వరంగల్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పా ర్టీ తమను నిండా ముంచిందని బీసీ వర్గాలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నాయి. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలు అయినట్టు కాంగ్రెస్‌ను నమ్మి తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘అటు సూర్యుడు ఇటు పొడిచినా.. ఆరు నూరైనా స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం’ అని కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్ధానం శాశ్వతంగా అటకెక్కిందని, అందుకు శనివారం రేవంత్‌రెడ్డి సర్కారు జారీ చేసిన జీవో నంబర్ 46 నిదర్శనంగా నిలుస్తుందంటున్నారు.
సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారుకు జారీ చేసిన మార్గదర్శకాలు, వాటికి నేపథ్యంగా ఉన్న సుప్రీం కోర్టు తీర్పు సారాంశం కాంగ్రె స్ సర్కారుకు తెలిసే మోసం చేసిందని బీసీలు మండిపడుతున్నారు. అన్నీ తెలిసి అటు అధికార యంత్రాంగాన్ని, ఇటు బీసీలను ఉద్దేశపూర్వకంగానే రేవంత్‌రెడ్డి సర్కారు తప్పుదోవ పట్టించిందని తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల పెంపును నిర్దారిస్తూ పార్లమెంట్ చట్టం చేస్తే కానీ అమలు సాధ్యంకాదనే విషయం స్పష్టంగా తెలిసినా రాజకీయ లబ్దికోసమే కాంగ్రెస్ సర్కార్ బీసీలను నమ్మిస్తూ వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న లోపభూయిష్ట వైఖరితో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాదని, ఒకవేళ కల్పించినట్టు ఉత్తర్వులు, ఆర్డినెన్స్‌లు జారీ చేసినా అవి న్యాయస్థానాల్లో నిలవని ‘నమస్తే తెలంగాణ’ ముందే చె ప్పింది.
సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీల స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కోసం చేసిన కసరత్తుపై సెప్టెంబర్ 28న ‘స్థానిక ఖ రారు ‘డ్రా’పేనా?’, అక్టోబర్ 10న ‘తెలిసీ మోసం.. తెలియదని నాటకం’ శీర్షికలతో వేర్వేరు కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. స్థానిక రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ సర్కార్ అనుసరించిన విధానం న్యాయస్థానాల్లో నిలువదని రాజ్యాంగ నిపుణులు తేల్చిచెప్పిన ఉదంతాలను ఆ కథనాల్లో ఉదహరించిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ సర్కార్ బీసీలకు తొండి ‘చెయ్యి’ ఊపింది. గ్రామ పంచాయతీ వార్డులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు పెరిగి ‘మేమెంతో.. మాకంత’ నినాదం నిజరూపం దాలుస్తుందని ఆశించిన బీసీ వర్గాలకు కాంగ్రెస్ సర్కారు వైఖ రి ఆశనిపాతమైంది. రిజర్వేషన్ల విషయంలో గ్రామీ ణ ప్రాంతాల్లో కథలు చెప్పే సందర్భంలో స్థిరపడి పోయిన ‘రెడ్డొచ్చే మొదలాయే’ అన్న నానుడి నిజమైందనే ఆవేదన అలముకున్నది. గత సెప్టెంబర్‌లో ఖరారైన రిజర్వేషన్లతో గాలిలో కుర్చీలేసి కూర్చున్నవారి ఆశలు నిట్టనిలువునా కూలిపోయాయి.
ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో 46 ప్రకారం సెప్టెంబర్‌లో ఖరారైన రిజర్వేషన్లు పనికి రాకుండా పోయాయి. కొత్త ఉత్తర్వులతో అన్నీ తలకిందులైపోయాయి. ఎస్సీ, ఎస్టీ స్థానాలు (50 శాతం మహిళా రిజర్వేషన్‌తో సహా) మినహా అన్నీ మారిపోతాయి. ఉదాహరణకు వరంగల్ జిల్లాలో మొత్తం 11 ఎంపీపీ స్థానాల్లో ఎస్టీకి రెండు, ఎస్సీకి రెండు, బీసీకి 5, జనరల్‌కు రెండు స్థానాలను కేటాయించారు. ఇందులో మహిళలకు 5 స్థానాలు రిజర్వ్ చేయడం గమనార్హం. అలాగే, జడ్పీటీసీ స్థానాల్లోనూ ఇవే రిజర్వేషన్లు కేటాయించారు. అయితే, కొత్త జీవో ప్రకారం బీసీలకు ఖరారైన ఐదేసి స్థానాలు తగ్గి, జనరల్ స్థానాలు పెరుగుతాయి. మొత్తానికి మోసం నిజం.. 42 శాతం రిజర్వేషన్ అబద్ధమని తేలిపోయింది.