హనుమకొండ, మార్చి 24 : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ మంగళవారం ఆశా కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, మానవహారా లు నిర్వహించారు. పెండింగ్లో ఉన్న జీతాలను తక్షణమే చెల్లించాలని, కనీస వేతనం రూ.18వేలు అమ లు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ప్రమాదవశా త్తు చనిపోతే రూ. 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, దహన సంస్కారాల ఖర్చుకు రూ.50వేల ఇవ్వాలని, పని ఒత్తిడి, మానసిక క్షోభను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇందులో భాగంగా బీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర కమిటీ పిలుపు మేర కు జిల్లా అధ్యక్షుడు నాయిని రవి ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఏకశిలా పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 15 రోజులుగా ఆశాలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
రెండున్నరేళ్లుగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, మూడు నెలల నుంచి వేతనాలివ్వకుండా ఆశాల చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే అసెంబ్లీ, మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తామని రవి హెచ్చరించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బండారి మంజుల, హనుమకొండ జిల్లా కమిటీ కార్యదర్శి కే ప్రేమలత, ఉపాధ్యక్షురాలు రాణిశ్రీ, లావణ్య, కృష్ణవేణి, టీ అరుణ, సుజాత, వనమాల పాల్గొన్నారు.