జయశంకర్ భూపాలపల్లి, మే 9 (నమస్తే తెలంగాణ) : సమైక్య పాలన సంకెళ్లు తెంచుకుని ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో నాటి సీఎం గా కేసీఆర్ వైద్యం, విద్య, నీటి వనరులపై ప్రత్యేక దృష్టి సారించారు. కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం భూపాలపల్లిలోని కేటీపీపీలో ఏర్పాటు చేసిన సభలో 100 పడకల ఆస్పత్రిని మంజూరు చేశారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రజలకు సైతం సేవలందించేలా నిర్మాణం చేశారు. జిల్లా కేంద్రంలో దవాఖానతో పాటు టీ డయాగ్నొస్టిక్స్‌ను సైతం అందుబాటులోకి తీసుకురాగా ప్రైవేట్ హాస్పిటల్స్‌కు దీటుగా వైద్య సేవలందాయి.
ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో మళ్లీ సీన్ రివర్స్ అయింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. కనీసం ఆస్పత్రిలో తాగునీరు దొరకని పరిస్థితి దాపురించింది. మరుగుదొడ్ల కోసం మున్సిపాలిటీ వాటర్ ట్యాంకర్ల ద్వారా నిత్యం నీరు సరఫరా అవుతున్నదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అవగతమవుతుంది. వేసవి సమీపిస్తే తాగునీటి ఎద్దడి ప్రారంభమవుతుందని తెలిసినా అధికార యంత్రాంగం, ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ ప్లాన్ రూపొందించలేదు. ఇంత పెద్ద ఆస్పత్రిలో నీళ్లు దొరకక రోగులు, అటెండెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రభుత్వ పనితీరును ఎండగడుతున్నారు.

ముందుచూపు లేని సర్కారు
భూపాలపల్లిలోని మంజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన జిల్లా ప్రధాన వైద్యశాలలో కేసీఆర్ ముందు చూపుతో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. నిత్యం సుమారు 700 వరకు ఓపీ నమోదవుతున్నది. నెలకు సుమారు 100 నుంచి 150 డెలివరీలు, ఇతర జనరల్ సర్జరీలు జరుగుతున్నాయి. ఇంత పెద్ద ఆస్పత్రిని నీటి సమస్య పట్టి పీడిస్తున్నది. దవాఖానకు వచ్చే ఔట్ పేషెంట్లు, అడ్మిట్ అయిన వారు, అటెండెంట్లు గొంతు తడుపుకోవడానికి నీళ్ల బాటిల్లు కొనుక్కోవాల్సిందే. హాస్పిటల్లో ఎక్కడ చూసినా వాటర్ బాటిల్లే దర్శనమిస్తాయి.
గతంలో ఇక్కడ అన్నదానం చేసిన స్వచ్ఛంద సంస్థలు నీటి సమస్యతో నిలిపివేశాయి. ఇదిలా ఉండగా ఆస్పత్రిలో ఏ మరుగుదొడ్డి చూసినా నీళ్లు లేక కంపుకొడుతున్నాయి. మున్సిపల్ వాటర్ ట్యాంకర్లతో నీళ్లు తెప్పించి తాత్కాలికంగా శుభ్రం చేయించినా ఫలితం లేదు. మరుగుదొడ్లకు వెళ్లలేకపోతున్నట్లు రోగులు వాపోతున్నారు. పేషెంట్లు సైతం బహిర్భూమికి వాటర్ బాటిల్లు పట్టుకుని బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందంటే ప్రజా పాలన ఎలా ఉందో అవగతమవుతుంది. వేసవి వస్తే నీటికి ఇబ్బంది ఉంటుందని తెలిసీ అధికారులు, ప్రజాప్రతినిధులు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించడంలో విఫలమయ్యారని, హాస్పిటల్ ఆవరణలో అమృత్ 2.0 పథకం కింద నిర్మిస్తున్న ట్యాంకును ముందు చూపుతో త్వరితగతిన పూర్తి చేయిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని పలువురు వైద్యులు చెబుతున్నారు.
చాలా ఇబ్బందిగా ఉంది
కామెర్లతో నాలుగు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరాను. వార్డులో నీళ్లకు చాలా గోసైతాంది. తాగడానికి నీళ్లు లేవు. బాత్రూంలలో కూడా రావడం లేదు. రోజుకు ఒకసారి పొద్దున వచ్చి బాత్రూంలు కడిగి వెళ్తరు. బాత్రూంలలో నీళ్లు లేక వాటర్ బాటిల్ కొనుక్కొని వెళ్లాల్సి వస్తున్నది. లేదంటే బాటిల్ పట్టుకుని బయటకు పోవాలి. నీళ్లు లేక బాగా ఇబ్బంది అయితాంది.
– రామాచారి, ఒడితెల, చిట్యాల మండలం
నీళ్లు కొనుక్కుంటున్నాం..
నా మనుమరాలును డెలివరీకి తీసుకువచ్చాం. రోజూ అన్నం కొనుక్కొని తింటున్నాం. హాస్పిటల్లో నీళ్లుంటే అన్నం వండుకుని తినేవాళ్లం. అన్నం, నీళ్లు కొనుక్కుని తినడానికి చాలా ఖర్చవుతున్నది. మనుమరాలుతో పాటు ఇక్కడ ముగ్గురం ఉంటున్నం. రోజూ పది నుంచి పదిహేను లీటర్ల నీళ్లు కొనుక్కోవాల్సి వస్తున్నది. కనీసం బాత్రూంలలో కూడా నీళ్లు లేకపోవడంతో అన్ని అవసరాలకు కొనుక్కున్న నీరే దిక్కవుతున్నది. ఇంత పెద్ద దవాఖానలో ఇలాంటి పరిస్థితి రావడం దారుణం.
– కొయ్యల సమ్ము, సిరొంచ, మహారాష్ట్ర