Auto Driver | వరంగల్ చౌరస్తా : తన ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తుల వద్ద వెండి ఆభరణాలు ఉన్నాయని నిర్ధారించుకొని, ఆభరణాలు కలిగి వున్న బ్యాగును తీసుకునేలోపే పారిపోయిన ఆటో డ్రైవర్‌ను ఇంతేజార్గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సోమవారం వరంగల్ సబ్ డివిజన్ ఏఎస్పీ శుభం నాగ్రాలే తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 29న హైదరాబాద్‌కు చెందిన పంకజ్ యాదవ్ తన ఇద్దరు గుమాస్తాలైన విమల్ యాదవ్, ముఖేష్ సోనిలకు సుమారు ఐదు కిలోల నూతన వెండి ఆభరణాలను విక్రయ నిమిత్తం వరంగల్‌కు పంపాడు. రాత్రి సమయంలో హైదరాబాద్ నుండి హనుమకొండకు చేరుకున్న విమల్ యాదవ్, ముఖేష్ సోనిలు వరంగల్ వైపు ప్రయాణిస్తున్న సమయంలో వెండి ఆభరణాల విషయాలను చర్చించుకోవడాన్ని ఆటో డ్రైవర్ మేరుగు వెంకట్ గమనించాడు.
ఇద్దరు ప్రయాణీకులు దిగి తమ బ్యాగును తీసుకునేలోపే ఆటో డ్రైవర్ మేరుగు వెంకట్ తన ఆటోతో పారిపోయాడు. దీంతో బాధితులు ఇంతేజార్గంజ్ పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆటో నంబర్‌ను గుర్తించి, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన నిందితుడు మేరుగు వేంకట్ని ఆరెస్ట్ చేశారు.
అతడి వద్ద నుంచి దొంగిలించిన వెండి ఆభరణాలను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరిచినట్టు పేర్కొన్నారు. తక్కువ సమయంలో కేసును చేధించిన సీఐ షుకుర్, ఎస్సై తేజ, కానిస్టేబుల్ సురేష్, దీపక్‌లను ఏఎస్పీ అభినందించారు.