పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ముష్కరమూకలను తుదముట్టించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మంగళవారం అర్ధరాత్రి వ్యూహాత్మకంగా మెరుపుదాడులతో పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి విజయవంతంగా ఆపరేషన్ పూర్తిచేయడంపై ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ బలగాలను యావత్ ప్రజానీకం అభినందనలతో ముంచెత్తుతోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనల మధ్య పాక్‌పై ప్రతీకార దాడికి చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై ఉమ్మడి జిల్లా ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బుధవారం పలుచోట్ల వివిధ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ తీసి దేశభక్తి చాటుకున్న ప్రజలు ఉగ్రదాడులకు తెగబడిన వారిని దెబ్బకు దెబ్బకొట్టాల్సిందేనని, పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ముక్తకంఠంతో నినదించారు.
– హనుమకొండ చౌరస్తా, మే 7
జాతీయ జెండాలతో మద్దతు ప్రదర్శన..
పాకిస్థాన్ ఉగ్ర సంస్థలపై భారత సైనికులు చేస్తున్న యుద్ధానికి మద్దతుగా ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో జాతీయ జెండాల ప్రదర్శన నిర్వహించి దేశం కోసం అవసరమైతే యుద్ధంలో పాల్గొనడానికి కూడా సిద్ధమని ప్రకటించింది. కార్యక్రమంలో డాక్టర్ రాజమౌళి, డాక్టర్ ప్రీతిదయాళ్, ఎర్త్ ఫౌండేషన్ డైరెక్టర్ మంగళంపల్లి రాజు, ముద్రబోయిన రాజు, ఆంజనేయులు, నల్ల రాహుల్ పాల్గొన్నారు.
ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే శాంతి సామరస్యాలు
ఉగ్రవాదం, ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా.. ఏ దేశంలో ఉన్నా.. ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేదే. కచ్చితంగా ఉగ్రవాదం అంతం కావాల్సిందే. ఈ విషయంలో పాజిటివ్‌గా ఆలోచించే ప్రపంచ శక్తులన్నీ ఏకం కావాలి. అప్పుడు శాంతి సామరస్యాలు నెలకొంటాయి. భారత సైన్యం ఎంత వీరోచితంగా దాడులు చేసిందో.. అంతే అప్రమత్తంగా ఉండి దేశరక్షణలో మేమెవరికీ తీసిపోమున్నట్లుగా వారికి శక్తి సామర్థ్యాలుండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా.
– చల్లా వెంకటేశ్వర్‌రెడ్ది, హనుమాన్‌నగర్, హనుమకొండ
ఉకుపాదంతో అణచివేయాలి
ఉగ్రవాదాన్ని ఉకుపాదంతో అణచివేయాలి. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిందే. భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాఠవానికి ఒక భారతీయుడుగా నేను గర్వపడుతున్నా. భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శం కావాలి. పహల్గాం ఉగ్రదాడి చాలా బాధాకరం. పాక్‌పై ప్రతీకార చర్య తీసుకోవాలి. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించి ముష్కరులను హతం చేయడం ఆనందంగా ఉంది.
– గడ్డం అనిల్, ఆర్మీ జవాన్
ప్రతి పౌరుడు సైనికుడిలా ముందుకుసాగాలి
టెర్రరిజాన్ని అంతం చేసేందుకు తలపెట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రపంచ దేశాలు మద్దతు పలుకుతున్నాయి. ఈ యుద్ధం ఎప్పటికీ ఆగదు. ప్రతి పౌరుడు ఒక సైనికుడిల్లా ముందుకురావాలి. మాక్‌డ్రిల్‌ను అనుసరించి ప్రతిఒక్కరూ ఉండాలి. 9 స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడి చేసింది. పాకిస్తాన్‌కు ఇప్పటికే వణుకు పుట్టింది. పాక్‌పై యుద్ధం చిన్నపిచ్చుకపై బ్రహ్మాస్త్రం. ప్రతిఒక్క పౌరుడు సైనికుడిలా ముందుకుసాగాలి. సమయం వస్తే నేను కూడా మళ్లీ యుద్ధానికి వస్తా. ఉగ్రవాదుల సంస్థలను అంతమొందించాలి.
– కావటి భిక్షపతి, రిటైర్డ్ ఆర్మీ అధికారి
సర్జికల్ ైస్టెక్ తరహాలో భారత ప్రతీకార దాడి
ఉగ్రవాదంపై భారత్ చూపించిన అసలైన శక్తి ఇది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్ తరహాలో భారత సైన్యం జరిగిన ప్రతీకార దాడులకు భారతీయుడుగా గర్విస్తున్నాం. ఉగ్రమూకలను తొలగిస్తూ మహిళల ఆత్మగౌరవం కోసం చేస్తున్న న్యాయపూర్వక చర్యలు ఇవి. ఇది యుద్ధం మాత్రమే కాదు. ఇది మానవత్వం కోసం పోరాటం. దేశ రక్షణ కోసం కట్టుబడి ఉన్న ప్రతి వీరుడికి అభినందనీయం.
– డాక్టర్ కంజర్ల మనోజ్ కుమార్, బీఆర్ఎస్ 4వ డివిజన్ అధ్యక్షుడు
పాకిస్థాన్‌తో యుద్ధానికి సై
జనగామ, మే 7 (నమస్తే తెలంగాణ) : పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సి వస్తే భారత సైన్యం ఎప్పుడు పిలిచినా తామంతా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని విశ్రాంత సైనికుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల భిక్షపతి స్పష్టం చేశారు. బుధవారం ఆయుష్మాన్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన పాశవిక చర్యకు ప్రతీకారంగా 9 ఉగ్ర స్థావరాలపై దాడిచేసి మట్టుపెట్టిన భారత వీర సైన్యానికి విజయకేతనం తెలుపుతూ వారికి సంఘీభావంగా ప్రతి భారతీయుడు నిలబడాల్సిన సమయం వచ్చిందన్నారు.
దేశ సౌభ్రాతృత్వం, రక్షణకు అండగా నిలబడాలనేది మన కర్తవ్యంగా భావించాలని.. భారత సైన్యం ఏ పరిస్థితిలోనైనా తమ అవసరం ఉందని భావిస్తే తామంతా వెళ్లేందుకు ఒక బ్యాగ్ ఇప్ప టికే సిద్ధం చేసి పెట్టుకున్నామని స్పష్టం చేశారు. పర్యాటకులను అమానుషంగా కాల్చి చంపి కొంతమంది మహిళల సిందూరాన్ని దూరం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి తగిన బుద్ధి చెప్పాలని ఉద్దేశంతో కేవలం 15 రోజుల్లోనే ఆపరేషన్ సిందూర్ పేరుతో సామాన్య పౌరులకు ఎలాంటి అపాయం లేకుండా కేవలం ఉగ్ర సంస్థలనే గురిచూసి స్థావరాలను ధ్వంసం చేసి న భారత సైన్యానికి అభినందనలు తెలిపారు. ఉద్వేగభరితమైన రోజును పురస్కరించుకొని ప్రతి ఒకరూ సంబురంగా పండుగలాగా జరుపుకోవాలని కోరారు. అనంతరం సాయంత్రం ఆర్టీసీ చౌరస్తా వద్ద మాజీ సైనికుల ఆధ్వర్యంలో పటాకులు కాల్చి, స్వీట్లు పంచి విజయోత్సవ సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో ఆయుష్మాన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ జైన రమేశ్, విశ్రాంత సైనికుల జిల్లా సమాఖ్య అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, కోశాధికారి యూసుఫ్, విశ్రాంత సైనికులు కుమార్ యాదవ్, వెంకన్న, ప్రభాకర్, డాక్టర్ గౌతమ్‌రెడ్డి, బద్రీనాథ్, రాజేశ్ పాల్గొన్నారు.