ఖిలావరంగల్, ఫిబ్రవరి 23: తెలంగాణలో వరి పంట వేయొద్దని కాంగ్రెస్ చెప్పడం విడ్డూరంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్(Bandi Sanjay) అన్నారు. ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంజయ్‌కుమార్ బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చూసి టీచర్ ఓటర్ల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వర్షాలు పుష్కలంగా పడి నదుల్లో నీళ్లున్నా కాంగ్రెస్ చేతగానితనం వల్ల ఆ నీళ్లు వాడుకోలేకపోయారని మండిపడ్డారు. కృష్ణా నీటిని ఏపీకి కట్టబెట్టడంతో పాటు దక్షిణ తెలంగాణ, కాళేశ్వరం ప్రాజెక్టును నాశనం చేయడంవల్ల నీళ్లు లేక ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతోందన్నారు.
మేధావులైన గ్రాడ్యుయేట్, టీచర్ ఓట్లర్లంతా ప్రజలు పడుతున్న బాధలను అర్ధం చేసుకుని కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని కోరారు. అనేక సమస్యలు, ఆందోళనలో ఉన్న రైతులను వరి పంట వేయొద్దంటే ఎట్లా అని ప్రశ్నించారు. రాష్ర్టంలో ఈసారి పుష్కలంగా వర్షాలు కురిసి నదులన్నీ నీటితో కళకళలాడినట్లు చెప్పారు. పక్కా ప్రణాళికలతో రెండు పంటలకు నీరివ్వాల్సింది పోయి లేవని చెప్పడం కాంగ్రెస్ పార్టీది చేతగాని తనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లుంటే అప్పనంగా ఏపీకి కట్టబెడుతున్నారని విమర్శించారు. ఎండా కాలం రాకముందే వరిపైరు ఎండపోవడం బాధకరమన్నారు. సుమారు 7 లక్షల ఎకరాల్లో వరి పంట ఎండిపోయిందన్నారు. ఇక ఎండాకాలం వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. రాష్ర్టంలో యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారన్నారు.