గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జుడోకాలు స్వర్ణ చరిత్ర సృష్టించారు. మెగా క్రీడల్లో ఇదివరకూ ఒక్క స్వర్ణం కూడా సాధించలేకపోయినా మన జుడోకాలు ఈసారి ఒకే రోజు రెండు బంగారు పతకాలు, ఓ రజతం నెగ్గి ఔరా అనిపించారు. జూడో బృందం ఇక్కడికి రావడానికి ముందే డోపింగ్ ఉల్లంఘనలతో ఇద్దరిపై వేటు పడటం వివాదం రేపినా.. గ్లాస్గో చేరుకున్న తర్వాత లగేజ్ గల్లంతవడంతో శిక్షణ సామగ్రి లేకపోయినా… బరిలోకి దిగాక మన జుడోకాలు అద్భుత ప్రదర్శన చేశారు. అస్మిత కామన్వెల్త్ చరిత్రలో తొలి స్వర్ణం గెలిచిన భారత జుడోకాగా రికార్డులకెక్కిన నిమిషాల వ్యవధిలోనే హర్ష్ సింగ్ మెగా గేమ్స్‌లో గోల్డ్ నెగ్గిన అబ్బాయిగా నిలిచాడు. మరో ప్లేయర్ యామని మౌర్య రజతం అందుకుంది. శుక్రవారం హోరాహోరీగా సాగిన మహిళల 48 కేజీల ఫైనల్లో అస్మిత గోల్డెన్ స్కోర్‌లో యూకో (2-1)తో కెనడా ప్రత్యర్థి హైది క్వాష్ పని పట్టింది. 4 నిమిషాల తుదిపోరులో ఆరంభంలోనే ప్రత్యర్థికి యూకో ఇచ్చుకోవడంతో పాటు పెనాల్టీకి గురైన అస్మిత తర్వాత అద్భుతంగా పుంజుకుంది. మెరుపు వేగంతో హైదిపై ఎదురుదాడి చేసి స్కోరు 1-1తో సమం చేసింది.

నిర్ణీత సమయంలో ఇద్దరూ సమంగా నిలవడంతో ఆట గోల్డెన్ స్కోర్ పీరియడ్‌కు దారి తీసింది. తొలుత పాయింట్ సాధించిన ప్లేయర్ విన్నర్‌గా నిలిచే ఈ పీరియడ్ చివర్లో ప్రత్యర్థిని ఒకవైపున కింద పడేసి యూకో పాయింట్ సాధించడంతో అస్మితనే స్వర్ణం వరించింది. పురుషుల 60 కేజీ ఫైనల్లో 23 ఏండ్ల హర్ష్ వజా- అరి (10-0)తో ఆస్ట్రేలియాకు చెందిన మేటి ఆటగాడు జోషువా కాట్జ్పై సంచలన విజయం సాధించాడు. చాంపియన్ల కుటుంబం నుంచి వచ్చి గోల్డ్ మెడల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన కాట్జ్‌తో హర్ష్ ఆరంభం నుంచే హోరాహోరీగా తలపడ్డాడు. ఇద్దరి డిఫెన్స్ బలంగా ఉండటంతో చివరి వరకూ ఎవ్వరూ పాయింట్ సాధించలేకపోయారు. కానీ, ఆట మరో 41 సెకండ్లలో ముగుస్తుందనగా హర్ష్ మ్యాజిక్ చేశాడు. జూడోలో రెండో అత్యధిక స్కోరింగ్ టెక్నిక్ అయిన వజా-అరితో కాట్జ్‌ను మ్యాట్‌పై ఓ పక్కకు విసిరి అదిమిపట్టిన హర్ష్ తన కెరీర్లో అతి పెద్ద విజయం సొంతం చేసుకున్నాడు.
యామిని తడబాటు

57 కేజీ ఫైనల్లో యామిని కొద్దిలో స్వర్ణం చేజార్చుకుంది. ఇంగ్లండ్‌కు చెందిన అలెస్యా టోప్రాక్ చేతిలో పోరాడి ఓడింది. ఈ పోరులో ఇద్దరు జుడోకాలు నువ్వానేనా అన్నట్టు తలపడినా నిర్ణీత సమయంలో పాయింట్ నెగ్గలేకపోయారు. గోల్డెన్ స్కోర్‌లో కూడా ఎవ్వరూ పాయింట్ నెగ్గలేదు. కానీ, మ్యాచ్‌లో టోప్రాక్ రెండు పెనాల్టీలు ఎదుర్కోగా.. మూడోసారి పెనాల్టీకి గురైన యామిని ఓటమి పాలైంది. ఇతర విభాగాల్లో శ్రద్ధ చోపడే (52 కేజీ), రోహిత్ బసీర్ మజ్గుల్ (66 కేజీ) నిరాశపరిచారు.
ఫైనల్లో మిక్స్డ్ రిలే జట్టు
4×400 మీటర్ల మిక్స్డ్ రిలేలో భారత్ ఫైనల్ చేరుకుంది. టీకే విశాల్, అనిశా బసు, రాజేశ్ రమేశ్, రశ్దీప్ కౌర్‌తో కూడిన భారత్ 3 నిమిషాల 20.98 సెకండ్ల టైమింగ్‌తో రౌండ్1 హీట్‌లో నాలుగో స్థానం, ఓవరాల్‌గా ఏడో స్థానంతో శనివారం జరిగే ఫైనల్ రౌండ్లో అడుగు పెట్టింది.
సూపర్ సీమ

భారత డిస్కస్ త్రోవర్ సీమ కళిరమన్ కాంస్యంతో మెరిసింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆర్థరైటిస్, మోకాలి గాయంతో పోరాడి రీఎంట్రీ ఇచ్చిన సీమ ప్రతిష్టాత్మక ఈవెంట్లో పతకంతో సత్తా చాటింది. గురువారం అర్ధరాత్రి జరిగిన మహిళల డిస్కస్ త్రో ఫైనల్లో సీమ 58.65 మీటర్లతో మూడో స్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన మరో అథ్లెట్ నిధి రాణి 55.67 మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచి కొద్దిలో పతకం చేజార్చుకుంది. జమైకాకు చెందిన సమంత హాల్ 61.66 మీటర్ల త్రో చేసి స్వర్ణం ఖాతాలో వేసుకోగా.. కెనడా అథ్లెట్ జులియా టంక్స్ (60.67 మీ) రజతం అందుకుంది. హర్యానాకు చెందిన 27 ఏండ్ల సీమ ప్రసవం తర్వాత ఆర్థరైటిస్, మోకాలి గాయం కారణంగా కొన్నాళ్లు ఆటకు దూరమైంది.
ఆమెకు ఇప్పుడు నాలుగేండ్ల కొడుకు ఉన్నాడు. పీహెచ్డీ స్కాలర్ అయిన సీమ ‘అథ్లెట్ల ప్రదర్శనపై పాజిటివ్ సెల్ఫ్-టాక్, విజువలైజేషన్ ప్రభావం’ అనే అంశంపై పరిశోధన చేస్తున్నది. ఫైనల్ పోటీల్లో ఆమె విసిరిన తొలి త్రో నెట్లో చిక్కుకున్నా.. తన రీసెర్చ్‌లోని ‘పాజిటివ్ థింకింగ్’ సిద్ధాంతాన్నే ఆయుధంగా మార్చుకున్న సీమ ఒత్తిడికి లోనుకాకుండా మూడో ప్రయత్నంలో 58.65 మీటర్ల దూరం విసిరి కాంస్యం ఖరారు చేసుకుంది. ఎలాంటి ఉద్యోగ భద్రత లేకపోయినా.. బిడ్డ సంరక్షణ, పీహెచ్డీ పరిశోధన, ప్రాక్టీస్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఈ పతకం నెగ్గిన సీమ ఆత్మవిశ్వాసం, కుటుంబ మద్దతు ఉంటే ఏ అడ్డంకినైనా అధిగమించవచ్చని నిరూపించింది.
బాక్సర్ల పంచ్ పటాకా

బాక్సింగ్ రింగ్‌లో తిరుగులేని ప్రదర్శన చేస్తూ ఏడుగురు భారత బాక్సర్లు ఫైనల్‌కు దూసుకెళ్లారు. డిఫెండింగ్ చాంపియన్‌కు షాకిచ్చిన అరుంధతి చౌదరితో పాటు వరల్డ్ చాంప్ జైస్మిన్ లంబోరియా, ప్రీతి పవార్, అంకుష్ , జాదుమణి సింగ్, సాక్షి, ప్రియ ఫైనల్ చేరి భారత్‌కు కనీసం 7 రజత పతకాలను ఖాయం చేశారు. మహిళల 70 కేజీ సెమీస్‌లో అరుంధతి 4-0తో వేల్స్‌కు చెందిన రోజీ ఎకిల్స్‌కు షాకిచ్చింది. జైస్మిన్ (57 కేజీ) ప్రత్యర్థి లెసోపై విరుచుకుపడటంతో రెండో రౌండ్లోనే రిఫరీ పోటీని ఆపి జైస్మిన్‌ను విజేతగా ప్రకటించారు. ఆసియా క్రీడల కాంస్య విజేత ప్రీతి (54 కేజీ) 5-0తో క్యాథరిన్ (జాంబియా)ను, సాక్షి 5-0తో జేన్ వాల్ (కెనడా), ప్రియ (60కేజీ) వీట్లే (ఇంగ్లండ్)ను చిత్తు చేశారు. ఇక పురుషుల 80 కేజీల్లో అంకుష్ 5-0తో కెనడా బాక్సర్ ఒఫోరిపై, జాదుమణి (55 కేజీ)5-0తో నమీబియాకు చెందిన హోసెబ్పై ఏకపక్ష విజయాలతో స్వర్ణ పోరుకు అర్హత సాధించారు.