ములుగుటౌన్, జూన్ 22 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరుల కుటుంబాలను ప్రభుత్వం అక్కున చేర్చుకున్నదని జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన అమరుల సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ ఎస్ కృష్ణఆదిత్య, ఎస్పీ గౌష్ ఆలం, అదనపు కలెక్టర్లు ఇలా త్రిపాఠి, వైవీ గణేశ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్‌తో కలిసి ఆమె అమరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగఫలమే ప్రత్యేక తెలంగాణ అన్నారు. వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అక్కున చేర్చుకొని ఉద్యోగంతో పాటు రూ.10 లక్షలు అందించిందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తూ అభివృద్ధికి కృషి చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీడు భూములు పచ్చగా మారాయన్నారు. అంతేకాకుండా రైతుబంధు, రైతు బీమా పథకాలు తీసుకొచ్చి అన్నదాతలను అక్కున చేర్చుకున్నారని తెలిపారు.
దేశంలో ఎకడా లేని పథకాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయన్నారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతే ములుగు అభివృద్ధి సాధ్యమైందన్నారు. పర్యాటక ప్రాంతాలైన రామప్ప, లక్నవరం, మేడారం, మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొరిక గోవింద్ నాయక్ మాట్లాడుతూ 12 వందల మంది అమరుల త్యాగాలపై తెలంగాణ ఏర్పడిందని, వారి త్యాగాలను వృథా కానివ్వమన్నారు. మంత్రి కేటీఆర్ అనేక విదేశీ కంపెనీలను ఆహ్వానించి, రాష్ట్రంలో నెలకొల్పి యువతకు ఉపాధి కల్పనలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారన్నారు. ఉద్యమంలో అసువులు బాసిన రాజ్‌కుమార్ తండ్రి మాట్లాడుతూ తన కుమారుడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఆత్మ బలిదానం చేసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు రూ.10 లక్షలు ఇచ్చిందన్నారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్, కలెక్టర్ అమరవీరుల కుటుంబాలకు సతరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి అప్పయ్య, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ప్రకాశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, జిల్లా మారెట్ అధికారి సుచరిత, సివిల్ సప్లయ్ అధికారి అరవింద్‌రెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, మత్స్యశాఖ అధికారి శ్రీపతి, డీసీవో, సర్దార్ సింగ్, వెటర్నిటీ అధికారి విజయ్ భాసర్, జిల్లా కోశాధికారి జర్సన్, డీపీవో వెంకయ్య, జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి ఈపీ ప్రేమలత, జిల్లా విద్యుత్ శాఖ అధికారి నాగేశ్వర్రావు, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాస్, డీపీఆర్వో రఫిక్, కలెక్టరేట్ ఏవో విజయభాసర్, తహసీల్దార్ సత్యనారాయణస్వామి పాల్గొన్నారు.