కరీమాబాద్/ నయీంనగర్, ఫిబ్రవరి 22 : బంధువుల సందడితో కోలాహలంగా ఉండాల్సిన ఆ ఇల్లు.. విషాదంతో బోసిపోయింది. తెల్లారితే తమ కూతురు పెండ్లి అని సంబురపడిన తల్లిదండ్రులను కొడుకు మరణవార్త కుంగదీసింది. చెల్లి పెళ్లిలో అన్నీ తానై ఉంటాడనుకున్న అన్న ఆ వేడుక చూడకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి తీరని దుఃఖం మిగిల్చింది. ఈ సంఘటన ఓఆర్ఆర్పై రెడ్డిపురం వద్ద శనివారం తెల్లవారుజామున జరిగింది. వివరాలిలా ఉన్నాయి. వరంగల్ కరీమాబాద్ ఉర్సు ప్రాంతానికి చెందిన ఎర్ర కృష్ణ-ఉమ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
చిన్న కుమారుడు అఖిల్(24), పెద్దపల్లి జిల్లా రామగిరి మండలానికి చెందిన గడ్డం చైతన్య(24) కలిసి తమ స్నేహితుడి ఇంట్లో వివాహానికి బైక్‌పై వెళ్లారు. ఆరెపల్లి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో రెడ్డిపురం వద్ద కారు ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. ఘటనకు కారణమైన నిందితుడు అజిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కారును సీజ్ చేసినట్లు సీఐ రవికుమార్ తెలిపారు. రాత్రి మిత్రుడి ఇంట్లో శుభాకార్యానికి వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా రావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అఖిల్ మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు.