వరంగల్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం వరంగల్ మహానగరానికి రానున్నారు. పట్టణ ప్రగతి, మున్సిపాలిటీ, స్మార్ట్ సిటీ నిధులు రూ.27 కోట్లతో గ్రేటర్ పరిధిలో పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మరో రూ.150 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నర్సంపేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముగింపు వేడుకలకు హాజరై వేలాది మంది మహిళలకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాలు, అభయహస్తం చెక్కులను పంపిణీ చేస్తారు. ఈ మేరకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సాయంత్రం హనుమకొండలోని కుడా మైదానంలో వరంగల్, హనుమకొండ జిల్లాల టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, ప్రతినిధులతో సభ నిర్వహించనున్నారు. మంత్రి రామన్నకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, తోరణాలు ఏర్పాటు చేశారు.
రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం వరంగల్ మహానగరానికి రానున్నారు. పట్టణ ప్రగతి, మున్సిపాలిటీ, స్మార్ట్ సిటీ నిధులు రూ.27 కోట్లతో గ్రేటర్ పరిధిలో పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు మరో రూ.150 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేస్తారు. రూ.11.50 కోట్లతో అభివృద్ధి చేసిన పబ్లిక్ గార్డెన్స్, రూ.1.5 కోట్లతో ఆధునీకరించిన రీజినల్ లైబ్రరీని ప్రారంభిస్తారు. రూ.7కోట్లతో భద్రకాలీ ఆలయ ఆర్చి నుంచి జీడబ్ల్యూఎంసీ కార్యాలయం వరకు నిర్మించిన ఆర్4 రోడ్డును, మరో రూ.7కోట్లతో అలంకార్ దర్గా బ్రిడ్జ్ నుంచి స్మార్ట్ రోడ్ ఆర్3ని ప్రారంభిస్తారు. రూ.27 లక్షలతో కొనుగోలు చేసిన రెండు వైకుంఠ రథాలను, రూ.36 లక్షలతో కొనుగోలు చేసిన 66 ఫాగింగ్ మిషన్లను ఆవిష్కరిస్తారు.
150 కేఎల్డీ సామర్థ్యంతో రూ.8కోట్లతో ఏర్పాటు చేసే మానవ వ్యర్థాల నిర్వహణ ప్లాంటుకు, రూ.20.50 కోట్లతో కట్టే జీడబ్ల్యూఎంసీ పరిపాలనా భవనానికి, రూ.2 కోట్లతో కట్టే కౌన్సిల్ హాల్‌కు, విద్యుత్ నగర్లో రూ.2 కోట్లతో నిర్మించే దివ్యాంగుల శిక్షణ కేంద్రానికి, రూ.9కోట్లతో 37 ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల పనులకు శంకుస్థాపన చేస్తారు. రూ.1.50కోట్లతో పోతన వైకుంఠధామం అభివృద్ధికి, రూ.22 కోట్లతో నయాంనగర్ నుంచి ప్రెస్టీన్ సూల్ వరకు, రూ.2.50 కోట్లతో కాజీపేట నుంచి పెద్దమ్మగడ్డ వరకు ఆర్సీసీ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి, వరద ముప్పు నివారణ కోసం రిటైనింగ్ వాల్ ఏర్పాటు, రూ.15 కోట్లతో నాలాల మీద కల్వర్టుల నిర్మాణ పనులను ప్రారంభిస్తారు.
జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో రూ.71 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు, రూ.4 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు, కాకతీయ మ్యూజికల్ గార్డెన్లో రూ.70 లక్షలతో జాతీయ జెండా ఏర్పాటు పనులకు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోనే శంకుస్థాపన చేస్తారు. వరంగల్ అభివృద్ధికి కావాల్సిన ప్రతిపాదనలపై చర్చించేందుకు జీడబ్ల్యూఎంసీ, కుడాపై అధికారులతో సమీక్షించనున్నారు.
ప్రతినిధుల సభ
తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ను తీర్చిదిద్దడం లక్ష్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనలో కీలకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో కేటీఆర్ వరంగల్ పర్యటనలో భాగంగా వరంగల్, హనుమకొండ జిల్లాల పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారు. హనుమకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్ (కుడా మైదానం)లో ఈ మేరకు బుధవారం సాయంత్రం సభ నిర్వహిస్తున్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాల నుంచి 20 వేల మంది సభకు హాజరు కానున్నారు. మంత్రి ఎర్రబెల్లి పర్యవేక్షణలో టీఆర్ఎస్ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు దాస్యం వినయ్‌భాస్కర్, అరూరి రమేశ్ ఆధ్వర్యంలో సభ ఏర్పాట్లు చేశారు.
నర్సంపేటలో పర్యటన
మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి కేటీఆర్ నర్సంపేటకు చేరుకుంటారు. నేరుగా మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్లి అర్బన్ మిషన్ భగీరథ పైపులైన్, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ పనులకు శంకుస్థాపన చేస్తారు. మెప్మా, లైబ్రరీ భవనాలు, చెన్నారావుపేట, దుగ్గొండి మండలాల మహిళా సమాఖ్య భవనాలను ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవ, శంకుస్థాపన శిలాఫలకాలు మున్సిపల్ కార్యాలయంలోనే ఏర్పాటు చేశారు. అశోక్‌నగర్ వద్ద పీఎన్జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్)ను ప్రారంభిస్తారు. అనంతరం నర్సంపేట బైపాస్‌రోడ్డులో మార్ ఫంక్షన్‌హాల్ ఎదుట అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముగింపు వేడుకల సభలో పాల్గొంటారు. బ్యాంకు లింకేజీ కింద 1,281 మహిళా సంఘాలకు రూ.72.56 కోట్ల రుణాలను అందిస్తారు. స్త్రీనిధి ద్వారా 205 మహిళా సంఘాలకు రూ.20.15 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తారు. గతంలో అభయహస్తం కోసం డబ్బు చెల్లించిన 39,278మంది మహిళలకు రూ.12.29కోట్ల చెక్కులు అందిస్తారు.
దారులన్నీ గులాబీమయం
చారిత్రక ఓరుగల్లుతో పాటు, నర్సంపేటలోని దారులన్నీ గులాబీమయమయ్యాయి. మంత్రి కేటీఆర్‌కు గ్రాండ్ వెల్కం చె ప్పేందుకు గులాబీ తోరణాలతో నిండిపోయాయి. బల్దియా ఆవరణ గులాబీ జెండాలతో కళకళలాడుతోంది. నగర ప్రధాన జంక్షన్లు అందంగా ముస్తాబయ్యాయి. కాజీపేట నుంచి ఎంజీఎం సెంటర్ వరకు, కుడా మైదానంలో స్వాగత తోరణాలు, టీఆర్ఎస్ జెండాలు, భారీ కటౌట్లు వెలిశాయి. నగరంతో పాటు నర్సంపేటలో కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు శ్రేణులు సిద్ధమయ్యారు.
పరిశీలించిన మంత్రులు
కార్పొరేషన్ కార్యాలయంతో పాటు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసే ప్రాంతాలను మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, చీఫ్ విప్ దాస్యం, ఎమ్మెల్సీలు కడియం, పోచంపల్లి, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, కుడా చైర్మన్ సుందర్రాజ్, కలెక్టర్ గోపి, పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషీ, కమిషనర్ ప్రావీణ్య తదితరులు పరిశీలించారు. అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు. నర్సంపేటలోని గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మె ల్యే పెద్ది, ఎమ్మెల్సీలు, కలెక్టర్ పరిశీలించారు.