కురవి, సెప్టెంబర్ 12 : సాయం చేయాలంటే ఆస్తులుండాల్సిన అవసరం లేదు.. తపన, సంకల్పం ఉంటే చాలని నిరూపించాడు మహబూబాబాద్ జిల్లా కురవికి చెందిన గంగరబోయిన రఘు. ఓ నిరుపేద కుటుంబాన్ని అండగా నిలువాలనే అతడి ప్రయత్నం వల్ల ఆ ఇంట వెలుగులు నింపాయి. వివరాలిలా ఉన్నాయి. నర్సింహులపేట మండలం బొజ్జన్నపేట గ్రామానికి చెందిన బేతమల్ల నరేశ్-ఉమ దంపతులది నిరుపేద కుటుంబం.
వారికి ఒక అమ్మాయి రెక్వితా ఉండగా, రెండో కాన్పులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఉమ పది రోజుల వ్యవధిలోనే (జూలై 28న) మెదడులో రక్తం గడ్డకట్టి మృతిచెందింది. నరేశ్ ఏ పని చేయకపోవడం, పిల్లలిద్దరిని చూసుకోకపోవడంతో విషయం తెలుసుకున్న రఘు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ వీడియోను ఆగస్టు 1న పోస్టు చేశాడు. వివిధ దేశాల నుంచి రఘు ఫాలోవర్స్ ఆ వీడియోకు స్పందించి తమ వంతు సాయం చేయడంతో కేవలం 15 రోజుల్లోనే రూ. 21 లక్షలు సమకూరాయి. ఈ డబ్బుల నుంచి పాప, బాబు పెంపకం కోసం రూ. 4 లక్షలు ఉంచి, మిగిలిన రూ. 17 లక్షలు చిన్నారుల పేరిట గురువారం మహబూబాబాద్ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, మేనేజర్ సునీల్ కుమార్ ద్వారా బాండ్ తీసుకున్నాడు.
నిరుపేద కుటుంబాన్ని ఆదుకునేందుకు చొరవ చూపిన రఘును సబ్బండ వర్గాలు అభినందిస్తున్నాయి. కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ నాయకులు దుడ్డెల వినోద్, కల్లెపు పవన్, చింతమల్ల యాకన్న, రాజు, శరత్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రఘు తపన, తాపత్రయం చూసి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ కుమారుడు రవిచంద్ర ఐ ఫోన్‌తో పాటు రికార్డు చేసే పరికరాలను తన సొంత ఖర్చులతో అందజేశారు. బ్యాంకు నుంచి తీసుకున్న బాండ్‌ను జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు రఘు పేర్కొన్నారు. సహకరించిన దాతలకు, బ్యాంక్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.