Mulugu | ఏటూరు నాగారం : ఏటూరునాగారంలో నిర్మించిన అయ్యప్ప దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను ఆదివారం ప్రారంభించారు. భద్రకాళి ఆలయ అర్చకులు రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టి ప్రతిష్టాపన ఉత్సవాలను ప్రారంభించారు. ఆలయంలో ప్రతిష్టించే ధర్మశాస్త్ర అయ్యప్ప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి విష్ణుమూర్తి శివలింగం మాలికాపుర రత్తమ్మ విగ్రహాలతో రథ యాత్ర చేపట్టారు. ఈనెల 16 విగ్రహ ప్రతిష్టాపన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందు కోసం ఆలయ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యాగశాల నిర్మించారు. హోమాలు చేయనున్నారు. 16వ తేదీన విగ్రహ ప్రతిష్టాపన అనంతరం భారీ మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టేందుకు నిర్మాణ కమిటీ ఏర్పాటు చేశారు. రథాన్ని పూలతో అలంకరించారు. స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేపట్టి టెంకాయలు కొట్టి మంగళహారతులు ఇచ్చి ప్రారంభించారు.
రామలింగేశ్వర స్వామి ఆలయం నుంచి మహిళల కోలాటాలు నృత్యాల మధ్య అంగరంగ వైభవంగా ఊరేగింపుగా పద్మశాలి వాడ ఓడవాడ హనుమాన్ దేవాలయం వరకు చేరుకుని అక్కడి నుంచి తిరిగి బస్టాండ్ మీదుగా ఆలయానికి చేరుకున్నారు. ఊరేగింపులో వాడవాడనా మహిళలు రథానికి నీటిని ఆరబోసి మంగళహారతులు సమర్పించి టెంకాయలు కొట్టి రథాన్ని స్వాగతించారు. వేడుకల్లో ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు బోల్సాని గౌరీ శంకర్, అర్చకులు ఎల్లాప్రగడ రాధాకృష్ణశర్మ, ఆలయ కమిటీ సభ్యులు అల్లి శ్రీనివాస్, కునూరు అశోక్, పర్వతాల లాలయ్య, పాలకుర్తి పాపారావు, నర్సింగరావు, మైనర్ బాబు, బోడసత్యం, అర్జున్, దొడ్డ కృష్ణ, యాదిరెడ్డి, రాజు, కార్తీక్ తో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.