంట నా ఇద్దరు ఆడపిల్లలను పోషించుకుంటాన. నా భర్తకు పార్టీ సభ్యత్వం ఉండడం వల్ల మాకు బీమా అందింది. బీఆర్ఎస్కు మేమంతా అండగా ఉంటాం. ఎప్పటికీ పార్టీ కోసం కష్టపడతాం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, పుట్ట మధన్నకు మేము జీవీతాంతం రుణపడి ఉంటం.
– పీక రాజమ్మ, బొమ్మాపూర్, ఎస్సీకాలనీ, మహదేవపూర్ మండలం
వర్ధన్నపేట, సెప్టెంబర్ 26 : మా ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోవడం వల్ల పిల్లల చదువు ఏమైతదో అని ఆగమైనం. పెద్దబ్బాయి ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుండు. మిగతా ముగ్గురు పిల్లలు ఇంకా చదువుకుంటాండ్లు. మా ఆయన, నేను ఇద్దరం కూడా కూలీ పనులు చేస్తూ పిల్లలను ఇంతవరకు చదివించుకున్నం. నా భర్త దూరమైనంక పిల్లల చదువులు ఏమైతయోనని ఎంతో బాధపడ్డ. తెలంగాణ పార్టీల తిరిగెటోడు. ఏ మీటింగ్ ఉన్నా పార్టీ కండువా వేసుకొని పోయేటోడు. ఆయన పోయిన తరువాత సీఎం కేసీఆర్ సార్ దయతో ఎమ్మెల్యే రమేశ్ మాకు రెండు రోజుల కింద రూ.2లక్షల చెక్కు ఇచ్చిండు. మా ఇయన పేరు మీద పార్టీవోళ్లే బీమా చేసిండ్లట. ఈ పైసలు నా పిల్లల చదువుకు ఎంతో అక్కెరకు వత్తయ్. పిల్లలకు పార్టీ అండగా ఉంటదని ఎమ్మెల్యే సార్ చెప్పిండు. ఇది మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది.
– ఉప్పస్వామి భార్య పూల
హనుమకొండ, సెప్టెంబర్ 26 : బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ప్రమాద ఇన్సురెన్స్ ద్వారా వచ్చిన రూ.2లక్షలు నా ఇద్దరు పిల్లల పేరున ఫిక్స్ చేసిన. నా భార్య పెరుగు మంజుల పని కోసం వెళ్తున్న క్రమంలో యాక్సిడెంట్ జరిగి అక్కడికక్కడే చనిపోయింది. నాకు ఒక అమ్మాయి, ఒక కుమారుడు. అమ్మాయి ఇంటర్మీడియట్, బాబు 8వ తరగతి చదువుతున్నాడు. నేను బట్టల దుకాణంలో గుమస్తాగా పని చేస్తున్నా. భార్య చనిపోయిన బాధలో ఉన్న మా కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. పార్టీ నాయకుల నుంచి మంచి రెస్సాన్స్ ఉంది. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, స్థానిక బీఆర్ఎస్ నాయకుడు మాడిశెట్టి శివశంకర్ చొరవతో ఇన్సూరెన్స్ అందింది. బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ మా కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలిచారు. గతంలో ఉన్న పార్టీలు ఏవీ కూడా ఇలా ఆదుకోలేదు.
– పెరుగు మహేందర్ యాదవ్, న్యూశాయంపేట