KTR : ‘చట్టవిరుద్ధమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించడం ముగిసింది’ అని ఆదివారం రాత్రి సిట్ చీఫ్ సజ్జనార్ ప్రకటించడం వివాదాస్పదం అయ్యింది. సజ్జనార్ తీరును ఇప్పటికే మాజీ మంత్రి హరీష్‌రావు తప్పుపట్టారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సజ్జనార్ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తంచేశారు.
‘కమిషనర్‌గారూ (సజ్జనార్‌ను ఉద్దేశించి) మీరే న్యాయమూర్తిగా, జ్యూరీగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లుగా కనబడుతున్నారు. దయచేసి మీరు దర్యాప్తు బృందానికి చైర్మన్‌గా ఉన్నారనే విషయాన్ని గుర్తుచేసుకోండి. ఫోన్ ట్యాపింగ్ కేసు చట్టవిరుద్ధమా, చట్టబద్ధమా..? అనేది చట్టపరంగా కోర్టు ద్వారా నిరూపణ కావాల్సి ఉంది’ అని కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు.
‘ఇలాంటి తీవ్ర అభ్యంతరకరమైన ప్రకటనలను గౌరవ కోర్టులు పరిగణలోకి తీసుకుంటాయని, అందుకు తగిన చర్యలు తీసుకుంటాయని నేను ఆశిస్తున్నా’ అంటూ ముగించారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు కేసీఆర్‌ను ఆదివారం నందినగర్‌లోని ఆయన నివాసంలో ఐదు గంటలపాటు విచారించారు. విచారణ ముగిసిన అనంతరం ప్రకటన చేస్తూ సజ్జనార్.. ‘ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు’ అని వ్యాఖ్యానించారు.