గీసుగొండ/ పరకాల, మార్చి 17 : కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మరో ముందడుగు పడిందని, త్వరలోనే కైటెక్స్ కంపెనీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు జరుగుతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లో కైటెక్స్ కంపెనీ ఎండీ కైటెక్స్ సబు, వైస్ ప్రెసిడెంట్ సోదితో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే ఉద్యోగాల కల్పనకు మంత్రి కేటీఆర్ నిబద్ధతతో పని చేస్తున్నారని తెలిపారు. కేటీఆర్ కృషితోనే ప్రపంచ దేశాల్లో పేరుగాంచిన పెద్ద పెద్ద కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని వివరించారు. నియోజకవర్గంలో నెలకొల్సిన మెగా టెక్స్టైల్ పార్కులో ఇప్పటికే కొన్ని కంపెనీలను ఏర్పాటు చేసుకోగా.. మరికొన్ని రోజుల్లో ప్రతిష్టాత్మకమైన కైటెక్స్ కంపెనీ నిర్మాణ పనులను ప్రారంభిస్తుందని ఆయన వివరించారు. కంపెనీ ఏర్పాటుతో నియోజకవర్గంలోని మహిళలు, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ సహకారంతోనే కంపెనీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, కంపెనీ ఏర్పాటుకు కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కైటెక్స్ కంపెనీ ఆధ్వర్యంలో త్వరలోనే సంగెం, పరకాల మండలాల్లో ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, మే నెల నుంచి శిక్షణ కేంద్రాల్లో తరగతులను ప్రారంభించనున్నట్లు వివరించారు. చెవిటి, మూగ వారితోపాటు వితంతువులకు మొదటి ప్రాధాన్యం ఉంటుందని ఎమ్మెల్యే చల్లా చెప్పారు. ఆయా కంపెనీల ఏర్పాటుతో నియోజకవర్గంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ ఇన్నోవేషన్ అధికారి తౌటం శాంత, ఏసీఎం ప్రాజెక్టు మేనేజర్ అనిత, ఇంద్రావతి తదితరులు పాల్గొన్నారు.
గీసుగొండ: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంపై ఐకేపీ ఉద్యోగులు గురువారం హనుమకొండలోని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కార్యక్రమంలో ఏపీఎం సరేశ్కుమార్, సీసీలు గడ్డి అశోక్, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.