హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 30 : మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా పర్యవేక్షణ కమిటీ ఆమోదంతో లైసెన్స్ పొందిన ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల సంరక్షణ కేంద్రాలలో 2025-2026 విద్యా సంవత్సరానికిగాను ఉచిత విద్య, వసతి సౌకర్యాలను పొందేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి జె.జయంతి తెలిపారు. తల్లితండ్రులను కోల్పోయి సంరక్షకుల వద్ద ఆశ్రయం పొందుతున్న బాల, బాలికలకు మొదటి ప్రాధాన్యత కల్పించనున్నట్లు, తల్లిని లేదా తండ్రిని కోల్పోయిన బాల, బాలికలకు ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు ఉచిత విద్య, వసతి కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రవేశాలు పొందేవారు హనుమకొండ జిల్లాకు చెందిన వారు మాత్రమే అర్హులని, బాలికల కోసం జిల్లాలోని ప్రభుత్వ బాలికల సదనం, రీచ్, బేతెల్, కేర్ అండ్ షెల్టర్ కేంద్రాలు, బాలుర కోసం ఓయాసిస్ చారిటబుల్ ట్రస్ట్, సాయి సేవా ట్రస్ట్, లేట్ భోగవెల్లి రాజేశ్వర్ రావు మెమోరియల్ ట్రస్ట్, మల్లికాంబ మనోవికాస కేంద్రం, స్పందన కేంద్రం, ప్రత్యేక అవసరాలు కలిగిన బాల, బాలికల కోసం కరుణాలయం, అసుంతా ఆశా నిలయం, డివైన్ మెర్సీ కేంద్రాలలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఇనిస్టిట్యూషనల్ కేర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎం.మౌనిక 95536 36900, జిల్లా బాలల పరిరక్షణ ఇన్చార్జి అధికారి ఎస్.ప్రవీణ్‌కుమార్ 98661 98112 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.