వరంగల్ చౌరస్తా, జూన్ 6 : బంగారం ధర పెరగడంతో సామాన్య కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే, కేటుగాళ్లకు మాత్రం మంచి అవకాశంగా మారింది. బ్యాంకు ఉద్యోగులు, బంగారు నాణ్యతను పరిశీలించి, నిర్ధారించే అఫ్రైజర్లను మచ్చిక చేసుకొని లక్షలు నొక్కేస్తున్నారు. ఇదే తీరుగా వరంగల్‌లో మరో ఘటన వెలుగు చూసింది. వరంగల్ స్టేషన్ రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ మహేశ్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్‌లో నెల వారీ వడ్డీ చెల్లింపు విధానంలో శివనగర్‌కు చెందిన శ్రవణ్‌కుమార్ 145 గ్రాముల నకిలీ బంగారంపై రూ.8లక్షలు, గుంటూరు ప్రాంతానికి చెందిన లక్ష్మీశిరీష 764 గ్రాముల నకిలీ బంగారంపై రూ.18.5 లక్షలు, హంటర్ రోడ్డు ప్రాంతానికి చెందిన రజిత పేరుతో 278 గ్రాముల నకిలీ బంగారంపై రూ.17లక్షల లోన్ తీసుకున్నారు.
నిబంధనల ప్రకారం లోన్ వడ్డీ చెల్లించని కారణంగా అనుమానం కలిగిన బ్యాంకు అధికారులు బంగారం లోన్‌కు సంబంధించి ఆడిట్ చేపట్టారు. దీంతో అసలు విషయం బయటపడింది. కుదువ పెట్టిన బంగారం నకిలీదిగా గుర్తించి, విచారణ చేపట్టారు. ఈ విషయంలో బ్యాంకు మేనేజర్ శివకృష్ణతోపాటు కే రాముశర్మ, జీవిత్‌కుమార్, బ్రహ్మచారి, పీ రాజమౌళి, వీ కరుణాకర్తోపాటుగా లోన్ తీసుకున్న ఖాతాదారులు కావాలనే బ్యాంకును మోసం చేసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు ఉన్నతాధికారుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం బంగారం మార్కెట్ విలువలో 65 శాతం వరకు లోన్‌గా ఇవ్వడానికి అవకాశం కల్పించింది. వడ్డీ రేటును బట్టి ఈ విలువను పెంచుతూ పోతుంటారు. ఈ నిబంధనను ఆసరాగా చేసుకొని బ్యాంకు ఉద్యోగులు, అఫ్రైజర్లు కొందరు నకిలీ ఖాతాదారులతో కలిసి లోన్ స్కాంలకు పాల్పడుతున్నారు.
వరంగల్ ప్రాంతానికి చెందిన ఓ హాల్‌మార్క్ సెంటర్ నిర్వాహకుడు తన సెంటర్లోనే ఇత్తడి ఆభరణాలకు పుత్తడిగా నకిలీ హాల్‌మార్క్ ముద్రలు వేసి నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా చూపి తన సహచరులు, మిత్రుల పేర్లతో సుమారు కోటి రూపాయల వరకు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో లోన్ తీసుకున్నట్లు వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ధరల పెరుగుదల, అఫ్రైజర్లు, ఉద్యోగులు సైతం సహకరించడంతో ఈ విధానంలో రోజు లక్షల రూపాయలు చేతులు మారుతున్నట్లు వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రస్తుత ధర తగ్గినట్లయితే ఇలాంటి ఘటనలు చాలానే బయటపడే అవకాశాలు ఉన్నట్లు పలువురు వ్యాపార నిపుణులు తెలుపుతున్నారు.