గీసుగొండ, ఏప్రిల్ 8: కేసీఆర్ కృషి ఫలించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కిటెక్స్ పరిశ్రమ చైర్మన్, ప్రతినిధులను ఒప్పించి వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని మెగా టెక్స్టైల్ పార్కులో పరిశ్రమను ఏర్పాటు చేయించి, వారితో ఎంవోయూ చేసుకుంది. దీంతో ఆప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కిటెక్స్ కంపెనీ త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతుండడంతో పస్త్ర పరిశ్రమలో మెకానిక్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీర్స్‌తో పాటు వివిధ హోదాల్లో పనిచేయడానికి సిబ్బంది కావాలని కంపెనీ ప్రకటన జారీ చేసింది.
దీంతో మంగళవారం వరంగల్ జిల్లాలోని వివిధ మండలాల నుంచి నిరుద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చి దరఖాస్తులు చేసుకున్నారు. వారి అర్హతను బట్టి అర్జీలు స్వీకరించారు. 150 మంది అభ్యర్థులు దరఖాస్తులు పెట్టుకున్నట్లు కంపెనీ ప్రతినిధి మనోజ్‌కుమార్ తెలిపారు. కంపెనీలో ఉద్యోగాల ఖాళీలతో పాటు పూర్తి వివరాలను కిటెక్స్ వస్త్ర పరిశ్రమల వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.