కాంగ్రెస్ సర్కారు తెచ్చిన ‘ఉచిత బస్సు ప్రయాణం’తో ఆటోడ్రైవర్ల బతుకు ఆగమైంది. ఆటో ఎక్కేవారు లేక గిరాకీలు తగ్గిపోయి ఉపాధి కోల్పోవడంతో కుటుంబపోషణ భారంగా మారింది. మొన్నటిదాకా నాలుగైదు ట్రిప్పులు కొట్టి సంతోషంగా గడిపిన ఆటోవాలా.. ఇప్పుడు రోజంతా అడ్డా మీద పడిగాపులు కాసినా బండి సీరియల్ రాక ఆర్థికంగా చితికిపోయి అప్పులపాలవుతున్నాడు. కిరాయిలు దొరుకక చేతిలో చిల్లిగవ్వ కనిపించక కుటుంబాన్ని పోషించుకోవడం ఎలా అని దిగాలు పడుతున్నాడు. అంతేగాక మరికొద్ది రోజుల్లో విద్యాసంవత్సరం మొదలుకానుండడంతో పిల్లల పుస్తకాలు, డ్రెస్సులు, స్కూల్ ఫీజులు ఎలా కట్టాలని ఆందోళన చెందుతున్నాడు. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని నమ్మించి.. రేవంత్‌రెడ్డి సర్కారు మా పొట్ట కొట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం స్పందించి ఫ్రీ బస్సు అమలుపై పునరాలోచన చేసి ఆటోడ్రైవర్లను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆటో కార్మికుల బతుకులు రోడ్డున పడ్డాయి. గిరాకీలు తగ్గడంతో రోజువారీ సంపాదన బాగా తగ్గిపోయి ఆటోలు అమ్ముకొని రోజు కూలీలుగా మారుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఫ్రీ బస్సు నిర్ణయంతో ఆటో నడిస్తేనే పూట గడిచే వేలాది మంది కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాకేంద్రాలు సహా వివిధ మండల కేంద్రాలు, ముఖ్యమైన గ్రామాల్లో నిత్యం వందలాది ఆటోలు తిరుగుతుంటాయి. పురుషులకు బైక్‌లు, ఇతర వాహనాల్లో ప్రయాణిస్తుంటారు.. కానీ మహిళలు మాత్రం ఆటోలపై ఆధారపడుతారు. గ్రామాలు, మండల కేంద్రాల నుంచి ఎక్కువగా ఆటోలో ప్రయాణించే వారు మహిళలు మాత్రమే. అయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణంతో మహిళలు ఆటోలు ఎక్కడం లేదు. ఫలితంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాది మంది కార్మికుల ఉపాధిపై ప్రభావం చూపుతున్నది. అద్దెకు ఆటోలు తీసుకొని నడుపుకునే వారి పరిస్థితి మాత్రం చాలా దారుణంగా తయారైంది. కనీసం పెట్రోల్, డీజిల్ చార్జ్జీలు, కూలీ కూడా రావడం లేదని వాపోతున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభం కానుండడంతో పిల్లల స్కూల్స్ ఫీజులు, పుస్తకాలు, డ్రెస్సులు, బ్యాగులు, బూట్లు తదితర సామగ్రి కొనుగోలు చేసేందుకు చేతిలో డబ్బులు లేవని ఆందోళన చెందుతున్నారు. గతంలో రోజుకు ఖర్చులు పోను రూ.500 నుంచి రూ.600 వరకు మిగిలేవని ఇప్పుడు కనీసం కూలీ కూడా గిట్టుబాటు కాక ఇంటి అద్దెలు, ఖర్చులకు అప్పు చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. చేతినిండా పని లేకపోవడం వల్ల ఆర్థికంగా నష్టపోయి అప్పుల బారిన పడుతున్నారు. మరికొన్ని కుటుంబాలు వలస పోతున్నాయి. ఆటో కార్మికులకు ఏటా డబ్బులు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పటివరకు ఎలాంటి లబ్ధి చేకూర్చలేదని, ఇప్పటికైనా స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
మహబూబాబాద్ రూరల్, మే 21 : పదేళ్ల నుంచి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. మాకు కూడా మేలైతదని నమ్మిన. కానీ, రేవంత్ సర్కారు మా కడుపు కొట్టింది. ఉచిత బస్సు సర్వీస్ అని పెట్టి ఆటోడ్రైవర్ల జీవితాలను ఆగం చేసింది. ఆటోలకు గిరాకీ మొత్తం తగ్గింది. రోజువారీ ఖర్చులు కూడా రావడం లేదు. మహబూబాబాద్ మండలం రెడ్యాల, కంబాలపల్లి, వేంనూరు, పర్వతగిరి అడ్డాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వేంనూరు అడ్డా మీద రోజుకు కనీసం ఒక్కసారైనా నా బండి సీరియల్ రావడం లేదు. మహిళలు గంట లేటైనా ఆగి బస్సులోనే వెళ్తున్నరు. రోజువారీ ఖర్చులు కూడా ఇబ్బంది అవుతోంది. ఇల్లు గడవడం లేదు. కూలి పనులకు వెళ్లాల్సి వస్తున్నది. పిల్లల చదువు, కుటుంబ పోషణ భారమైంది. నెలవారీ కిస్తీలు కట్టకపోవడంతో ఆటోలను లాక్కోవడంతో కొందరు డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి.
నర్సంపేట : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు స్కీమ్ పెట్టడం వల్ల మా ఆటో డ్రైవర్లకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆటోలు నడపడం కష్టమవుతున్నది. ఇదివరకు నాలుగు ట్రిప్పులు కొట్టేది. పొద్దంత తిరిగినా ఒక్క ట్రిప్పు కూడా కొడుతలేం. నర్సంపేట నుంచి నెక్కొండకు రోజూ ఆటోలు నడిచేవి. ఇప్పుడు ఆటోల సంఖ్య తగ్గిపోయింది. నేను ఒక ట్రిప్పు నర్సంపేట నుంచి పోయి, మళ్లీ రావడానికి పొద్దుపోతున్నది. దీని వల్ల ఆర్థికంగా చాలా నష్టపోతున్నాం. ఇంకొన్ని రోజులైతే పిల్లల స్కూళ్లు కూడా ప్రారంభమవుతాయి. ఫీజులు, పుస్తకాలకు డబ్బులు ఎట్ల..? చేతిలో చిల్లిగవ్వలేదు. ఇగ అప్పులు చేయక తప్పదు. ప్రభుత్వం మా ఆటో కార్మికులను ఆదుకోవాలి.
జనగామ చౌరస్తా, మే 21 : సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లం ఉపాధి కోల్పోయాం. ఆరు నెలల నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నం. ఒక రోజు కుటుంబం గడవాలంటేనే చాలా కష్టంగా ఉంది. గతంలో దేవరుప్పుల నుంచి జనగామకు రానుపోను ఆటో నడిపితే డీజిల్ ఖర్చుపోను రోజుకు రూ.1300 దాకా మిగిలేది. ఇప్పుడు పొద్దన్నుంచి కిరాయిల కోసం పడిగాపులు పడుతున్న. డీజిల్ ఖర్చుపోను రూ.500 కూడా ఎల్లే పరిస్థితి లేదు. ఇగ రేపో, మాపో స్కూల్లు తెరుస్తరు. మా పిల్లలకు పుస్తకాలు, కాపీలు కొనాలే, వాళ్లు అడిగినంత ఫీజు కట్టాలె. ఈ పరిస్థితిల ఇవన్ని ఎట్ల చేయాలే. ఇవేగాక రోజు కట్టే ఫైనాన్స్‌లు ఎట్ల ఎల్లదీయాలె. కాంగ్రెస్ వస్తే మార్పొస్తదని ఓటేస్తే, ఫ్రీ బస్సులతో మాకు ఉపాధి లేకుండా చేసిండ్రు. రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా మా ఆటోడ్రైవర్లకు న్యాయం చేసి ఆర్థికంగా ఆదుకోవాలె.
భూపాలపల్లి రూరల్, మే 21 : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటోడ్రైవర్ల బతుకులు ఆగమైనయ్. నా పేరు భూక్యా కిరణ్. నాకు ఒక బిడ్డ, కొడుకు. బిడ్డ ఇంటర్ చదువుతుండగా, కొడుకు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కుటుంబ పోషణ, బతుకు దెరువు కోసం ఆటో డ్రైవర్‌గా గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. పెద్దకుంటపల్లి నుండి భూపాలపల్లి పట్టణానికి, కిరాయిలు వస్తే ఇతర ప్రాంతాలకు ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నాకు కష్టాలు మొదలైనయ్. మహిళల కోసం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణంతో కిరాయిలు రాక, గిరాకీ లేక మా బతుకుల బజారున పడ్డయ్. జూన్‌లో కాలేజీలు, స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. మా పిల్లలకు ఫీజులు ఎలా చెల్లించాలో, బుక్స్, డ్రెస్సులు ఏవిధంగా కొనాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని, ప్రతి నెలా కొంత ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుతున్నా.
హనుమకొండ : తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ బస్సు పథకం తీసివేస్తేనే ఆటో డ్రైవర్ల కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఈ పథకం ఇలాగే కొనసాగిస్తే ఆటోవాలల బతుకులు చిందరం అయ్యే ప్రమాదం ఉంది. గిరాకీలు లేకపోవడంతో రోజు వారి సంపాదన తగ్గింది. తద్వారా కుటుంబ పోషణ భారం అవుతుంది. అంతేకాక ఆటోలకు చెల్లించాల్సిన కిస్తీలు, మా పిల్లలకు బడి ఫీజులు కట్టే పరిస్థితి లేదు. కొందరు ఆటో డ్రైవర్ల పరిస్థితి అయితే దారుణంగా ఉంది. ఫ్రీ బస్సు పథకంతో ప్రభుత్వం అనుకున్నది జరుగడం లేదు. అందులో ఎక్కేవారంతా ఉద్యోగులు, ఉన్నత వర్గాల వారే. అలాగే ఆటో కిస్తీలు కట్టకపోతే ఆటోలు తీసుకెళ్తున్నారు. బడి ఫీజు కట్టకపోతే పిల్లలను బడికి రానివ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించి మాకు దారి చూపించాలి.
ములుగురూరల్, మే21: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఫ్రీ బస్సులను పెట్టి మా పొట్టమీద కొట్టిందని ములుగు జిల్లా శ్రీ చైతన్య ఆటో యూనియన్ అధ్యక్షుడు గంట భగవాన్‌రెడ్డి, డ్రైవర్లు శ్రీను, పుల్యాల ధర్మేందర్, ఎండీ యాకూబ్, అన్నారపు భిక్షపతి, చిర్ర శోభన్‌బాబు, మామిడిపెల్లి రమేశ్, ఎండీ ఫరీద్ తమ గోడు వెల్లబోసుకున్నారు. ‘తమ యూనియన్‌లో సుమారు 100 మంది డ్రైవర్లు ఉంటారని, అందరూ అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. గతంలో మా వాహనాలను పట్టుకొని బయటకు వెళ్తే చేతి నిండా పైసలుండేవి. ఇప్పుడు ఇంట్లో బంగారం కాన్నుండి కుదవబెట్టి కిస్తీలు, టాక్సీలు కట్టాల్సి వస్తాంది. పొద్దుందాక అడ్డ మీద బండి పెట్టుకొని ఉంటే రూ.100 లేదా రూ.50 మాత్రమే వస్తున్నాయి. అవి కూరగాయాలకే సరిపోతున్నయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేస్తానని చెప్పి మోసం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా బతుకులు మంచిగ ఉండె. ప్రజలు ఆర్టీసీ బస్సులు ఎక్కినా కూడా మాకు చేతి నిండా పైసలు కనిపించేవి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫ్రీ బస్సులను పెట్టి మా కుటుంబాల మీద దెబ్బకొట్టింది. ఫ్రీ బస్సును ఎత్తివేయాలె. ప్రభుత్వం ప్రైవేటు డ్రైవర్లను ఆదుకోవాలి. ప్రస్తుతం అన్ని వస్తువులు పిరమైనయ్. మాకు వచ్చే రూ. వంద, యాభై ఏం చేసుకోవాలె. ప్రైవేటు డ్రైవర్ల కుటుంబాల కోసం పార్టీలకతీతంగా అందరూ గళం విప్పాలి. మాకు అండగా ఉండాలి’ అని ఆటోడ్రైవర్లు కోరారు.
వర్ధన్నపేట, మే 21: ఆటోపైనే నా కుటుంబం బతుకుతున్నది. ప్రతి రోజూ వర్ధన్నపేట నుంచి వరంగల్, జఫర్గడ్, ఇతర రూట్లలో ఆటోను నడిపేటోన్ని. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తుండడంతో ఉపాధి పూర్తిగా పోయింది. కుటుంబ పోషణకు ఇబ్బందైతాంది. పిల్లలకు బడి ఫీజులు ఎట్లా కట్టాలో తెల్వడంలేదు. మా పరిస్థితి దయనీయంగా తయారైంది.