కాకతీయ యూనివర్సిటీలో ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) పోస్టుపై రగడ మొదలైంది. ప్రత్యేకంగా పోస్టును సృష్టించి మరీ వివాదాస్పద ప్రొఫెసర్ పెరటి మల్లారెడ్డికి దాన్ని కట్టబెట్టడంపై యూనివర్సిటీలోని ఇతర ప్రొఫెసర్లు, ఉద్యోగులు, విద్యార్థుల్లో వ్యతిరేకత మొదలైంది. కేయూ వైస్ ఛాన్సలర్ కె.ప్రతాప్‌రెడ్డి పరిపాలన పరంగా సరిదిద్దుకోలేని తప్పు చేశారని అంటున్నారు. రిజిస్ర్టార్‌గా పనిచేసినప్పుడు జరిగిన అవినీతి, అక్రమాలు బయటికి రాకుండా ఉండేందుకే మల్లారెడ్డి పైరవీ చేసుకుని మరీ ఓఎస్డీ పోస్టు తెచ్చుకున్నారని చెబుతున్నారు. న్యాయ నిపుణులకు ఇవ్వాల్సిన ఈ పోస్టును ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఇవ్వడం సరైన నిర్ణయం కాదని మండిపడుతున్నారు.
రిజిస్ట్రార్‌గా ఉన్న మల్లారెడ్డిని తొలగించి ఓఎస్డీ పోస్టు క్రియేట్ చేసి పదవి ఇవ్వడం మోసమని, న్యాయ నిపుణులకు ఇవ్వాల్సిన పదవిని మళ్లీ రెడ్డికి కేటాయించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవలి వరకు రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహించి అనేక అక్రమాలు, అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లారెడ్డికి ఇప్పుడు కొత్తగా పోస్టు సృష్టించి మరీ ప్రత్యేక అధికారాలు కల్పించడం సరికాదని అంటున్నారు. యూనివర్సిటీపై పెత్తనమంతా ఒక వర్గం వారికి కట్టబెట్టేందుకే ఓఎస్డీ పోస్టును సృష్టించారని బీసీ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి.
వెంటనే ఓఎస్డీ పోస్టును రద్దు చేయాలని, లేకపోతే మల్లారెడ్డిని కాకుండా బీసీ వర్గం ప్రొఫెసర్‌ను ఈ పోస్టులో నియమించాలని డిమాండ్ చేస్తున్నాయి. మల్లారెడ్డికి అధికారాలు ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అణగదొక్కడమే పనిగా పెట్టుకుంటారని బీసీ సంఘాలు వాపోతున్నాయి. 55శాతం జనాభా ఉన్న బీసీ వర్గాలకు అన్యాయం చేస్తూ మల్లారెడ్డికి ఈ పోస్టు కట్టబెట్టారని అంటున్నాయి. అధికార దాహానికి పైరవీలు తోడైందనడానికి నిదర్శనమే యూనివర్సిటీలో ఓఎస్డీ పోస్టు అని యూనివర్సిటీలో చర్చ జరుగుతున్నది.
కేయూ చరిత్రలో ఇప్పటివరకు లేని పోస్టును తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్ స్థాయిలో బాధ్యత లేని అధికారాలు అప్పగించారని ప్రొఫెసర్లు అభిప్రాయపడుతున్నారు. రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నప్పుడు వచ్చిన అవినీతి, అక్రమాల ఆరోపణలపై ఎలాంటి విచారణ జరపకుండానే పదవీకాలం ముగిసిన తర్వాత మరింత అధికారాలు ఉన్న పోస్టులో మల్లారెడ్డిని నియమించడం సరికాదని అంటున్నారు. ఓఎస్డీ పోస్టులో మల్లారెడ్డి ఉంటే మళ్లీ యూనివర్సిటీలో ఆయనే అధికారం చెలాయిస్తారని అప్పటి అవినీతి, అక్రమాలు బయటికి వచ్చే పరిస్థితి ఉండదని చెబుతున్నారు.
ప్రొఫెసర్ పెరటి మల్లారెడ్డి తీరు వివాదాస్పదంగా ఉంటున్నదని యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు, ఉద్యోగులు, విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. మొన్నటివరకు రిజిస్ర్టార్‌గా ఉన్న మల్లారెడ్డి పదవీకాలం పూర్తి కాగానే దొడ్డిదారిలో ఓఎస్డీ పోస్టులోకి వచ్చారని అంటున్నారు. వీసీ దీనిపై శనివారమే ఉత్తర్వులు ఇచ్చినా రహస్యంగా ఉంచారు. యూనివర్సిటీలోని అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తాయనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు చర్చ జరుగుతున్నది.
మల్లారెడ్డి ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ఓఎస్డీ పోస్టులో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వైస్ ఛాన్సలర్ స్థాయిలో ఛాంబర్‌ను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. గతంలో అనేక పదవుల్లో కొనసాగిన మల్లారెడ్డి సైన్స్ డీన్ పోస్టు తనకే కావాలనే ఉద్దేశంతో ఎస్టీ వర్గానికి చెందిన సీనియర్ ప్రొఫెసర్‌కు అన్యాయం చేశారని ఆరోపణలు ఉన్నాయి. పీహెచ్డీ సీట్ల భర్తీలో అక్రమాలకు మల్లారెడ్డి ప్రధాన బాధ్యుడని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. యూనివర్సిటీల్లో ఓఎస్డీ పోస్టు సాధారణంగా ఉండదు.
ప్రత్యేకమైన సందర్భాల్లోనే ఈ పోస్టును ఏర్పాటు చేస్తారు. అది కూడా న్యాయ నిఫుణులనే ఈ పోస్టులో నియమిస్తారు. కోర్టు కేసులను విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకుని యూనివర్సిటీ ప్రయోజనాలకు అనుగుణంగా న్యాయపరమైన చర్యలు తీసుకొనేలా వీరు పనిచేస్తారు. కోర్టులోని అంశాలపై వీసీకి, రిజిస్ట్రార్‌కు వివరించి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించుకునేలా ఓఎస్డీ విధులు నిర్వర్తిస్తారు. యూనివర్సిటీలో కొత్త, వింత సంప్రదాయం మొదలుపెట్టారని, ఎక్కడా లేని విధంగా మాజీ రిజిస్ర్టార్ మల్లారెడ్డిని ఓఎస్డీ పోస్టులో నియమించారని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి.
ఓఎస్డీ పోస్టులో ప్రొఫెసర్ మల్లారెడ్డిని నియమించవద్దని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మల్లారెడ్డికి ఈ పోస్టు ఇవ్వొద్దని నిరసన తెలుపుతున్నారు. యూనివర్సిటీలో చరిత్రలో లేని పోస్టును ఏర్పాటు చేయడం ఎందుకని అంటున్నారు. మల్లారెడ్డి ఇంకా ఎన్ని పదవులు అనుభవిస్తారని ప్రశ్నిస్తున్నారు. మల్లారెడ్డి క్లాసులు చెబుతున్నారా? అనేది చూడాలని డిమాండ్ చేశారు.