నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 30 : ఆందోళనలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అట్టుడికింది. ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిలింది. రెండున్నరేండ్లుగా ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై పలు వర్గాలు సోమవారం రోడ్డెక్కడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డిమాండ్ల సాధన కోసం నిరసన తెలిపేందుకు చలో అసెంబ్లీకి వెళ్తున్న తమను ఎక్కడిక్కడ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆశ వర్కర్లు ఆందోళనలు నిర్వహించారు.
ప్రధాన రహదారులపై రాస్తారోకోలతో పాటు పీహెచ్‌సీల ఎదుట ధర్నాలు నిర్వహించి స్థానిక వైద్యాధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. హైదరాబాద్‌కు వెళ్లకుండా అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు తమకు రూ. 18 వేల జీతం చెల్లించాలని, టార్గెట్లు ఎత్తివేయాలని, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా కల్పించాలని, చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆశ కార్యకర్తలు డిమాండ్ చేశారు. అలాగే తమ పెండింగ్ సమస్యలను ఏప్రిల్ 7లోగా ప్రభుత్వం, యాజమాన్యం పరిష్కరించని పక్షంలో నిరవధిక సమ్మెకు వెళ్తామని విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు హెచ్చరించారు.
తమ సమస్యల పరిషారం కోసం టీవీఏఈ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం ఉమ్మడి జిల్లాలోని ఆయా విద్యుత్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ సర్కార్ ఆర్టిజన్, అన్మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికులకు ఇచ్చిన హామీలను, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, అర్హత ఆధారంగా రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తమకు హామీ ఇచ్చిన మేరకు నెలకు రూ. 10 వేలు వేతనం చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేపట్టారు. మధ్యాహ్న భోజనానికి అవసరమైన గ్యాస్‌ను ఉచితంగా ఇవ్వాలని, గుర్తింపు కార్డులు అందజేయాలని, పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీని ప్రైవేటీకరించొద్దని డిమాండ్ చేస్తూ కార్మికులు హనుమకొండ బస్‌స్టేషన్, వరంగల్-2 డిపో ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ‘ఆర్టీసీ ప్రైవేటీకరణ భూతం నశించాలి, ఎలక్ట్రిక్ బస్సు డిపోలు ఉండొద్దని, ప్రైవేటు బస్సులు వద్దు.. ఆర్టీసీ బస్సులే ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాగా, తమ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని మాజీ సర్పంచ్‌లు, తమకిచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారులు అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న క్రమంలో వారిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.