ఏటూరునాగారం : అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులకు నష్టపరిహారం అందించాలని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు. ఏటూరునాగారం మండలంలోని గోగుపల్లిలో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఊర వాగు పొంగి ప్రవహించడంతో పక్కనే ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రం వరదలో మునిగింది. వందలాది బస్తాల ధాన్యం కొట్టుకుపోయింది. ఈ కేంద్రాన్ని బడే నాగజ్యోతి సందర్శించి రైతులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రభుత్వానికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రంలో క్వింటాకు 10 కేజీలు కోత పెడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారని తెలిపారు. వరదలో ధాన్యం కొట్టుకుపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయకుంటే కలెక్టరేట్, మంత్రి క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు సునీల్ కుమార్, తుమ్మ మల్లారెడ్డి, ఖాజా పాషా, తాడూరి రఘు, కోనేరు నగేష్, సంజీవరెడ్డి, మాదిరి రామయ్య, ఈసం రామ్మూర్తి, కుమ్మరి చంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.