హనుమకొండ, నవంబర్ 2 : స్థానిక సంస్థల్లో జనాభా దామాషా ప్రకారం కల్పించాల్సిన రిజర్వేషన్లపై చేపట్టిన బహిరంగ విచారణలో వివిధ సంఘాల నుంచి వినతులు విన్నామని, దానిని ప్రభుత్వానికి నివేదిస్తామని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీ కులాలు, రిజర్వేషన్ల పునర్వ్యవస్థీకరణ జరగాలని, జనాభా దామాషా ప్రకారం రాజకీయాల్లో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని బీసీ సంఘాల నేతలు కోరినట్లు ఆయన పేర్కొన్నారు. శనివారం సాయంత్రం హనుమకొండ కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. హనుమకొండ కలెక్టరేట్లో జరిగిన బహిరంగ విచారణకు వచ్చే ముందు బృందం సభ్యులతో కలిసి భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు.
బహిరంగ విచారణలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారని, లిఖితపూర్వకంగా వినతులు అందించారని చెప్పారు. బీసీలపై జరుగుతున్న దాడులు అరికట్టేందుకు అట్రాసిటీ చట్టం తీసుకురావాలని కోరినట్లు తెలిపారు. దూదేకుల, ఇతర మైనారిటీ వర్గాల వారు కూడా తమకు ఇతర కులస్తుల మాదిరిగా అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిపారు. కుల నిర్మూలన సంఘం సైతం నో క్యాస్ట్.. నో రిలిజియన్ సర్టిఫికెట్ జారీ చేయడంతో పాటు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని వినతి పత్రం అందించిందన్నారు.
ఈ విచారణ సందర్భంగా ఏ జిల్లాలో లేని విధంగా ఇక్కడ బాలికల హాస్టళ్లలో సౌకర్యాలు లేవని, అనేక సమస్యలకు నిలయంగా మారాయని మహిళలు ఫిర్యాదు చేశారన్నారు. బహిరంగ విచారణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. నాసిరకంగా విద్యుత్ సరఫరా చేయడంతో ఇస్త్రీ పెట్టెలు కాలిపోతున్నాయని, అలాగే నాలాలపై ఉన్న ఇస్త్రీ డబ్బాలను తొలిగిస్తున్నారని రజకులు తమ దృష్టికి తీసుకొచ్చారని, ఈ అంశాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు.
ఈ విచారణలో దాదాపు 235 విజ్ఞప్తులు వచ్చాయన్నారు. ఏ జిల్లాలో లేని విధంగా ఇక్కడ మంచి స్పందన ఉందని, బీసీలంతా ఐక్యతతో ఉన్నారని అన్నారు. అంతేకాక ఇక్కడి విభిన్నమైన అంశాలపై బీసీ సంఘాల నేతలు విజ్ఞప్తులు అందజేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నదని, దీనిని కుల సంఘాలు, ప్రజలు విజయవంతం చేయాలన్నారు. కులగణన, రిజర్వేషన్ అమలు విషయంలో తమకు హైకోర్టు నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని నిరంజన్ చెప్పారు. కోర్టు నిబంధనల మేరకే బీసీ కమిషన్ పనిచేస్తుందన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మి, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు పీ ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద తదితరులు పాల్గొన్నారు.