కేంద్ర బడ్జెట్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ పీవోహెచ్‌కు నిధులు కేటాయించాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ డిమాండ్ చేశారు. కాజీపేటలోని ప్యారడైజ్ ఫంక్షన్హాల్లో గురువారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నాయకులు చిల్లర మాటలు కట్టిపెట్టి, కాజీపేట రైల్వే జంక్షన్ అభివృద్ధికి సహకరించాలని హితవుపలికారు. టీఆర్ఎస్కు రాజీనామాలు, పోరాటాలు కొత్తకాదని స్పష్టం చేశారు కోచ్ ఫ్యాక్టరీ కోసం మరో ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. విభజన చట్టంలోని హామీలు అమలు అయ్యేవరకూ పోరాడుదామని పిలుపునిచ్చారు. కాజీపేట
కాజీపేట, జనవరి 27 : బీజేపీ నాయకులు చిల్లర మాటలు కట్టిపెట్టి, కాజీపేట రైల్వే జంక్షన్ సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ డిమాండ్ చేశారు. కాజీపేటలోని ప్యారడైజ్ ఫంక్షన్హాల్లో ఆల్ ట్రేడర్స్ అసోసియేషన్, వర్తక సంఘం ఆధ్వర్యంలో కాజీపేట జంక్షన్ రైల్వే సమస్యలపై తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్ జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ అధ్యక్షతన గురువారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కాజీపేట వ్యాగన్ పీవోహెచ్ నిర్మాణానికి భారీ నిధులు మంజూరు చేయకుంటే జీజేపీ నాయకుల భరతం పడుతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకుండా రాష్ర్టానికి తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు రాష్ర్టానికి న్యాయం గా రావాల్సిన ప్రాజెక్టుల గురించి పార్లమెంట్లో ఏనాడూ నోరెత్తలేదన్నారు. రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్డు, కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం మరోఉద్యమానికి టీఆర్ఎస్ సిద్ధం గా ఉందన్నారు. గల్లీల్లో తిరిగే బీజే పీ నాయకులకు ఈ ప్రాంతంపై ప్రేమ ఉంటే ఢిల్లీలో బీజేపీ అధిష్ఠానాన్ని ఒప్పించి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెప్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై ఇష్టారాజ్యంగా మాట్లాడడం తప్ప ఏం చేయలేదని చెప్పారు. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల ఎంపీల తరహాలో పార్టీలకు అతీతంగా రాష్ర్టానికి సాయం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, వ్యాగన్ పీవోహెచ్ షెడ్డు నిర్మాణానికి కావాల్సిన నిధుల మంజూరు కోసం తమను రాజీనామా కోరడం విడ్డూరంగా ఉందన్నారు. మాకు రాజీనామాలు, పోరాటాలు చేయడం కొత్తకాదని, ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ పీవోహెచ్ షెడ్డుకు నిధులు, కాజీపేట రైల్వే జంక్షన్ డివిజన్ హోదా కోసం ప్రజల పక్షాన ఉండి ఉద్యమిస్తామని హెచ్చరించారు. బడ్జెట్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ పీవోహెచ్‌కు భారీ నిధులు మంజూరు చేసేందుకు నిరసనలు చేపడుతామని స్పష్టం చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, న్యూ డెమోక్రసీ, తెలంగాణ ఎమ్మార్పీఎస్, రైల్వే మజ్దూర్, ఎంప్లాయీస్ సంఘ్, రైల్వే ఎస్సీ ఎస్టీ, తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్ జేఏసీ, రైల్వే పెన్షనర్లు, వర్తక వాణిజ్య వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష, కాజీపేట జంక్షన్ పూర్వవైభవానికి పార్టీలకతీతంగా పోరాడాలని సూచించారు. కాంగ్రెస్ నాయకుడు జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసి గెలిచిన ఘనత దాస్యం వినయ్‌భాస్కర్‌కు ఉందని గుర్తుచేశారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, కాజీపేట రైల్వే జంక్షన్ అభివృద్ధి జరిగేందుకు మరోమారు వినయ్‌భాస్కర్ రాజీనామా చేస్తే పార్టీలకతీతంగా గెలిపిస్తామని అన్నారు. కార్పొరేటర్లు ఎలకంటి రాములు, సంకు నర్సింగరావు, జక్కుల రవీందర్‌యాదవ్, విజయశ్రీ, కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సుందర్రాజు, నార్లగిరి రమేశ్, కాటాపురం రాజు, సుంచు కృష్ణ, పాలడుగుల శివకుమార్, మర్యాల కృష్ణ, సిరిల్ లారెన్స్, సీపీఎం నాయకుడు చుక్కయ్య, సీపీఐ నాయకుడు మేకల రవి, న్యూ డెమోక్రసీ అప్పారావు, నల్లెల్ల రాజయ్య, భిక్షపతి, రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ అధ్యక్షుడు కాలువ శ్రీనివాస్, కెఎన్ రావు, వేద ప్రకాశ్, చింత మురళి, ఓం ప్రకాశ్, నాగేశ్ పాల్గొన్నారు.