వరంగల్, జూన్ 20 : బల్దియా బడ్జెట్ సమావేశం రచ్చ రచ్చగా సాగింది. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో గురువారం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది. బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్ల నిరసనలు, నినాదాల మధ్య 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 650.12 కోట్ల అంచనాలతో ప్రతిపాదించిన బడ్జెట్‌ను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల మద్దతుతో ఆమోదించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసుల నిర్బంధం మధ్య బడ్జెట్ సమావేశం నిర్వహించారు. పోలీసుల తనిఖీ తర్వాతే కార్పొరేటర్లనుకౌన్సిల్ హాల్లోకి అనుమతించారు. ఉదయం 11.30 గంటలకు సమావేశం ప్రారంభం కాగానే బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఒక వైపు బీఆర్ఎస్, మరో వైపు కాంగ్రెస్ సభ్యుల నినాదాలతో సభలో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కార్పొరేటర్లు నల్లబ్యాడ్జీలు ధరించి బడ్టెట్ సమావేశానికి హాజరై నిరసన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణం తొలగించొద్దని తీర్మానం చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబట్టారు. వీరికి మద్దతుగా బీజేపీ కార్పొరేటర్లు నిలిచారు. డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ తీర్మాన పత్రాన్ని అందజేశారు. దీన్ని మేయర్ తోసిపుచ్చి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. కాకతీయుల సామ్రాజ్యానికి రాజధాని అయిన వరంగల్ నుంచి తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు నినాదాలు చేశారు.
బల్దియా బడ్జెట్ సమావేశం గందరగోళంగా సాగింది. బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు పోడియం వద్దకు దూసుకుపోయి మేయర్ గుండు సుధారాణితో వాగ్వాదానికి దిగారు. నిరసనలు, నినాదాల మధ్యే జేఏవో సరిత బడ్జెట్‌ను చదువుతుండడంతో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె చేతుల నుంచి బడ్జెట్ ప్రతులను లాక్కొని చించివేశారు.
బల్దియా బడ్జెట్ సమావేశం జై తెలంగాణ నినాదాలతో మార్మోగింది. కాకతీయ కళాతోరణంపై బీఆర్ఎస్ తీర్మానాన్ని మేయర్ తోసిపుచ్చడంతో బీఆర్ఎస్ సభ్యులు సమావేశాన్ని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ సీట్లలో నిల్చొని జై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీరికి ప్రతిగా కాంగ్రెస్ కార్పొరేటర్లు జై కాంగ్రెస్ నినాదాలు చేశారు.
బల్దియా ప్రధాన కార్యాలయాన్ని పోలీసులు దిగ్బంధించారు. ఉదయం 10 గంటల నుంచే పోలీసులు కౌన్సిల్ హాల్ వైపు ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కార్పొరేటర్లను సైతం తనిఖీల పేరిట ఇబ్బందులు పెట్టారు. కార్పొరేషన్ చరిత్రలో పోలీసుల పహారా మధ్య బడ్జెట్ సమావేశం జరగడం ఇదే తొలిసారి అని చెప్పుకుంటున్నారు. ఏసీపీ, సీఐ, ఎస్సై స్థాయి అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
బడ్జెట్ సమావేశం ముగిసిన అనంతరం బల్దియా ప్రధాన గేట్ ఎదుట బీఆర్ఎస్ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు బైఠాయించారు. పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లకు మధ్య తోపులాటతో ఉద్రిక్తత నెలకొంది. ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కార్పొరేటర్లను పోలీసులు లాగిపడేశారు. దీంతో మేయర్ గుండు సుధారాణి, పోలీసుల నిర్బంధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సభలో బడ్జెట్‌ను చదవకుండానే ఆమోదం తెలిపారని విమర్శించారు. పోలీసుల నిర్బంధాల మధ్య బడ్జెట్ సమావేశం నిర్వహించడంపై మండిపడ్డారు.
బడ్జెట్‌ను చదవకుండానే ఏకపక్షంగా ఆమోదించారు. సభ్యులకు కనీస గౌరవం ఇవ్వకుండా కక్ష సాధింపుతో వ్యవహరించారు. పోలీసుల నిర్బంధం మధ్య బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజముద్రలో కాకతీయ కళాతోరణాన్ని తొలగించొద్దని తీర్మానం చేయాలంటే మేయర్ పట్టించుకోలేదు. వరంగల్ ప్రజల ఆత్మగౌరవాన్ని హరిస్తే ఊరుకునేది లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెప్పు కోసం కాకతీయ కళాతోరణంపై తీర్మానం చేయలేదు. మేయర్ వ్యవహారశైలి సరికాదు. ఎమ్మెల్సీ అనే గౌరవం ఇవ్వకుండా పోలీసులు వ్యవహరించారు. లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రజాస్వామ్య పద్ధతితో నిరసన తెలిపితే పోలీసులు అడ్డుకోవడం విచారకరం.
– పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ
బల్దియాతో నాకు 42 ఏళ్ల అనుబంధం ఉంది. ఇప్పటి వరకు బల్దియా కార్యాలయంలో పోలీసుల నిర్బంధం ఏనాడు చూడలేదు. ఇది మంచి పరిణామం కాదు. బడ్జెట్లో కొత్తగా ఏమీ లేదు. నిరుపయోగమైన బడ్జెట్ ఇది. రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణం తొలగించొద్దని కౌన్సిల్లో తీర్మానం చేస్తే బాగుండేది. ఇది వరంగల్ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. పోలీసుల చర్యలను ఖండిస్తున్నాను.
– బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ