కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా స్వీకరించిన ప్రజా పాలన దరఖాస్తులు మూలకు పడ్డాయి. సర్కారు నిర్వాకంతో వాటిని ఆన్లైన్ చేయకుండానే అధికారులు పక్కకు పడేశారు. నమోదుకు కొద్ది రోజుల సమయమే ఇవ్వడంతో పూర్తిస్థాయిలో ఆన్లైన్ చేయలేకపోయారు. దీంతో మిగిలిన దరఖాస్తులను కట్టలు కట్టి కార్యాలయాల్లోని గదుల్లో నిల్వ చేశారు. ప్రస్తుతం నాలుగు పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం జరుగుతున్న సర్వే జాబితాల్లో పేర్లు లేక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, సిబ్బందిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. వారు సమర్పించిన దరఖాస్తుల జిరాక్స్ కాపీలను చూపుతూ ప్రశ్నిస్తున్నారు. తమ పేర్లు ఎందుకు జాబితాలో లేవంటూ ప్రశ్నిస్తున్నారు.
– వరంగల్, జనవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, జనవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన ప్రజా పాలన అభాసుపాలవుతున్నది. 6 గ్యారెంటీల అమలు కోసం దరఖాస్తులు చేసుకున్న వారి ఆశ నిరాశగానే మిగులుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ నమోదుకు అవకాశం లేకుండా చేసింది. 2024 జనవరి 6 వర కు దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియ గా, ఆ పిదప 10 రోజుల పాటు ఆన్లైన్లో నమోదు చేశారు. అప్పటి నుంచి కొత్తగా వచ్చిన ఏ దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేయలేదు. గతంలో స్వీకరించిన వాటినే పక్కన పెట్టిన రాష్ట్ర ప్రభు త్వం మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ నమోదును నిలిపివేసిన తర్వాత పేదలు ఇచ్చిన ప్రజా పాలన దరఖాస్తులను అధికార యం త్రాంగం పట్టించుకోలేదు. ఒక్క గ్రేటర్ వరంగల్లోనే 15 వేల వరకు దరఖాస్తులను ఆన్లైన్ చేయకుండా పక్కకు పడేశారు. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలు, ఎంపీడీవో ఆఫీసుల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశాలు ఇచ్చింది. ఆన్లైన్లో నమోదు చేయకుండా తమ దరఖాస్తులను ఎలా పరిశీలిస్తారని, లబ్ధిదారులుగా ఎలా గుర్తిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కనిపించని అర్హుల పేర్లు
జనవరి 26 నుంచి నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అర్హుల గుర్తింపు కోసం అధికార యంత్రాంగం ఇం టింటి సర్వే చేస్తున్నది. ఇప్పటికే దరఖాస్తు చేసిన వా రి పేర్లతో అధికారులు సర్వే కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి కొత్తగా వేల కొద్ది దరఖాస్తులు వస్తున్నాయి. పేదలు ముందుగా ఇచ్చిన దరఖాస్తులను పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిం ది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజల నుంచి 10 రోజులపాటు దరఖాస్తులు స్వీకరించారు. ఒక్క గ్రేటర్ వరంగల్ పరిధిలోనే రెండు లక్షల అర్జీలు వచ్చాయి. కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల కోసమే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని ఆన్లైన్లో నమోదు చేయడానికి ప్రభుత్వం తక్కువ సమయం కేటాయించింది. దీంతో ఆన్లైన్ చేసేందుకు ఉన్నతాధికారులు దరఖాస్తులను ఆఫీసు సిబ్బందితోపాటు వి ద్యార్థులకు అప్పగించగా, నమోదు మొత్తం తప్పుల తడకగా మారింది.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వే జాబితాలో అర్హుల పేర్లు కనిపించడంలేదు. ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నామ ని, జాబితాలో పేర్లు లేవని అధికారులు చెబుతున్నారని పేదలు వాపోతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలున్నాయని చెబుతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తులను తప్పుగా నమోదు చేయడం మూలంగా నే జాబితాలో వేల మంది పేర్లు లేవని అంటున్నారు. కొన్ని అర్జీలను అసలు ఆన్లైన్లోనే నమోదు చేయలేదని తాజాగా తెలుస్తున్నది. సర్వే జాబితాతో ఇంటింటికి వెళ్తున్న అధికారుల వద్దకు కొందరు దరఖాస్తుదారులు వచ్చి తమ సంగతి ఏంటని అడుతున్నారు. అధికారులు పరిశీలిస్తే సర్వే జాబితాలో వారి పేర్లు ఉండడంలేదు. దరఖాస్తుల జిరాక్స్ కాపీలను అధికారులకు చూపిస్తూ తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.