వర్ధన్నపేట, నవంబర్ 10: అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే బీఆర్ఎస్ పార్టీ ఎజెండా అని పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని చెన్నారం, కాశగూడెం, కడారిగూడెం, రామోజీకుమ్మరిగూడెంతండా, చంద్రుతండా, రాంధాన్తండా, ఉప్పరపల్లిలో శుక్రవారం ఎన్నికల ప్రచారం, సభల ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యమ నేత కేసీఆర్ ప్రాణాలను పణంగా పెట్టి రాష్ర్టాన్ని సాధించారని అన్నారు. వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని పదేళ్లలో రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని తెలిపారు. రైతులు, కూలీలు, మైనార్టీలు, దళితులు, గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ ఇప్పుడిప్పుడే దారిలో పడుతున్నదని, దేశాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ చేతిలోకి వెళ్లనిస్తే మరోసారి తెలంగాణ ఇబ్బందుల్లో పడుతుందన్నారు. ప్రజలు ఆలోచించి కారు గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు. నియోజకవర్గంలో ఇప్పటికే సుమారు రూ.2,700 నిధులతో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. పదేళ్ల క్రితం నియోజకవర్గంలో అంతర్గత రోడ్లు, తాగునీరు, సాగునీరు, విద్యుత్ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. కానీ పదేళ్లలో సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేసినట్లు చెప్పారు.
గ్రామాల్లో ప్రచారం కోసం వెళ్లిన ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గ్రామానికి రాగానే ఎమ్మెల్యేకు మహిళలు పూలు చల్లి స్వాగతం పలికి కోలాటాలతో తీసుకువెళ్లారు. ప్రధాన కూడళ్ల వద్ద మహిళలతో కలిసి ఎమ్మెల్యే కూడా కోలాటం ఆడుతూ ఉత్సాహ పరిచారు. బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలికి ఎమ్మెల్యేకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మహిళలు మంగళహారుతులతో బొట్టుపెట్టి ఘన విజయం సాధించాలని దీవెనలు అందించారు. రామోజీకుమ్మరిగూడెం తండాలో గిరిజన మహిళల వద్దకు వెళ్లగా ఆశీర్వదించారు. కళాకారుల ఆటపాటలు, డప్పుచప్పుళ్లతో గ్రామాల్లో సందడి నెలకొంది. ప్రధాన కూడళ్ల వద్ద సభల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు.
మండలంలోని బండౌతాపురానికి చెందిన యువకులు శుక్రవారం ఎమ్మెల్యే అరూరి రమేశ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గురువారం పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కానీ బీఆర్ఎస్ ద్వారానే సరైన న్యాయం జరుగుతుందని గుర్తించిన 30 మంది యువకులు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో వారిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వలస వచ్చే నాయకుల మాటలు నమ్మి యువకులు మోసపోవద్దన్నారు. బీఆర్ఎస్ పార్టీ యువతను నిత్యం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్ లలితాయాదవ్, ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, ఆత్మ చైర్మన్ గోపాల్‌రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి పాల్గొన్నారు.