వరంగల్, జూలై 16(నమస్తేతెలంగాణ): రాష్ట్ర సర్కారు వ్యవసాయానికి అందిస్తున్న 24 ఉచిత కరెంటుపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను బట్టబయలు చేసేలా రైతులతో సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. రాష్ట్రంలో 95శాతం ఉన్న రైతులకు రోజుకు కేవలం 3గంటల కరెంటే సరిపోతుందంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి తీరును ఎండగట్టేలా రైతుసభలు జరిపేందుకు ప్లాన్ చేసింది. సోమవారం నుంచి పది రోజులపాటు రైతు వేదికల వద్ద, సుమారు వెయ్యిమంది రైతులకు తగ్గకుండా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే ఉచిత విద్యుత్‌ను రద్దు చేస్తుందన్న నిజాన్ని ఈ సమావేశాల ద్వారా బీఆర్ఎస్ శ్రేణులు జనంలోకి తీసుకెళ్లనున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న ‘మూడు పంటలు కావాలా? కాంగ్రెస్ పార్టీ ‘మూడు గంటల కరెంటు కావాలా?’ అన్న నినాదంతో ముందుకెళ్లనున్నారు. రాంపూర్-మేడపల్లి, నల్లబెల్లి, దుగ్గొండిలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, వరంగల్ ఆరెపల్లిలో సమావేశానికి ఎమ్మెల్యే అరూరి రమేశ్ హాజరుకానున్నారు.
వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు అవసరం లేదన్న టీపీసీసీ అధ్యక్షుడు c వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం నుంచి పది రోజులపాటు రైతు వేదికల వద్ద అన్నదాతలతో సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ మేరకు ఆయా శాసనసభ నియోజకవర్గం పరిధిలో పార్టీ స్థానిక నాయకత్వం షెడ్యూల్ రూపొందించింది. ప్రతి రైతు వేదిక వద్ద కనీసం వెయ్యి మంది రైతులకు తగ్గకుండా సమావేశం జరిపేందుకు నిర్ణయించింది. రాష్ట్రంలోని 95 శాతం మంది రైతులకు మూడు గంటల విద్యుత్ సరఫరా చాలని, ఉచిత విద్యుత్ అవసరం లేదని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు నేటి నుంచి పది రోజులపాటు రైతు వేదికల వద్ద రైతులతో సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు శనివారం తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు వేదికల వద్ద రైతులతో సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. ఆయా నియోజకవర్గంలో ప్రతి రైతు వేదిక వద్ద రైతులతో సమావేశం నిర్వహణ బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే తీసుకుంటున్నారు. ఈ మేరకు రైతులతో రైతు వేదికల వద్ద సమావేశాల ఏర్పాట్లపై ఎమ్మెల్యేలు తమ పార్టీ శ్రేణులతో మాట్లాడి ప్రణాళిక తయారు చేశారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే ఉచిత విద్యుత్‌ను రద్దు చేస్తుందన్న సత్యాన్ని ఈ సమావేశాల ద్వారా బీఆర్ఎస్ శ్రేణులు ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్తారు.
రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ..
ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న మూడు పంటలు కావాలా? కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటు కావాలా? అన్న నినాదంతో కదం తొక్కుతారు. రేవంత్‌రెడ్డి ప్రకటనపై ప్రతి గ్రామం, రైతు ఇంట్లో చర్చ జరిగేలా ముందుకువెళ్తారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ప్రతి రైతు వేదిక వద్ద జరిగే సమావేశంలో తీర్మానం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతోపాటు కాంగ్రెస్ పాలనలో ఎదుర్కొన్న కరెంటు కష్టాలు, బీఆర్ఎస్ పాలనలోని కరెంటు వెలుగులను రైతులకు వివరిస్తారు. కాంగ్రెస్ కటిక చీకటి కావాలా? రైతు జీవితాల్లో కరెంటు వెలుగులు నింపిన బీఆర్ఎస్ కావాలా? తెలుసుకోవాలని రైతులను కోరుతారు. షెడ్యూల్ ప్రకారం రైతు వేదికల వద్ద రైతులతో సమావేశాల నిర్వహణపై ఎమ్మెల్యేలు ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులకు సూచనలు చేశారు. నిరసన కార్యక్రమంలో భాగంగా తొలిరోజు సోమవారం నల్లబెల్లి మండలంలోని రాంపూర్-మేడపల్లి, నల్లబెల్లి, దుగ్గొండి మండలకేంద్రాల్లోని రైతు వేదికల వద్ద రైతులతో సమావేశాలు నిర్వహించేందుకు పార్టీ నేతలు నిర్ణయించారు. ఉదయం 9 గంటలకు రాంపూర్-మేడపల్లి, 10 గంటలకు నల్లబెల్లి, 10.30 గంటలకు దుగ్గొండి రైతు వేదిక వద్ద జరిగే ఈ సమావేశాల్లో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొంటారని ప్రకటించారు. ప్రతి రైతు వేదిక వద్ద కనీసం వెయ్యి మంది రైతులకు తగ్గకుండా సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఆయా రైతు వేదికల పరిధిలోని గ్రామాల రైతులు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక ఆలోచనలను ఎండగట్టేలా నినాదాలతో వాల్ రైటింగ్ వేయించాలని, ప్రతి మండలకేంద్రంలో హోర్డింగ్‌లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పెద్ది బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
రైతు కష్టాలను కళ్లకు కట్టేలా చూపించాలి
కాంగ్రెస్ పాలనలోని రైతు కష్టాలను కళ్లకు కట్టేలా ఉన్న ఫొటోలను ప్రత్యేకంగా ఉపయోగించాలని ఎమ్మెల్యే పెద్ది సూచించారు. వరంగల్ 3వ డివిజన్లోని కొత్తపేట రైతు వేదిక వద్ద నేడు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించేందుకు బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేశారు. జీడబ్ల్యూఎంసీకి చెందిన 3, 14 డివిజన్ల పరిధిలోని ఆరెపల్లి, పైడిపల్లి, కొత్తపేట, ఎనుమాముల తదితర గ్రామాల రైతులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని రైతు వేదికల వద్ద రైతులతో సమావేశాల నిర్వహణపై ఎమ్మెల్యే అరూరి తమ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పది రోజులపాటు రైతు వేదికల వద్ద రైతులతో సమావేశాలు నిర్వహించి గతంలో వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబు ఆలోచనలను ఆయన శిష్యుడైన రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్నారనేది అన్నదాతల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కదులుతున్నారు.