వరంగల్ చౌరస్తా, అక్టోబర్ 27 : రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి ఒకే విధానాన్ని అమలు చేయాలని కోరిన తమను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా మామునూరు 4వ బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్లు ధర్నా నిర్వహించారు. ఆదివారం విరామ సమయంలో ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి, ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని, లేదంటే నిరసన తెలుపుతున్న కానిస్టేబుళ్లందరినీ సస్పెండ్ చేయాలన్నారు.
తమ కష్టాలను తీర్చాలని కోరిన వారిని విధుల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం బెదిరిస్తున్నదన్నారు. కానిస్టేబుళ్లు ఎదుర్కొంటున్న సమస్యలపై విచారణ జరిపి తగిన న్యాయం చేయకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదన్నారు. బెటాలియన్ గేటు వద్ద కానిస్టేబుళ్లు చేస్తున్న ధర్నాకు వారి కుటుంబసభ్యులు మద్దతు తెలిపారు. కానిస్టేబుళ్లు ఆందోళన చేపట్టడంతో మామునూరు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
గోవిందరావుపేట : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని చల్వాయి శివారు లక్నవరం క్రాస్ వద్ద ఉన్న 5వ పోలీస్ బెటాలియన్‌లో పనిచేస్తున్న ఆరుగురు కానిస్టేబుళ్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రాష్ట్రమంతా ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ వారి కుటుంబ సభ్యులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. దీనిని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది. సస్పెండైన వారిలో హెడ్ కానిస్టేబుళ్లు రాజేశ్, రాజు, కానిస్టేబుళ్లు సతీశ్, రమేశ్, అభినవ్, రామ్‌దాస్ ఉన్నారు.