వరంగల్, ఆగస్టు 14 : యువతలో జాతీయతా భావం పెంపొందించాలని ఏవీవీ కళాశాల ప్రిన్సిపాల్ భుజేందర్రెడ్డి అన్నారు. సోమవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వలంటీర్లు జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ పౌరులు దేశభక్తి కలిగి ఉండాలన్నారు. స్వాతంత్య్ర అమృత్మహోత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు జయజ్ఞ, కార్తికేయ, ఉమేశ్, శ్రీదేవి, శివాని, రోహన్, అశోక్, ప్రవీణ్ పాల్గొన్నారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయలను పరిరక్షించాలనే లక్ష్యంతో ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులతో జాతీయ ప్రతిజ్ఞ చేయించారు. సోమవారం ప్రిన్సిపాల్ అచార్య బన్న అయిలయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేటి తరం ప్రాశ్చాత్య సంస్కృతి వైపు పరుగులు పెట్టకుండా, వారసత్వ సంస్కృతి సంప్రదాయలను కాపాడాలన్నారు. దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగాలు చేసిన మహానుభావులను స్మరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అద్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
హనుమకొండ చౌరస్తా : 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎల్బీ కళాశాలలో 10వ తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ కెడెట్స్ 76 అక్షరం రూపంలో కూర్చొని అబ్బురపరిచారు. 76 ఏళ్లుగా దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినందుకు విద్యార్థులు ఇలా విన్యాసాలు చేయడం సంతోషంగా ఉందని ప్రిన్సిపాల్ అరుణ అన్నారు. కార్యక్రమంలో కెప్టెన్ డాక్టర్ ఎం సదానందం, కెడెట్లు పాల్గొన్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు విశ్వవిద్యాలయ పరిపాలనా భవన ప్రాంగణంలో వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టీ శ్రీనివాసరావు తెలిపారు. బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు హాజరుకావాలని ఆయన కోరారు.