రైతులకు రుణమాఫీ దిగులు పట్టుకున్నది. పలు కారణాలతో పథకం వర్తించని వారికి నాలుగో దశలో తప్పక మాఫీ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించి రెండు వారాలు గడిచినా బ్యాంకుల్లో డబ్బులు జమకాకపోవడంతో అన్నదాతల్లో నైరాశ్యం అలుముకుంది. ఓ వైపు మాఫీ అయినట్లు సర్కారు గొప్పలు చెప్పడం.. మరోవైపు క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం, లోను గురించి అడిగితే బ్యాంకర్ల నుంచి సరై న సమాధానం రాకపోవడం వారిని అయోమయానికి గురిచేస్తోంది. మొదటి నుంచీ ఇదే గందరగోళం నెలకొనడం, ప్రభుత్వం నుంచి స్పష్టత ఇవ్వక పోవడంతో విసిగిపోయిన రైతులు కొన్నిచోట్ల రోడ్డెక్కి ధర్నాలు కూడా చేస్తూ రేవంత్ సర్కారు తీరుపై కన్నెర్ర చేస్తున్నారు.
– వరంగల్, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
అన్నదాతలను కాంగ్రెస్ సర్కారు మోసం చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రుణాల మాఫీ పథకం అమలు అంతంత మాత్రంగానే ఉన్నది. నాలుగో దశ రుణమాఫీ ప్రక్రియలోనూ పాత సందేహాలే వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం రుణమాఫీ అయిన రైతుల వివరాలను ఇప్పటికీ అధికారికంగా వెల్లడించడం లేదు. వివిధ కారణాలతో రుణమాఫీ వర్తించని వారికి నాలుగో దశలో పూర్తి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నవంబర్ 30న ప్రకటించారు. ఈమేరకు వ్యవసాయ శాఖ అనధికారింగా జిల్లాల వారీగా రైతుల పేర్లను వెల్లడించింది. రుణమాఫీ నాలుగో దశ మొదలైనట్లు సీఎం ప్రకటించి రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్కరికీ మాఫీ కాలేదు.
ఏ ఒక్క రైతు అకౌంట్లోనూ మాఫీ డబ్బులు జమ కాలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. మాఫీ అయిన రైతుల వివరాలను జిల్లా, మండల, గ్రామస్థాయిల్లో వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించడం లేదు. రుణమాఫీ నాలుగో దశ ప్రక్రియపై రైతుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత మూడు దశల తరహాలోనే నాలుగో దశ ఉన్నదని వాపోతున్నారు. నాలుగో దశ రుణమాఫీ ప్రక్రియ మొదలైనట్లు ప్రభుత్వం చెప్పిన మరుసటి రోజు నుంచే రైతులు బ్యాంకులకు వెళ్తున్నా అధికారులెవరూ స్పష్టత ఇవ్వడం లేదు. పైగా మాఫీ అయితే మీ మొబైల్ నెంబరుకు మెసేజ్ వస్తుందని, ఆ తర్వాతే తమకు తెలుస్తుందని బ్యాంకర్లు చెబుతున్నారు. నాలుగో దశ రుణమాఫీపై ప్రకటన వచ్చి రెండు వారాలైనా ఎలాంటి సమాచారం లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టి తమను ఇబ్బంది పెడుతున్నదని, మాఫీ చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
నిజమే.. అర్హత ఉన్నా 971 మందికి మాఫీ కాలేదు
నెక్కొండ, డిసెంబర్ 12: నెక్కొండ మండలం అలంకానిపేటలోని ఐవోబీ పరిధిలోని రైతులు తాము అర్హులైనప్పటికీ రుణమాఫీ వర్తించలేదని జిల్లా కలెక్టర్ కార్యాలయంవద్ద ధర్నా చేయడం, గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది. జిల్లా వ్యవసాయాధికారి అనురాధ గురువారం అలంకానిపేట గ్రామంలోని ఐవోబీని సందర్శించి విచారణ చేపట్టారు. అర్హులమైనప్పటికీ తమకు పంట రుణాలు మాఫీ కాలేదంటూ గత ఆగస్టు నెలలో ఓసారి, డిసెంబర్ 9న మరోసారి కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. అర్హులైన రైతులకు రుణమాఫీ కాలేదని అధికార యంత్రాంగం గుర్తించి నివేదికలు పంపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
అలంకానిపేట ఐవోబీ పరిధిలో 1477 మంది రైతులకు రూ.10.90 కోట్ల రుణాలు మాఫీ కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 506 మంది రైతులకు రూ.3.69 కోట్ల రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయి. వివిధ సాంకేతిక కారణాలతో 971 మంది రైతులకు ఇంకా రుణాలు మాఫీ కాలేదని జేడీఏ కే అనురాధ గుర్తించారు. ఈ సందర్భంగా రైతులతో జేడీఏ మాట్లాడారు. అలంకానిపేట ఐవోబీ పరిధిలోని పెద్దకొర్పోలు, అలంకానిపేట, బొల్లికొండ గ్రామాలకు చెందిన అర్హులైన రైతులకు రుణాలు అందించాల్సి ఉందని జేడీఏ తెలిపారు. అర్హులైన రైతుల వివరాలను ప్రభుత్వానికి నివేదించి రుణమాఫీ కావడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆమె వెంట ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ తదితరులున్నారు.
సర్కారు తీరుపై రైతుల ఆగ్రహం
గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీ గా మాఫీ అయిన రైతుల సంఖ్య, మాఫీ అయిన వివరాలను వ్యవసాయ శాఖ ప్రకటించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు రూ.2 లక్షలలోపు పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు తర్వాత నిబంధనల పేరుతో మాట తప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాఫీ ప్రక్రియ మొదటి దశను జూలైలోనే మొదలు పెట్టినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అదే నెలాఖరులో రెండో దశ, ఆగస్టులో మూడో దశ రుణ మాఫీ చేస్తున్నట్లు చెప్పింది. పంట రుణాలు ఉన్న వారిలో సగం మందికి కూడా మాఫీ కాలేదు. రేషన్‌కార్డు, కుటుంబం, భార్యభర్త కలిపి రూ.2లక్షల పంట రుణాలు..
ఇలా అనేక నిబంధనలు పెట్టి రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వ సగానికి తగ్గించింది. దీనిపై రైతులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. రైతుల ఉద్యమాలతో రాష్ట్ర ప్రభు త్వం సర్వే పేరుతో సాగదీసింది. కుటుంబం నిబంధన కోసం రైతులు ఫొటోలతో సహా వివరాలివ్వాలని సూచించింది. సర్వే పేరుతో రెండు నెలల పాటు సాగదీసింది. నాలు గో దశ మాఫీ ప్రక్రియను నవంబర్ 30న మొదలుపెట్టినట్లు ప్రకటించింది. మాఫీ అయిన రైతుల జాబితాను వెల్లడించడం లేదు. బ్యాంకుల్లోనూ వివరాలు లేకపోవడంతో ఎవరెవరికి మాఫీ అయ్యిందో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.