హనుమకొండ రస్తా : హనుమకొండ( Hanamakonda ) లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ ఎస్) లో 5వ ఓపెన్ నేషనల్ అండర్ -23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్(Athletics competitions ) పోటీలు పోటాపోటీగా ముగిసాయి. మూడురోజుల పాటు జరిగిన పోటీల్లో దేశవ్యాప్తంగా 937 మంది అథ్లెట్లు పాల్గొని ప్రతిభ కనబర్చారు. జేఎన్ఎస్ వేదికగా గతంలో ఎన్నడూలేనివిధంగా అథ్లెట్లు రికార్డులను బ్రేక్ చేశారు. చివరిరోజు 16 ఈవెంట్లలో అథ్లెట్లు పాల్గొని పతకాలు సాధించారు.
శనివారం ఉదయం 5 వేల మీటర్ల పరుగుపందెం, 200 మీటర్లు, లాంగ్‌జంప్, జావెలిన్‌త్రో, 400 మీటర్స్ హార్డిల్స్, హామ్మర్త్రో, ట్రిపుల్‌జంప్, 800 మీటర్లు, 3వేల మీటర్లు, మెన్ అండ్ ఉమెన్స్‌కు పోటీల్లో ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ వరద రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ మూడురోజుల జాతీయ పోటీల్లో దేశవ్యాప్తంగా ఎంతో మంది సీనియర్ అథ్లెట్లు పాల్గొని పతకాలు సాధించారన్నారు. క్రీడాకారులకు, టెక్నికల్ ఆఫిషీయల్స్కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి సౌకర్యాలు కల్పించామన్నారు.
తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ర్ట కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ జేఎన్‌ఎస్‌లోని సింథటిక్ ట్రాక్‌లో నేషనల్స్ నిర్వహించడం తెలంగాణ అథ్లెట్లకు మంచి అవకాశం, చుట్టూ లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కోరారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షుడు స్టాన్లీ జోన్స్, రాష్ర్ట కార్యదర్శి సారంగపాణి, డీవైఎస్వో గుగులోతు అశోక్‌కుమార్, ములుగు జిల్లా అధ్యక్షుడు, రెజోనెన్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పగిడిపాటి వెంకటేశ్వర్, వరంగల్ జిల్లా సెక్రటరీ యుగేందర్ ప్రతిభకనబర్చిన అథ్లెట్లకు మెడల్స్ అందజేసి అభినందించారు.