హనుమకొండ, జూలై 23 : దివ్యాంగులు ఆత్మగౌరవంతో, ఒకరిపై ఆధారపడకుండా బతకాలనే గొప్ప ఆలోచనతో తెలంగాణ ఏర్పడగానే సీఎం కేసీఆర్ రూ.500 ఉన్న పింఛన్‌ను రూ.1500లు చేశారు. రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా రూ.3016కు పెంచారు. ఇప్పుడు మరో వెయ్యి పెంచి ముఖ్యమంత్రి దయాగుణం చాటుకున్నారు. ఈ నెల నుంచే రూ.4016 ఇవ్వనున్నట్లు రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హనుమకొండ జిల్లాలో 14,153 మందికి లబ్ధి చేకూరనుండగా, దివ్యాంగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పెన్షన్ పెంచి మనోధైర్యం కల్పించారని, అసహాయులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లావ్యాప్తంగా సంబురాలు జరుపుకొంటూ సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు.
రాష్ట్ర సర్కారు దివ్యాంగులకు శుభవార్త అందించింది. అసహాయులపై సీఎం కేసీఆర్ ఔదార్యం చాటుకున్నారు. ఇప్పుడు ఇస్తున్న పింఛన్‌కు మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ శుక్రవారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంచిర్యాలలో జరిగిన సభలో ప్రకటించారు. దీంతో దివ్యాంగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఇస్తున్న రూ. 3016కు పెంచిన వెయ్యి రూపాయలతో కలిపి జూలై నుంచి రూ. 4016ల పింఛన్ ఇవ్వనున్నారు. పెంచిన ఫింఛన్ ఈ నెల నుంచి అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్ర పటాలకు పాలాభిషేకాలు చేశారు. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దివ్యాంగులకు చేయూతనిస్తున్నది.
దివ్యాంగులు సమాజంలో ఆత్మ గౌరవంతో జీవనం సాగించేలా అండగా నిలుస్తున్నది. అర్హులందరికీ లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నది. చిన్నారుల నుంచి వృద్ధుల అవసరానికి అనుగుణంగా యంత్రాలు, యంత్ర పరికరాలు, వాహనాలు, వినికిడి యంత్రాలు, ట్రై సైకిళ్లు, వీల్చైర్లు అందజేస్తున్నది. అలాగే ప్రతి నెల ఠంచన్‌గా పింఛన్ ఇస్తూ వారికి భరోసా కల్పిస్తున్నది. తద్వారా దివ్యాంగుల్లో మనో ధైర్యం పెరిగింది. గ్రూపులుగా ఏర్పడిన వారు డీఆర్డీఏ ద్వారా రుణం పొందుతున్నారు. అలాగే ఆసక్తి ఉన్న పనుల్లో ఉపాధి పొందేలా అవకాశాలు కల్పిస్తున్నారు. స్వయం ఉపాధితో కుటుంబాలను పోషించుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఉన్నత చదువులు చదివిన దివ్యాంగులకు ఉద్యోగాల్లో చేరేందుకు, అలాగే రైళ్లు, బస్సుల్లో ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నారు. దివ్యాంగులను వివాహం చేసుకున్న వారికి ప్రభుత్వం లక్ష రూపాయాలు ప్రోత్సాహకం ఇస్తున్నది.
జిల్లాలో 14,153 మందికి లబ్ధి
జిల్లాలోని 14, 153 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనున్నది. డీఆర్డీఏ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూరు మండలంలో 722 మంది, భీమదేవరపల్లిలో 1,081 మంది, దామెరలో 474 మంది, ధర్మసాగర్లో 824 మంది, ఎల్కతుర్తిలో 1,196 మంది, హసన్‌పర్తిలో 441 మంది, ఐనవోలులో 836 మంది, కమలాపూర్‌లో 1,725 మంది, నడికూడలో 743 మంది, పరకాల మున్సిపాలిటీలో 563మంది, పరకాలలో 431మంది, శాయంపేటలో 780 మంది, వేలేరులో 464 మంది, గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీలో 3,873 మంది దివ్యాంగులు ఉన్నారు.
అధిక పింఛన్ ఇస్తున్న రాష్ట్రం…
దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు అత్యధికంగా పింఛన్ ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. స్వరాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ దివ్యాంగుల పింఛన్‌ను రూ. 500ల నుంచి ఏకంగా రూ. 1500లకు పెంచారు. రెండోసారి అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం పింఛన్‌ను రెండంతలు పెంచి ప్రతి నెలా రూ. 3016లు అందించారు. తాజాగా మరో వెయ్యి రూపాయలు పెంచింది. రూ. 4,016లు అందించనున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హనుమకొండ జిల్లాలో 14,153 మందికి లబ్ధి చేకూరనున్నది. జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసారు.
ఇప్పటి వరకు లబ్ధి పొందిన వారి వివరాలు
అధికారులు తెలిపిన గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా సుమారు 1,547 మంది లబ్ధి పొందారు. అందులో ఆర్థిక పునరావాసం (ఈఆర్ఎస్) పథకం ద్వారా 72 మంది లబ్ధిదారులకు రూ. 52లక్షలు అందించారు. అలాగే 108 మందికి ట్రై సైకిళ్లు, 34 మందికి బ్యాటరీ వీల్ చైర్లు, 210 మందికి వీల్ చైర్లు, 425 మందికి వినికిడి యంత్రాలు, 527 మందికి క్లచెస్, 41 మందికి ల్యాప్‌ట్యాప్‌లు, 32 మందికి స్మార్ట్ఫోన్లు, 36 మోటర్ వెహికిల్స్‌తో పాటు 62 మందికి వివాహ ప్రోత్సాహం కింద ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ. 62లక్షలు వారి అకౌంట్లలో జమ చేసినట్లు అధికారులు తెలిపారు.
దివ్యాంగులకు కొండంత అండ సీఎం కేసీఆర్..
దివ్యాంగులకు సీఎం కేసీఆర్ కొండంత అండగా నిలుస్తున్నారు. స్వరాష్ట్రం ఏర్పాటు అనంతరం ఇప్పటికే రెండోసారి పింఛన్‌ను పెంచిన సీఎం కేసీఆర్ తాజాగా అదనంగా మరో వెయ్యి రూపాయలు పెంచి ఈ నెల నుంచి అమలు చేసేందుకు జీవో జారీ చేయడం అభినందనీయం. దివ్యాంగులకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ ఆర్థిక భరోసాను కల్పించారు. సమాజంలో వారు ఆత్మ విశ్వాసంతో జీవించడానికి రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. దివ్యాంగులకు రూ. 4016 పింఛన్ అందించడం హర్షణీయం. సీఎం కేసీఆర్ మానవీయ పాలనకు ఇదో నిదర్శనం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగుల అవసరాలు తెలుసుకొని ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. అంతేకాక దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా అనేక సహాయ ఉపకరణాలు ఉచితంగా అందిస్తూ దివ్యాంగుల కోసం రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నరు. అలాగే దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
– డాక్టర్ లింగుదారి రాజేశ్వర్‌రావు, దివ్యాంగుల మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యుడు