బతుకమ్మ చీరెలు చేనేత కార్మికులకు బతుకునిస్తున్నాయి. తెలంగాణలో ఆడబిడ్డలు సంబురంగా జరుపుకొనే పూలపండుగ బతుకమ్మకు ఎంతో ప్రత్యేక గుర్తింపు ఉండగా, కేసీఆర్ సర్కారు స్వరాష్ట్ర ఆవిర్భావం నుంచి వైభవంగా నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా సద్దుల బతుకమ్మ పండుగ వేళ ప్రతి పేదింటి మహిళకు ఉచితంగా చీర అందిస్తున్నది. తీరొక్క రంగులు, డిజైన్లలో వీటిని తయారుచేయిస్తూ చేనేత కార్మికులకూ ‘బతుకు’నిస్తున్నది. టెస్కో ద్వారా మరమగ్గాల కార్మికులకు ఏటా ఆర్డర్ ఇస్తూ చేనేత రంగాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేస్తున్నది. ఫలితంగా శాయంపేటలోని కొప్పుల పవర్‌లూమ్స్‌కు 40వేల మీటర్ల ఆర్డర్ ఇవ్వగా ఆరు నెలలుగా తయారీ పనులు జోరుగా సాగుతుండడంతో యజమానులు, కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
– శాయంపేట, సెప్టెంబర్ 29
తెలంగాణలో జరిగే బతుకమ్మ పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. పూలను పూజించే గొప్ప పండుగ ఇది. మహిళలు, యువతులు బతుకమ్మ పండుగను ఉత్సాహంగా జరుపుకొంటారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నది. పండుగకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి మహిళకు చీరను ఉచితంగా అందిస్తోంది. ఈ క్రమంలో కోట్లాది చీరలను తయారు చేయించి బతుకమ్మ పండుగకు ముందే అప్పగిస్తోంది. అంతేగాక ఏటా పంపిణీ చేసే చీరల తయారీతో ఇటు చేనేత, పవర్లూమ్ కార్మికులకు ఉపాధి చూపుతోంది. తద్వారా చేనేతరంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటోంది. మరమగ్గాలు(పవర్లూమ్) కార్మికులు బతుకమ్మ చీరలు తయారు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు చీరల తయారీతో మరమగ్గాల, చేనేత కార్మికులకు ఉపాధి దొరుకుతోంది. ఈ నేపథ్యంలో శాయంపేట మండలం పవర్‌లూమ్స్, చేనేతకు ప్రసిద్ధి. కొన్నేళ్లుగా శాయంపేట మండలంలోని కార్మికులు బతుకమ్మ చీరలు తయారు చేస్తున్నారు. ఈసారి బతుకమ్మ చీరల తయారీ కోసం మండలంలోని కొప్పుల గ్రామంలోని మరమగ్గాల యజమానులకు టెసో(తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ సంస్థ) 40వేల మీటర్ల ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికే తయారీ పూర్తికావచ్చింది. ఆర్డర్ మేరకు చీరలు తయారవుతుండడంతో యజమానులు, కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
6 నుంచి 8నెలల పాటు ఉపాధి
చేనేతకు ప్రసిద్ధి చెందిన శాయంపేట మండలంలో మరమర్గాలపై ఆధారపడి వేలాది కుటుంబాలు పనిచేస్తున్నాయి. సమైక్యపాలనలో కరెంటు లేక మరమగ్గాలు మూలనపడగా తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ చీరల ఆర్డర్‌తో మళ్లీ కొత్త వెలుగు వచ్చింది. ప్రభుత్వం ఉపాధిని కల్పిస్తుండడంతో అంతకుముందు వరకు పనుల్లేక భీవండి, సిరిసిల్ల లాంటి ప్రాంతాలకు వలస వెళ్లిన కార్మికులు తిరిగి సొంతూరికి పయనమయ్యారు. బతుకమ్మ చీరల తయారీతో సుమారు 6 నుంచి 8 నెలల కాలం పాటు ఉపాధి దొరుకుతోంది. చీరెలను తయారు చేస్తూ కార్మికులు రోజుకు రూ.500 వరకు సంపాదిస్తున్నారు. నిర్ణీత డిజైన్ ప్రకారం మగ్గాలను మారుస్తూ తయారు చేస్తున్నారు. మగ్గాల కార్మికులతో పాటు నిర్వాహకులు బతుకమ్మ చీరెలతో లబ్ధిపొందుతున్నారు. గతంలో పనుల్లేక పస్తులుండే వాళ్లమని బతుకమ్మ చీరల తయారీతో ఆర్థికంగా ఎదుగుతున్నామని వారు సంతోషంగా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో కోతలు లేకుండా నిరంతరం కరెంటు సరఫరా చేస్తూ కార్మికులకు చేతినిండా పనికల్పిస్తోంది.
పగలు, రాత్రి సాంచాలు నడుపుతూ చీరెలు తయారు చేస్తున్నారు. గతంలో మరమగ్గాల యజమానులు పవర్‌లూమ్స్‌పై టవల్స్, లుంగీలు తయారు చేసి బహిరంగ మారెట్లో విక్రయించేవారు. అలాగే ఇంటి వద్దకు వచ్చిన వారికీ అమ్మేవారు. పెట్టుబడి ముందుగా పెట్టి ఆ తర్వాత అవి విక్రయిస్తేనే డబ్బు వచ్చేదని చెబుతున్నారు. ఎవరూ కొనుగోలు చేయకపోతే తయారుచేసిన వస్త్రాలు అలాగే ఉండేవని దీని వల్ల పెట్టుబడి చేతికి రాక నష్టాలతో మరమగ్గాలను ఆపివేసేవాళ్లమని చెబుతున్నారు. తద్వారా కార్మికులు పనులు లేక అవస్థలు పడేవారని చెప్పారు. కానీ తెలంగాణ ప్రభుత్వం టెసో ద్వారా బతుకమ్మ చీరెల ఆర్డర్ ఇచ్చి ఉపాధి చూపడం తమకు వరంలా మారిందని మరమగ్గాల నిర్వాహకులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. తయారైన చీరెలను విడుతలవారీగా టెసోకు అందిస్తున్నామని పేరొంటున్నారు. ఆర్డర్ ఇచ్చిన మేరకు పూర్తిస్థాయిలో టెసో అధికారులు కొనుగోలు చేస్తున్నారని, పూర్తిగా బిల్లులు చెల్లిస్తూ ఉండడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. కొప్పుల మరమగ్గాల తయారీదారులకు ఈసారి సుమారు రూ.8.30 లక్షల విలువైన బతుకమ్మ చీరల తయారీని పని అప్పటించారు. ఇలా మూడు సంవత్సరాలుగా ఆర్డర్‌ను అందించి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ క్రమంలో నెలల తరబడి ఉపాధి దొరుకుతున్నదని కార్మికులకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
40వేల మీటర్ల ఆర్డర్
కొప్పులలోని పవర్లూమ్ యజమానికి టెసో 40వేల మీటర్ల బతుకమ్మ చీరల తయారీకి గత మార్చి నెలలో ఆర్డర్ ఇచ్చింది. దీంతో పవర్ లూమ్స్ ద్వారా బతుకమ్మ చీరలు తయారవుతున్నాయి. అక్టోబర్ 15వరకు ఆర్డర్ చీరలను అప్పగించాల్సి ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈమేరకు రాత్రీపగలు చీరెలను తయారుచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో ఐదున్నర మీటర్ల పొడవు చీరలు 3600, 9 మీటర్ల పొడవు చీరలు 500 తయారుచేసి అప్పగించాల్సి ఉందని వారు చెప్పారు. ఐదున్నర మీటర్ల చీరకు రూ.190, 9 మీటర్ల చీరకు రూ.280 చొప్పున టెసో చెల్లిస్తున్నది. పలు రకాల డిజైన్లతో బతుకమ్మ చీరెలను తయారవుతున్నాయి. ఆర్డర్ వచ్చిన తర్వాత దానికి కావాల్సిన యారన్, ఇతర ముడి సరుకును నిర్వాహకులు కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. చీరలు తయారు చేసి అప్పగించిన తర్వాత అంటే దసరా పండుగ తర్వాత 40శాతం, ఆ తర్వాత మరో 30శాతం, ఆ తర్వాత మరో 30శాతం చొప్పున బిల్లులు చెల్లిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.
మూడేళ్లుగా చీరెల తయారీతో ఉపాధి
మూడేళ్లుగా పవర్‌లూమ్స్‌పై బతుకమ్మ చీరెలను తయారు చేస్తున్నాం. పది మందికి ఉపాధి కల్పిస్తున్నా. ఈ ఏడాది కూడా టెసో మాకు 40వేల మీటర్ల బతుకమ్మ చీరలు తయారీకి ఆర్డర్ ఇచ్చింది. అక్టోబర్ 15 వరకు అప్పగించాల్సి ఉంది. తయారీ దాదాపు పూర్తి కావచ్చింది. గతంలో రెండు, మూడు డిజైన్లు తయారు చేశాను. ఈసారి ఒకటే డిజైన్ ఇచ్చారు. తయారైన చీరలను టెస్కో అధికారులు పూర్తిగా కొనుగోలు చేస్తూ డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు. ఇది ఎంతో సంతోషకరమైన విషయం. ఇంతకుముందు టవల్స్, లుంగీలు తయారు చేసేవాళ్లం. అవి అమ్ముడుపోక పెట్టుబడి వచ్చేది కాదు. దీని వల్ల పనులు నిలిపివేశాం. కానీ తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలతో ఉపాధి కల్పించడం చేనేత రంగంపై ఆధారపడిన వారికి వరం. పగలు నలుగురు, రాత్రి నలుగురూ కార్మికులు మరమగ్గాలను నడుపుతూ చీరెలను తయారు చేస్తున్నారు. వారికి రోజుకు రూ.500 వరకు నెలకు రూ.12 వేలకు పైనే చెల్లిస్తున్నాం. పండుగతో అటు మహిళలకు చీరెలు ఇస్తూ, ఇటు మాలాంటి వారికి ఉపాధి కల్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు.
– దాసరి కుమారస్వామి, పవర్‌లూమ్స్ నిర్వాహకుడు, కొప్పుల