వరంగల్ చౌరస్తా: విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగానే తమ రెండు నెలల కుమారుడు ఆక్సిజన్ అందక మృతి చెందినట్లు ఆరోపిస్తూ కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టిన ఘటన ఎంజీఎం హాస్పిటల్ పీడియాట్రిక్ వార్డులో చోటుచేసుకుంది. ములుగు జిల్లా వాజేడు మండలం ఏడుచెర్లపల్లి గ్రామానికి చెందిన నాగారపు గణేష్, సంధ్య దంపతుల కుమారుడు అనారోగ్య సమస్యలతో ఎంజీఎం పీడియాట్రిక్ వార్డులో నాలుగు రోజుల క్రితం ఆడ్మిట్ అయ్యాడు. బుధవారం మద్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో పీడియాట్రిక్ వార్డులో విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో వెంటిలేటర్ పనిచేయకపోవడంతో ఆక్సిజన్ అందక రెండు నెలల వయస్సు కలిగిన తమ కుమారుడు (మోక్షిత్) మృతి చెందారని తల్లిదండ్రులు ఆరోపించారు.
ఈ విషయంపై వైద్యాధికారులు స్పందిస్తూ శిశువు మృతి చెందిన సమయంలో విద్యుత్ అంతరాయం లేదని, అత్యాధునిక జనరేటర్ (ఆటోమేటిక్ ఆన్ సిస్టమ్), వెంటిలేటర్ పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయని అన్నారు. శిశువు ఆరోగ్యస్థితి విషయంగా ఉండడం కారణంగా అడ్మిట్ చేసుకోవడం జరిగిందని, ఆరోగ్య పరిస్థితిని తల్లిదండ్రులకు ముందుగానే వివరించామని, ఊపిరితిత్తుల సమస్య ఎక్కువ కావడం, గుండె సంబంధిత సమస్యలు సైతం ఉండటం చేతనే శిశువు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దాంతో శిశువు మృతదేహాన్ని కుటుంబసభ్యులు స్వగ్రామానికి తరలించారు.